New Delhi, Dec 20: నేడు దేశవ్యాప్తంగా గ్రామాల్లో అమరులైన రైతులకు నివాళులు అమర్పించాలని రైతు సంఘాలు పిలుపునిచ్చాయి. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు నివాళులర్పించాలని నిర్ణయించాయి. చలో ఢిల్లీకి పిలుపునిచ్చిన తర్వాత వివిధ కారణాలతో 33 మంది రైతులు మృతిచెందారు. ఈనేపథ్యంలో దేశవ్యాప్తంగా లక్షకు పైగా గ్రామాల్లో సంతాప సమావేశాలు, మానవహారాలు (Farmers to pay tribute to deceased protesters) నిర్వహించనున్నారు.
అయితే ఇవాళ ఉదయం 11 గంటలకు ఘాజీపూర్ వద్ద రైతులతో అధికారులు చర్చించనున్నారు. ఈ సందర్భంగా రైతుల ట్రాక్టర్లను అడ్డుకోవడంపై అధికారులను ప్రశ్నిస్తామని రైతు సంఘాల నేతలు ఇప్పటికే ప్రకటించారు.
కేంద్రం తీసుకువచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న ఆందోళనలు (Farmers' Protest) నేటితో 25వ రోజుకు చేరాయి. కార్పొరేట్లకు లాభం చేకూర్చేలా కేంద్ర ప్రభుత్వం రూపొందించిన వివాదాస్పద సాగు చట్టాలను (New Farm Laws) రద్దు చేయాలనే డిమాండ్‌తో ఢిల్లీ శివార్లలోని సింఘు, టిక్రీ, ఘాజీపూర్ సరిహద్దుల్లో రైతులు ఆందోళనలు చేస్తున్నారు. అయితే ఢిల్లీలో చలి పంజా విసురుతోంది. దేశ రాజధాని పరిసరాల్లో ఉష్ణోగ్రతలు కనిష్ఠస్థాయికి పడిపోయినప్పటికీ రైతుల ఆందోళనలు ఇంకా కొనసాగుతున్నాయి.
దీంతో సింఘు, టిక్రీ, ఘాజీపూర్ సరిహద్దులు మూతపడ్డాయి. వ్యవసాయ చట్టాలు, రైతుల ఆందోళన విషయంలో కేంద్ర ప్రభుత్వం ప్రజలను అబద్ధాలతో తప్పుదోవ పట్టిస్తున్నదని రైతు సంఘాల నేతలు విమర్శించారు. తమ డిమాండ్లు నెరవేరే వరకు ఆందోళనలు కొనసాగుతాయని, ఇక పోరాటం తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. రైతుల ఉద్యమం రాజకీయాలకు అతీతమంటూ కేంద్రానికి రైతు సంఘాలు లేఖ రాశాయి. తమ వెనుక ఏ రాజకీయపార్టీ లేదని ప్రధాని మోదీ, వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్‌కు ఆ లేఖలో స్పష్టం చేశాయి.
ఉద్యమం రాజకీయ ప్రేరేపితమన్న మోదీ, తోమర్ విమర్శలను రైతు సంఘాలు ఖండిచాయి. రైతులను రాజకీయ పార్టీలు తప్పుదోవ పట్టిస్తున్నాయని కేంద్ర వ్యవసాయ మంత్రి తోమర్ బహిరంగ లేఖ రాశారు. అదేవిధంగా రాజకీయ పార్టీల ప్రోద్భలంతోనే రైతులు ఆందోళనలు చేస్తున్నారని ప్రధాని మోదీ ప్రకటించారు. ఈ నేపథ్యంలో రైతు సంఘాల నేతలు ప్రధాని మోదీ, మంత్రి తోమర్‌కు ఈ లేఖ రాశారు.