పండుగల సీజన్ కావడంతో బంగారం ధరలకు రెక్కలొచ్చాయి. కొన్ని రోజులుగా రికార్డుస్థాయిలో ధరలు పెరుగుతుండగా, నిన్న రూ. 80 వేల మార్కును దాటేసింది. పది గ్రాముల స్వచ్ఛమైన బంగారంపై రూ. 750 పెరిగి రూ. 80,650 వద్ద స్థిరపడింది. మరోవైపు, వెండి ధర కూడా అదే స్థాయిలో పరుగులు పెడుతోంది. కిలో వెండిపై ఒకే రోజు రూ. 5 వేలు పెరిగి రూ. 99,500కు ఎగబాకింది.
నేడో, రేపు ఇది లక్ష రూపాయల మార్కును చేరే అవకాశం ఉంది. నాణేల తయారీతోపాటు పారిశ్రామిక వర్గాల నుంచి పెరుగుతున్న డిమాండ్ కారణంగానే వెండి ధర అమాంతం పెరిగినట్టు మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. బంగారం, వెండి ధరలు రికార్డుస్థాయికి చేరుకోవడంతో కొనుగోళ్లు తగ్గే అవకాశం ఉందని ట్రేడర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఈసారి బడ్జెట్‌లో బంగారంపై సుంకాన్ని తగ్గిస్తూ కేంద్ర నిర్ణయం తీసుకోవడంతో ధరలు 7 శాతం వరకు తగ్గాయి. అయితే, అది మూణ్నాళ్ల ముచ్చటే అయింది. పుత్తడి ధరలు జీవితకాల గరిష్ఠానికి చేరుకుని రికార్డులు బద్దలుగొడుతున్నాయి. డిమాండ్-సప్లై మధ్య అంతరం పెరగడం, గనుల్లో ఉత్పత్తి పడిపోవడం, పారిశ్రామిక వర్గాల నుంచి డిమాండ్ అధికంగా ఉండడం, పలు దేశాల్లో కరెన్సీలు బలోపేతం కావడం, అమెరికా అధ్యక్ష ఎన్నికలు, పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు వంటి కారణంగానే ధరలు పెరుగుతున్నట్టు బులియన్ వర్గాలు చెబుతున్నాయి.