Heavy rainfall warning in Telangana for next 3 days (Photo-PTI)

Hyderabad, October 6:  గత కొద్ది రోజుల నుంచి హైదరాబాద్‌ని భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. కుండపోతగా కురుస్తున్న వర్షాలతో హైదరాబాద్ నగరంలోని రోడ్లనీ నదులను తలపిస్తున్నాయి. అటు పక్క ఎల్బీ నగర్ నుంచి మొదలుపెడితే ఇటుపక్క మాదాపూర్ వరకు ఎటు చూసినా ఈ వర్షాలతో జనాలు అతలాకుతలం అవుతున్నారు. ఓ పక్క బతుకమ్మ సంబరాలు, మరో పక్క తెలంగాణా స్ట్రైక్‌కి వర్షాలు కూడా తోడవడంతో తెలంగాణా రాష్ట్రంలోని ప్రజలకు ఏం చేయాలో పాలుపోవడం లేదు. ఈ రోజు బతుకమ్మ సంబరాల్లో ప్రధానమైన ఘట్టం సద్దుల బతుకమ్మ కావడంతో వర్షాలు దెబ్బకి ఎక్కడా పండగ వాతావరణం కనిపించడం లేదు. ఆర్టీసీ సమ్మె దెబ్బకు ఊళ్లకు వెళ్లేందుకు బస్సులు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులను ఎదుర్కుంటున్నారు. షాపింగ్ క్లాంపెక్స్ ల నుంచి నివసించే అపార్ట్ మెంట్లు దాకా వర్షపు నీటితో నిండిపోయాయి.

తెలుగు రాష్ట్రాల్లో రానున్న మూడు రోజులు వర్షాలు

ఇదిలా ఉంటే ఒక పక్క క్యుములోనింబస్ మేఘాలతో పాటు, దక్షిణ ఛత్తీస్‌గడ్ కోమోరిన్ ప్రాంతం వరకు తెలంగాణ, రాయలసీమ, ఇంటీరియర్ తమిళనాడు మీదుగా 0.9 కి.మీల వద్ద ఉపరితల ద్రోణి ఏర్పడిందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. జార్ఖండ్ దానిని ఆనుకొని ఉన్న ఉత్తర ఒరిస్సా ప్రాంతాల్లో 1.5 కి.మీల ఎత్తు వద్ద ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని అధికారులు తెలిపారు. ఈశాన్య జార్ఖండ్ దాని పరిసర ప్రాంతాల్లో 0.9 కి.మీల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని వాతావరణ శాఖ పేర్కొంది. ఈ నేపథ్యంలో తెలంగాణ వ్యాప్తంగా రాగల మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. కోస్తాంధ్ర, యానాంలలో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని, ఉత్తరకోస్తాంధ్రలో ఒకటి, రెండుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రాయలసీమలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు, ఒకటి రెండుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

వాతావరణ శాఖ ట్వీట్ 

కొట్టుకుపోయిన మూసీ నది గేటు

గత వారం రోజులుగా హైదరాబాద్ నగరంలో భారీగా వర్షాలు కురుస్తుండటంతో వరద నీరు అంతా మూసీలో వచ్చి చేరింది. ఈ వరద ధాటికి జలశాయంలోని ఆరో నంబర్ గేటు కొట్టుకుపోయింది. దీంతో ప్రాజెక్ట్‌లోని నీరంతా దిగువన ఉన్న మూసీ నదిలోకి వృథాగా వెళ్తోంది.ఈ ప్రాజెక్టు పరిధిలో నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లోని 42 గ్రామాల పరిధిలో 33 వేల ఎకరాలు సాగవుతోంది. డెడ్‌ స్టోరేజీ గేటు కొట్టుకు పోవడంతో జలాశయంలో నీరు అడుగంటే ప్రమాదం ఉందన్న ఆందోళన స్థానికుల్లో వ్యక్తమవుతోంది.సమాచారం తెలియడంతో మంత్రి జగదీశ్‌రెడ్డి ఘటనపై సమాచారం అడిగి తెలుసుకున్నారు.

వీడని వర్షాలు

బతుకమ్మ నిమజ్జనానికి వర్షాల భయం

బతుకమ్మ పండుగ కోసం బతుకమ్మలను సిద్ధం చేస్తున్న మహిళలు ఈ వర్షం దెబ్బకి ఆందోళన పడుతున్నారు. భారీగా వర్షం కురవడంతో.. రోడ్లన్నీ జలమయం అయ్యాయి. పంజాగుట్ట, బేగంపేట, కేపీహెచ్‌‌బీ, అబిడ్స్, నాంపల్లి, ముషీరాబాద్‌, అంబర్‌పేట, నాగోల్‌, బండ్లగూడ, దిల్‌సుఖ్‌ నగర్‌, మలక్‌పేట, ఎల్బీనగర్‌, వనస్థలిపురం, సైదాబాద్‌, చంపాపేట్‌, సరూర్‌నగర్‌, తదితర ప్రాంతాల్లో భారీగా వర్షం కురిసింది. కుండపోత వర్షం సుందరయ్య పార్కు సమీపంలో మోకాళ్ల లోతు వరద నీరు చేరింది. దీంతో బైకులు నీటిలో కొట్టుకుపోయాయి. భారీగ వర్షం కురవడంతో వాహనదారులు తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు. ఆదివారం సెలవు దినం కావడంతో ఉద్యోగులు వర్షం కష్టాల నుంచి తప్పించుకున్నారు. స‌ద్దుల బ‌తుక‌మ్మ‌ సందర్భంగా ట్యాంక్‌బండ్‌పై ఆదివారం నాడు భారీ సంఖ్య‌లో మ‌హిళ‌లు బతుకమ్మ ఆడనున్నారు. ఎల్బీ స్టేడియం నుంచి ట్యాంక్‌బండ్ వ‌ర‌కు బతుకమ్మ శోభాయాత్ర నిర్వ‌హించి బ‌తుక‌మ్మ‌ ఘాట్‌లో బతుకమ్మలను నిమజ్జనం చేసేందుకు జీహెచ్ఎంసీ ఏర్పాట్లు చేసింది. అయితే వర్షం అలర్ట్ తో ఏమవుతుందోనని టెన్సన్ నెలకొంది.

బీహార్‌ను కుదిపేసిన వరదలు

బీహార్‌ను కుదిపేసిన వరదలతో అక్కడి బాధిత ప్రాంత ప్రజలు నరక యాతన అనుభవిస్తున్నారు. 3 వారాలుగా  జలదిగ్బంధంలో చిక్కుకుని చాలామంది చెట్లపైన, ఇళ్ల పైకప్పులపైనా ఉండి ప్రాణాలు నిలబెట్టుకుంటున్నారు. తినేందుకు తిండి, తాగేందుకు నీరు కూడా లేని పరిస్థితుల్లో కుటుంబాలతో సహా అల్లాడిపోతున్నారు. ‘బయట ప్రపంచానికి మా పరిస్థితి తెలిసే అవకాశం కూడా లేకపోవడం మా దురదృష్టం’ అని బాధితులు వాపోతున్నారు. రాష్ట్రంలో భాగల్‌పూర్‌ జిల్లాలోని పలు ప్రాంతాలు ఇంకా జలదిగ్బంధంలోనే ఉన్నాయి. చాలామందికి ప్రస్తుతం ఇళ్ల పైకప్పులే ప్రధాన ఆధారమయ్యాయి.