Amaravati, Nov 5: తమిళనాడును మరో అయిదు రోజులపాటు భారీ వర్షాలు (Heay Rain Alert) ముంచెత్తనున్నాయని చెన్నైలోని వాతావరణ పరిశోధనా కేంద్రం డైరెక్టర్ పువియరసన్ తెలిపారు. ప్రజలకు, ప్రభుత్వానికి ముందస్తు హెచ్చరికగా ఎల్లో అలర్ట్‌ను ప్రకటించారు. తమిళనాడులో ( heavy rains in Tamil Nadu) గతనెల 28న ఈశాన్య రుతుపవనాలు ప్రవేశించాయి. అయితే నాలుగురోజులు గడిచినా చెప్పుకోదగ్గ అల్పపీడన ద్రోణి ఇంతవరకు ఏర్పడలేదు. సహజమైన ఉష్ణోగ్రతల వల్ల రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. తొలిరోజునే చెన్నైలో 20 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.
రాష్ట్రంలోని సముద్ర తీర ప్రాంతం, దానికి ఆనుకునే ఉన్న నైరుతి సముద్రం, శ్రీలంక, తూర్పు అండమాన్ దీవుల వద్ద కేంద్రీకృతమై ఉన్న ఉపరితల ఆవర్తనం కారణంగా కోవై, తేని, దిండుగల్లు, మదురై, విరుదునగర్, తిరునెల్వేలి, తెన్‌కాశి, కన్యాకుమారి, తూత్తుకూడి జిల్లాల్లో పిడుగులతో కూడిన భారీ వర్షాలు, చెన్నై దాని పరిసరాల్లో మోస్తరు వర్షం కురుస్తుందని వాతావరణ కేంద్రం తెలిపింది.
ఈశాన్య రుతుపవనాలు బలపడుతుండడంతో రాష్ట్రంలో వర్షాలు మరింత పెరిగే అవకాశం ఉంది. రాబోయే 24 గంటల్లో భారీ వర్షాలు, కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది. ఈనెల 7వ తేదీ వరకు రాష్ట్రంలోని సముద్రతీర ప్రాంతాల్లో జోరుగా వర్షాలు కురుస్తాయి. పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న జిల్లాల్లో ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టేందుకు వీలుగా ఎల్లో ఎలర్ట్‌ను (Yello alert) ప్రకటించినట్లు పువియరసన్ తెలిపారు.
మంగళవారం రాత్రి నుంచి బుధవారం మధ్యాహ్నం వరకు ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షంతో చెన్నై నగరవాసులు ఉక్కిరిబిక్కిరయ్యారు. భారీ వర్షానికి నగరంలో పలు ప్రాంతాల్లో రోడ్లన్నీ చెరువులను తలపించాయి. ద్విచక్రవాహనాలు పూర్తిగా మునిగిపోగా, కార్లలో ప్రయాణించే వారు కూడా జలప్రవాహాన్ని దాటేందుకు కష్టపడ్డారు. బెంగళూరులో వాతావరణ పరిస్థితి అనుకూలంగా లేకపోవడంతో చెన్నై నుంచి ఆరు విమానాలు ఆలస్యంగా బయలుదేరాయి. అలాగే బెంగళూరు నుంచి చెన్నైకి రావాల్సిన రెండు విమానాల విషయంలో తీవ్ర జాప్యం జరిగింది.
తెలుగు రాష్ట్రాలకు ఐఎండీ హెచ్చరిక
వచ్చే అయిదు రోజులు రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు (Rains warning for telugu states) కురుస్తాయని భారత వాతావరణ శాఖ (IMD) హెచ్చరించింది. నవంబర్ 5వ తేదీ నుంచి 8వ తేదీ దాకా రెండు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలకు అవకాశం మెండుగా వుందని ఐఎండీ బుధవారం నాడు బులెటిన్ రిలీజ్ చేసింది.
బంగాళాఖాతంపై నైరుతి దిశగా సైక్లోనిక్ సర్క్యులేషన్ ఫామ్ అయినందున రెండు రాష్ట్రాలు అంటే తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలకు ఆస్కారముందని ఐఎండీ శాస్త్రవేత్తలు అంఛనా వేస్తున్నారు. తమిళనాడు, కేరళ రాష్ట్రాలతోపాటు కేంద్ర పాలిత ప్రాంతాలైన పుదుచ్ఛేరి, లక్ష్యద్వీప్, కర్నాటక రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాలలో వర్షాలు కురుస్తాయని ఐఎండీ బులెటిన్‌లో పేర్కొన్నారు.
బంగాళాఖాతంపై ఏర్పడిన సైక్లోనిక్ సర్క్యులేషన్ ప్రభావం ఆగ్నేయ అరేబియా సముద్ర ఉపరితలంపై కూడా వుంటుందని, దాని ప్రభావంతో దక్షిణ కర్నాటక, కేరళ, లక్ష్వద్వీప్ ప్రాంతాలలో అయిదు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని అంఛనా వేస్తున్నారు. అదే సమయంలో మధ్య, ఉత్తర, పశ్చిమ భారత దేశ రాష్ట్రాలలో వాతావరణం వచ్చే అయిదు రోజుల పాటు అంటే నవంబర్ 8వ తేదీ దాకా పొడిగా వుంటుందని ఐఎండీ శాస్త్రవేత్తలు తెలిపారు.