New Delhi, Sep 22: వ్యవసాయ బిల్లుల ఆమోదం సందర్భంగా రాజ్యసభలో సస్పెన్షన్‌కు గురైన ఎనిమిది మంది సభ్యులు క్షమాపణలు చెప్పిన తర్వాత మాత్రమే వారి సస్పెన్షన్ రద్దును ప్రభుత్వం పరిశీలిస్తుందని కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ (Ravi Shankar Prasad) అన్నారు. ఎనిమిది మంది సభ్యుల సస్పెన్షన్ రద్దు (revoking suspension of Rajya Sabha MPs) చేయాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ నేతృత్వంలోని పలు ప్రతిపక్ష పార్టీలు రాజ్యసభ నుండి వాకౌట్ చేశాయి.
సభను కాంగ్రెస్ మొదటగా వాకౌట్ చేయగా దీన్ని అనుసరించి ఆమ్ ఆద్మీ పార్టీ, టీఎంసీ, లెఫ్ట్ పార్టీలు వాకౌట్ చేశాయి. కాగా సభలో వారి ప్రవర్తనపట్ల క్షమాపణలు చెప్పిన అనంతరం ( apologise) మాత్రమే ఈ అంశాన్ని కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తుందని రవిశంకర్ ప్రసాద్ తెలిపారు. ప్రతిపక్ష సభ్యుల వికృత చేష్టలను కాంగ్రెస్ వ్యతిరేకిస్తుందని తాము భావించామన్నారు.
ఎనిమిది మంది సభ్యులపై విధించిన సస్పెన్షన్‌ను ఎత్తివేయాలని కోరుతూ కాంగ్రెస్ నేతృత్వంలో విపక్షాలు రాజ్యసభ నుంచి మంగళవారం వాకౌట్ చేసిన నేపథ్యంలో మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. విపక్ష సభ్యుల సస్పెన్షన్‌ను వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ తొలుత సభ నుంచి వాకౌట్ చేయగదా ఆపై ఆమ్ ఆద్మీ పార్టీ, తృణమూల్ కాంగ్రెస్, వామపక్షాలు వాకౌట్ చేశాయి. రాజ్యసభలో విపక్షాల అనుచిత ప్రవర్తనను కాంగ్రెస్ వ్యతిరేకిస్తుందని తాము భావించామని మంత్రి చెప్పారు. విదేశాల నుంచి వచ్చిన ట్వీట్‌కు అనుగుణంగా ఎంపీలు ఇలా ప్రవర్తించడం ఏ తరహా రాజకీయమని ఆయన రాహుల్ ట్వీట్‌ను ఉద్దేశించి పరోక్షంగా వ్యాఖ్యానించారు.
తన తల్లి సోనియా గాంధీ ఆరోగ్య పరీక్షల కోసం రాహుల్ ఆమె వెంట విదేశీ పర్యటనలో పాల్గొన్న విషయం తెలిసిందే. రాజ్యసభ టేబుల్‌పైకి ఎక్కి నృత్యం చేస్తూ కాగితాలను చించివేసిన కాంగ్రెస్ ఎంపీని తాము ఇంతవరకూ చూడలేదని కేంద్ర మంత్రి ఆక్షేపించారు. రాజ్యసభలో వ్యవసాయ బిల్లులు ఆమోదం పొందేందుకు ప్రభుత్వానికి స్పష్టమైన మెజారిటీ ఉందని చెప్పారు.
కాగా, వ్యవసాయ బిల్లుల ఆమోదం సందర్భంగా ఆదివారం రాజ్యసభలో విపక్షాలు ఆందోళనకు దిగడంతో తీవ్ర గందరగోళం నెలకొన్న విషయం విదితమే. ఇదిలా ఉంటే పార్లమెంటు సమీపంలో సోమవారం మౌనంగా నిరసన చేపట్టిన పంజాబ్‌కు చెందిన నలుగురు పార్లమెంటు సభ్యుల పట్ల ఢిల్లీ పోలీసులు అనుచితంగా ప్రవర్తించారు. ఎంపీలపై దాడికి దిగారు. కాళ్లపై లాఠీలతో కొడుతూ, వారిని అక్కడినుంచి తొలగించేందుకు ప్రయత్నించారు. అయితే పార్లమెంటు షెడ్యూల్ కంటే ముందే బయలుదేరిన ప్రధానమంత్రి నరేంద్రమోదీకి దారి క్లియర్ చేసేందుకు ప్రయత్నించామని ఢిల్లీ పోలీసులు తెలిపారు.
అంతేకాదు ఎంపీలు తమ నిరసనకు ఎటువంటి అనుమతి తీసుకోలేదని, ప్రధానికి దారి క్లియర్ చేయడం తప్పనిసరి అని పేర్కొన్నారు. మరోవైపు మంగళవారం ఉదయం రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ నిరసన చేస్తున్న ఎంపీల వద్దకు వెళ్లి, వారిని పరామర్శించారు. టీ తాగాలని కోరారు. దీనికి ససేమిరా అన్న ఎంపీలు ఆయన్ను రైతు వ్యతిరేకి అంటూ విమర్శించారు. ఇది ఇలావుంటే హరివంశ్‌పై ప్రశంసలు కురిపించిన ప్రధాని మోదీ ఆయన తీరు ఆదర్శ ప్రాయమని వ్యాఖ్యానించడం గమనార్హం.
కాగా కేంద్రం తీసుకొచ్చిన ఈ బిల్లులును వ్యతిరేకిస్తూ సెప్టెంబరు 25న రైతు సంఘాలు దేశవ్యాప్త సమ్మెకు దిగనున్నాయనే వార్తలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వ తీసుకొచ్చిన ప్రస్తుత బిల్లుతో దేశంలోని చిన్న, సన్నకారు రైతులు మరింత నష్టాల్లోకి జారిపోతారని రైతు సంఘాలు వాదిస్తున్నాయి. ఈ బిల్లులు కార్పొరేట్లకు కొమ్ము కాసేవే తప్ప, రైతులకు మేలు చేసేవి ఎంతమాత్రం కాదనివాదిస్తున్నాయి. అటు సస్పెన్షన్ కి గురైన ఎంపీలు, రాత్రంతా పార్లమెంట్ ఎదుట తమ నిరసనను కొనసాగించారు. నిబంధనలకు పూర్తిగా విరుద్ధంగా బిల్లులును సభలో ఆమోదించారని మండిపడ్డారు. రైతుల పక్షాన తమ పోరాటం కొనసాగుతుందంటూ నిరసనను కొనసాగిస్తున్నారు.