Fire accident at Maha Kumbh mela in Prayagraj(PTI)

Lucknow, Feb17: ఉత్తరప్రదేశ్‌ (Uttarpradesh) లోని ప్రయాగ్‌రాజ్‌ (Prayagraj) లో జరుగుతున్న మహా కుంభమేళా (Mahakumbh) లో మరోసారి అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. సెక్టార్ 18, 19 మధ్య ఉన్న అనేక మండపాలు మంటల్లో చిక్కుకున్నాయి. అగ్ని ప్రమాదానికి షార్ట్ సర్క్యూటే కారణమని అధికారులు చెబుతున్నారు. మంటలను పూర్తిగా అదుపు చేశామని తెలిపారు.

కల్పవాసీలు ఖాళీ చేసిన కొన్ని పాత గుడారాలలో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. సెక్టార్ 19లోని మోరి మార్గ్‌లో మంటలు చెలరేగాయి. నిమిషాల వ్యవధిలోనే అగ్నిమాపక సిబ్బంది ఫైర్‌ ఇంజిన్లతో రంగంలోకి దిగారు. ముందుగా అక్కడి నుంచి జనాలను క్షేమంగా తరలించారు. అయితే అప్పటికే అయోధ్య ధామ్‌లోని లవకుశ్‌ ఆశ్రమం పూర్తిగా కాలి బూడిదైపోయింది. సాయంత్రం 5.45 గంటలకు షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. ఫైర్‌ సిబ్బంది వచ్చేటప్పటికే రెండు టెంట్లు కాలిపోయాయి. ఈ మంటల్లో భద్రతా సిబ్బందికి అవసరమైన వస్తువులు కూడా కాలిపోయాయి.

40 కోట్ల మంది అనుకుంటే 50 కోట్లు దాటిపోయారు, కుంభమేళాలో 53 కోట్ల మంది పుణ్య స్నానాలు, రికార్డు స్థాయిలో పోటెత్తుతున్న భక్తులు

సెక్టార్ 18లోని హరిశ్చంద్ర మార్గ్‌లో ఉన్న గణేష్ ధామ్ ఉజ్జయిని ఆశ్రమం బాబా త్రిలోచన్ దాస్‌లో ఖాళీగా ఉన్న టెంట్‌లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పారు. కానీ అప్పటికే రెండు టెంట్లు కాలిపోయాయి. షార్ట్ సర్క్యూట్ కారణంగానే పోలీస్ క్యాంప్‌లో అగ్నిప్రమాదం జరిగిందని చీఫ్ ఫైర్ ఆఫీసర్ ప్రమోద్ కుమార్ శర్మ తెలిపారు.

మహాకుంభమేళాలో అగ్నిప్రమాదాలు జరగడం ఇది ఏడోసారి. 2025 జనవరి 19న మొదటిసారి అగ్నిప్రమాదం జరిగింది. గీతా ప్రెస్ క్యాంప్ అగ్నిప్రమాదానికి గురైంది. ఆ ప్రమాదంలో 150కి పైగా కుటుంబాలు ప్రభావితమయ్యాయి. 2025 జనవరి 30న ఛత్నాగ్ ఘాట్ వద్ద టెంట్ సిటీలో మంటలు చెలరేగి దాదాపు పది టెంట్లు దగ్ధమయ్యాయి. 2025 ఫిబ్రవరి 7న శంకరాచార్య మార్గ్‌లోని సెక్టార్‌ 18లో మంటలు చెలరేగాయి. 2025 ఫిబ్రవరి13న కూడా మహాకుంభమేళా ప్రాంతంలో అగ్నిప్రమాదం జరిగింది.

2025 ఫిబ్రవరి 15న సెక్టార్ 18లో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. 2025 ఫిబ్రవరి 17న సెక్టార్ 8లో రెండు చోట్ల మంటలు చెలరేగాయి. సెక్టార్ 18లోని బజరంగ్‌దాస్ మార్గ్‌లో అగ్నిప్రమాదం జరిగింది. అదృష్టవశాత్తూ ఈ ప్రమాదాల్లో ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదు.