Hyderabad Married Woman Found Dead Under Mysterious Circumstances, Family Alleges Murder

Hyd, Mar 5: హైదరాబాద్‌లోని మలక్‌పేటలో వివాహిత శిరీష అనుమానాస్పద మృతి కేసులో కీలక విషయాలను పోలీసులు వెల్లడించారు. శిరీషను భర్త, ఆమె ఆడపడుచు (భర్త సోదరి) స్వాతి కలిసి హత్య (Hyderabad Woman Murder Case) చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. ఈ క్రమంలో వినయ్‌, స్వాతిని బుధవారం ఉదయం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఈ ఘటనపై పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. స్వాతి ప్లాన్‌ ప్రకారం.. శిరీషకు మత్తుమందు ఇచ్చి, స్పృహ కోల్పోయిన తర్వాత ఊపిరాడకుండా చేసి చంపినట్లు పోలీసులు తేల్చారు. తన అక్క మాట వినకుండా ఎదురు తిరుగుతుందని కోపంతో వినయ్ హత్య (Sirisha was murdered by her husband) చేసినట్టు పోలీసులు చెప్పారు. హత్య విషయం తెలిసినప్పటికీ బయటపెట్టకుండా తన సోదరితో కలిసి శిరీష మృతదేహాన్ని భర్త వినయ్‌ మాయం చేయాలనుకున్నాడని వెల్లడించారు.ఇక ఊపిరాడకుండా చేయటంతోనే ఆమె మరణించినట్టు పోస్టుమార్టం నివేదికలో సైతం వెల్లడైంది.

ప్రేమ వివాహమే ఆమె పాలిట శాపమైందా ? శిరీష మృతి కేసులో సంచలన విషయాలు వెలుగులోకి, భర్తను అదుపులోకి తీసుకుని విచారిస్తున్న పోలీసులు

అంతకుముందు.. శిరీష మెడ చుట్టూ గాయాలను గుర్తించి.. మృతురాలి బంధువులు వినయ్‌ను నిలదీయగా, పొంతన లేని సమాధానాలు చెప్పినట్టు సమాచారం. ఛాతీ నొప్పితో కుప్పకూలినపుడు సీపీఆర్‌ చేశానని, ఆ సమయంలో చేతి గోళ్లు గీసుకుపోయాయంటూ ఒకసారి.. మృతదేహాన్ని తరలించేటప్పుడు కుదుపులకు గాయాలైనట్టు మరోసారి చెప్పాడు. దీంతో, శిరీషను అతడే హత్య చేసినట్టు బంధువులు ఆరోపించారు.

నాగర్‌కర్నూలు జిల్లా దోమలపెంటకు చెందిన వినయ్‌ను 2017లో శిరీష ప్రేమ వివాహం చేసుకుంది. దంపతులిద్దరూ మలక్‌పేటలోని జమున టవర్స్‌లో ఉంటున్నారు. ప్రైవేటు ఉద్యోగం చేసిన వినయ్‌ ప్రస్తుతం ఖాళీగా ఉంటున్నాడు. శిరీష ఓ ప్రైవేటు ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తోంది. 2019లో పాప జన్మించింది. పెళ్లయిన ఏడాది నుంచే భార్యపై అనుమానంతో వినయ్‌ నిత్యం గొడవ పడేవాడు. ఈ క్రమంలోనే మార్చి రెండో తేదీన ప్లాన్‌ చేసి ఆమెను హత్య చేశారు. అనంతరం, గుండెపోటుతో చనిపోయినట్టు ఆమె తల్లిదండ్రులకు ఫోన్‌ చేసి చెప్పాడు వినయ్‌.

ఈ క్రమంలో వారు వచ్చేలోపే మృతదేహాన్ని అంబులెన్స్‌లో గ్రామానికి తీసుకెళ్లే ప్రయత్నం చేశాడు. దీంతో, శిరీష కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. దోమలపెంటకు అంబులెన్సులో తరలిస్తుండగా సీసీ ఫుటేజ్ ద్వారా వాహనాన్ని గుర్తించి పోలీసులు మృతదేహన్ని స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియాకి తరలించారు. అనుమానాస్పద మృతిగా చాదర్‌ఘాట్‌ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.