'Permission Must' : కరోనా చికిత్స కోసం పొరుగు రాష్ట్రాల నుంచి తెలంగాణకు వచ్చే వారు ముందస్తు సమాచారం ఇవ్వాలి, మార్గదర్శకాలు విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం
Coronavirus Lockdown. Representative Image (Photo Credit: PTI)

Hyderabad, May 14: కరోనా చికిత్స కోసం ఇతర రాష్ట్రాల నుంచి తెలంగాణకు వచ్చే పేషేంట్లు ముందుగా ఇక్కడి ఆసుపత్రులలో బెడ్ రిజర్వ్ చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం సూచిస్తుంది. పొరుగు రాష్ట్రాల నుంచి చాలా మంది కరోనా బాధితులు అంబులెన్సుల్లో, ప్రైవేట్ వాహనాల్లో చికిత్స కోసం తెలంగాణకు వస్తున్నట్లు ప్రభుత్వం దృష్టికి వచ్చింది. అయితే బాధితులు చికిత్స కోసం ఏ ఆసుపత్రిలో చేరాలి అనే విషయం నిర్ధారణ కాకుండానే ఇక్కడ అన్ని ప్రాంతాలు తిరగడం వలన వారి సమయం వృధా అవడమే కాకుండా, ఇతర రాష్ట్రాల వైరస్ వేరియంట్లను రాష్ట్రంలో వ్యాప్తికి కారణం అవుతున్నారని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది.

ఈ మేరకు అంటు వ్యాధుల నివారణ చట్టం 1897 మరియు విపత్తు నివారణ చట్టం 2005 కింద తెలంగాణ ప్రభుత్వం మార్గదర్శకాలను విడుదల చేసింది. ఇతర రాష్ట్రల నుంచి వచ్చే కరోనా బాధితులు చట్ట ప్రకార ఈ మార్గదర్శకాలను పాటించాలని స్పష్టం చేసింది.

Here's the order copy:

* పొరుగు రాష్ట్రాల నుంచి కరోనా చికిత్సకు వచ్చే వారు తాము కోరుకునే ఆసుపత్రిలో అడ్మిషన్ కోసం ముందస్తు అనుమతి పొందాలి.

* కంట్రోల్ రూం నంబర్ 040 - 24651119 కాల్ చేసి లేదా 9494438251కు వాట్సాప్ ద్వారా తమ వివరాలు అందించాలి. మరియు idsp@telangana.gov.inకు మెయిల్ ద్వారా కూడా బాధితుడి పేరు, వారితో వచ్చే వారి పేరు, వయసు, చిరునామా, రాష్ట్రం , మొబైల్ నెంబర్ మరియు ఆసుపత్రిలో బెడ్ వివరాలు నమోదు చేయాలి.

* ఆసుపత్రి పంపిన అనుమతి మేరకు కంట్రోల్ రూం ఆ వివరాలను పరిశీలించి సదరు బాధితులు తెలంగాణ వచ్చేందుకు అనుమతిని మంజూరు చేస్తుంది. అని ప్రభుత్వం స్పష్టం చేసింది.

ఇక తెలంగాణలో లాక్ డౌన్ కొనసాగుతోంది. ఉదయం 10 గంటలు దాటగానే పోలీసులు ఎక్కడికక్కడ బారికేడ్లు, చెక్ పోస్టులు ఏర్పాటు చేస్తూ రహదారులను మూసివేస్తున్నారు. అత్యవసర సేవల వారు, అనుమతి పొందిన వారు మినహా అనవసరంగా ఎవరు బయట కనిపించినా కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరిస్తున్నారు.