చంద్రబాబు సర్కారు ఏపీపీఎస్సీ ఛైర్మన్‌ను బుధవారం నియమించింది. మాజీ ఐపీఎస్ అధికారిణి AR అనురాధను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆమె ఇప్పటి వరకు రాష్ట్రంలో వివిధ హోదాల్లో పని చేశారు. ఈ మేరకు గవర్నర్ అబ్దుల్ నజీర్ ఆమోదంతో అనురాధను నియమిస్తూ సీఎస్ నీరభ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో టీడీపీ హయాంలో ప్రభుత్వంలో ఇంటెలిజెన్స్ చీఫ్, హోం శాఖ కార్యదర్శిగా అనురాధ కీలక బాధ్యతలు నిర్వహించారు.ఏఆర్ అనురాధ ఏపీలో ఇంటెలిజెన్స్ విభాగానికి అధిపతిగా పనిచేసిన మొదటి మహిళా ఐపీఎస్(IPS) అధికారిగా గుర్తింపు పొందారు.
డీజీ విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగంలో కూడా ఆమె పనిచేశారు.ఉమ్మడి ఏపీలో వివిధ జిల్లాలకుగానూ ఎస్పీగా, ఐజీగా పనిచేశారు. గత ప్రభుత్వంలో ఏపీపీఎస్సీ చైర్మన్‌గా ఉన్న గౌతమ్ సవాంగ్ తన పదవికి రాజీనామా చేశారు. అయితే గౌతమ్ సవాంగ్ పదవీ కాలం మరో ఏడాదిపాటు గడువు ఉంది. అయినప్పటికీ ఆయన తన పదవికి రాజీనామా చేశారు.ఇక గత ప్రభుత్వ హయాంలో ఏపీపీఎస్సీ గ్రూప్స్ పరీక్షల నిర్వహణలో అక్రమాలు జరిగాయని టీడీపీ అప్పట్లో తీవ్ర ఆరోపణలు చేసిన సంగతి విదితమే.