New Delhi, November 9: నవంబర్ 30 వరకు అన్ని రకాల బాణసంచా విక్రయాలను, కాల్చడాన్ని చాలా రాష్ట్రాలు నిషేధించాయి ఢిల్లీ ప్రభుత్వం దేశరాజధానిలో వాయు కాలుష్యం పెరుగుతుండటాన్ని దృష్టిలో ఉంచుకుని బాణసంచా విక్రయాలపై నవంబర్ 30 వరకు నిషేధం (Firecracker Ban Orders Across India on Diwali 2020) విధించిన సంగతి విదితమే. తాజాగా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (NGT) ఢిల్లీ ఎన్సీఆర్‌లో ఈరోజు రాత్రి మొదలుకొని నవంబరు 30 వరకూ అన్నిరకాల బాణసంచా విక్రయాలను, కాల్చడాన్ని నిషేధించింది.
ఎన్జీటీ ఆదేశాల ప్రకారం వాయు కాలుష్యం ఉన్న పట్టణాల్లో, నగరాల్లోగ్రీన్ కాకర్స్ మాత్రమే వెలగించాలని కోరింది. అయితే దీపావళి, ఛఠ్, నూతన సంవత్సరం, క్రిస్మస్ తదితర వేడుకల సమయంలో కేవలం రెండు గంటపాటు మాత్రమే పొగలేని టపాసులు వెలిగించుకోవాలని ఆదేశించింది. ఈ ఉత్తర్వులు నేషనల్ క్యాపిటర్ రీజియన్(ఎన్‌సీఆర్)లో భాగమైన నాలుగు రాష్ట్రాల్లోని 2 డజనుకు పైగా జిల్లాలకు వర్తిస్తుంది. అంతేకాక దేశవ్యాప్తంగా "గత ఏడాది నవంబర్‌లో సగటు పరిసర గాలి నాణ్యత" అధ్వాన్నంగా ఉన్న నగరాలు, పట్టణాలకు కూడా ఈ ఉత్తర్వులు వర్తిస్తాయని గ్రీన్ ట్రిబ్యునల్ తెలిపింది.
ఇక దీపావళి నాడు టపాసులపై (Firecracker Ban in India) బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్(బీఎంసీ) ఆంక్షలు విధించింది. బహిరంగ ప్రదేశాల్లో టపాసుల కాల్చివేతను నిషేదిస్తూ నిర్ణయం తీసుకుంది. శబ్దం రాని టపాసులను మాత్రమే కాల్చాలని ఆదేశాల్లో పేర్కొంది. చిచ్చుబుడ్లు, కాకరపువ్వొత్తులు లాంటివి మాత్రమే కాల్చాలని పేర్కొంది. అంతేగాక రాత్రి 8 నుంచి 10 గంటల వరకు మాత్రమే టపాసులు పేల్చాలని ఆదేశాల్లో తెలిపింది.
దీపావళి పండుగని పురస్కరించుకొని కర్ణాటకలో కేవలం గ్రీన్ దీపావళి మాత్రమే జరుపుకోవాలని కర్ణాటక ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రజలు పర్యావరణహితమైన టపాసులు మాత్రమే తయారు చేసి, అమ్మాలని సీఎం యడ్డ్యూరప్ప అన్నారు. ప్రజలు నిబంధనలకు లోబడి, పిల్లలు, వృద్ధుల ఆరోగ్యం దృష్టిలో పెట్టుకుని దీపావళి జరుపుకోవాలని ఆయన సూచించారు. ఇక కోవిడ్-19 నియంత్రణకు ప్రభుత్వం అవసరం అయిన అన్ని చర్యలు తీసుకుంటుందని ముఖ్యమంత్రి తెలిపారు.
గాలిలో కాలుష్యం పెరిగితే, కరోనా వ్యాప్తి పెరిగే అవకాశం ఉందని వైద్య నిపుణులు కూడా హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే ఢిల్లీ ప్రభుత్వం దీపావళి టపాసులపై ఆంక్షలు విధించింది. ఢిల్లీ బాటలోనే రాజస్థాన్, కర్ణాటక, ఒడిశా, హర్యానా రాష్ట్రాలు కూడా నిర్ణయం తీసుకున్నాయి.
దీపావళి, గురుపూర్‌లలో రాత్రి 8-10 గంటల మధ్యన, ఛత్‌లో ఉదయం 6-8 గంటల మధ్య.. క్రిస్మస్, న్యూ ఇయర్ రోజున రాత్రి 11.55 గంటల నుంచి తెల్లవారు జామున 12.30 గంటల వరకు మాత్రమే బాణాసంచా కాల్చేందుకు అనుమతించబడినట్లు" ఉత్తర్వుల్లో పేర్కొన్నది.
ఏటా, ఉత్తర భారతదేశంలో గాలి నాణ్యత క్షీణిస్తుంది. శీతాకాలంలో విషపూరితంగా మారుతుంది, అక్టోబర్ నుండి రైతులు పంట వ్యర్థాలను కాల్చడంతో గాలి నాణ్యత క్షీణిస్తుంది. గత మూడు రోజులుగా, జాతీయ రాజధాని ప్రాంతంలో గాలి నాణ్యత చాలా దారుణంగా ఉంది. తీవ్రమైన వాయు కాలుష్యం ప్రజల ఆరోగ్యాలని ప్రభావితం చేస్తుంది. అక్టోబర్ నుంచి ఢిల్లీలోని వాయు కాలుష్యం 17.5 శాతం కోవిడ్ కేసుల పెరుగుదలకిదారితీసిందని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సంబంధం వెల్లడించింది.