Hyderabad,October 8: తెలంగాణా రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరాన్ని మరోసారి భారీ వర్షం ముంచెత్తింది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ ప్రాంతాల్లో అనుకోకుంగానే కుండపోత వాన కురిసింది. నగరంలో మధ్యాహ్నం తర్వాత వాతావరణంలో ఒక్కసారిగా మార్పులు వచ్చాయి. కారుమబ్బులు కమ్ముకుని ఏకధాటిగా కుమ్మేశాయి. చూస్తుండగానే రహదారులన్నీ జలమయం అయ్యాయి. వర్షపు నీటితో రోడ్లు చెరువులను తలపించాయి. పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది. కాగా వాతావరణ శాఖ గత రెండు రోజుల నుంచి హెచ్చరిస్తూ వస్తోంది. తెలంగాణాలో రాగల 48 గంటల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అలర్ట్ మెసేజ్ కూడా జారీ చేసింది. వాతావరణ శాఖ చెప్పినట్టుగానే హైదరాబాద్ నగరంలో భారీ కురిసింది. మధ్యాహ్నం 2.30 గంటలకు ప్రారంభమైన వర్షం గంటసేపు దంచి కొట్టింది. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. రోడ్లపై నీరు ప్రవహిస్తోంది. వెంటనే రంగంలోకి దిగిన జీహెచ్ఎంసీ అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. వాన నీరు డ్రైనేజీలోకి వెళ్లిపోయేలా చూస్తున్నారు. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఫిల్మ్‌నగర్, మాదాపూర్, అమీర్‌పేట, పంజాగుట్ట, ఎర్రగడ్డ, ఎస్సార్‌నగర్, బోరబండ, తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. భారీగా ట్రాఫిక్ జామ్ కావడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు.
ఇదిలా ఉంటే బయటకు వచ్చే వాళ్లు జాగ్రత్తలు తీసుకోవాలని జీహెచ్ఎంసీ ప్రకటించింది. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో తెలంగాణలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఉరుములతో కూడిన వర్షం రావడంతో ప్రజలు భయబ్రాంతులకు గురయ్యారు. మరో రెండు రోజులు వర్షాలు కురుస్తాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.