Bengaluru, Feb 10: దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన హిజాబ్ వివాదంపై కర్ణాటక హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. విద్యా సంస్థల మూసివేతపై హైకోర్టు తీర్పునిస్తూ ఎట్టిపరిస్థితుల్లోనూ విద్యాసంస్థలు తెరవాలని (Schools and Colleges Must Open Soon) ఆదేశించింది. ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అదే సమయంలో తుది తీర్పు వచ్చే వరకు (No Religious Symbols Allowed For Students Until Final Order) విద్యార్థులు హిజాబ్-కండువాల ప్రస్తావన తేవొద్దని తెలిపింది. ఈ సమస్య పరిష్కారమయేంత వరకు విద్యార్థులు తమ మతాచారాలను ప్రతిబింబించేలా ఎలాంటి దుస్తులు ధరించరాదని స్పష్టం చేసింది. తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది.
హిజాబ్ రగడపై దాఖలైన పిటిషన్‌ను సీజే జస్టిస్ రితురాజ్ అవస్థీ నేతృత్వంలోని హైకోర్టు విచారించింది. గురువారం విచారించిన ధర్మాసనం ( Karnataka HC) తుది తీర్పును ఈనెల 14వ తేదీకి వాయిదా వేసింది. కాగా, వివాదంపై మంగళ, బుధవారాల్లో హైకోర్టులో జరిగిన విచారణలో పరీక్షలు రెండు నెలలే ఉన్నందున ప్రస్తుతానికి మధ్యంతర ఉత్తర్వులైనా ఇవ్వాలని పిటిషనర్లు అభ్యర్థించిన సంగతి తెలిసిందే.
విచారణను వాయిదా వేయడానికి ముందు చీఫ్ జస్టిస్ రితు రాజ్ అవస్థి మాట్లాడుతూ.. ఈ సమస్య కోర్టులో పెండింగులో ఉన్నంత వరకు విద్యార్థులెవరూ తమ మతాచారాలకు అనుగుణంగా దుస్తులు ధరించరాదని స్పష్టం చేశారు. కాగా, ఈ పిటిషన్‌పై విచారణ కోసం కోర్టు నిన్న చీఫ్ జస్టిస్ రితురాజ్ అవస్థి, జస్టిస్ కృష్ణ ఎస్ దీక్షిత్, జస్టిస్ జైబున్నీసా ఎం ఖాజీలతో త్రిసభ్య బెంచ్‌ను ఏర్పాటు చేసింది. కర్ణాటకలో హిజాబ్ వివాదం గతేడాది డిసెంబరులో మొదటిసారి వెలుగుచూసింది. ఉడుపిలోని ప్రభుత్వ కళాశాల విద్యార్థినులు హిజాబ్ ధరించి వచ్చారు. దీనికి నిరసనగా కొందరు విద్యార్థులు కాషాయ కండువాలు ధరించి కళాశాలకు వచ్చారు.
రెండు రోజుల క్రితం ఈ గొడవ మరింత ముదిరి హింసాత్మకంగా మారడంతో ప్రభుత్వం మూడు రోజులపాటు విద్యాసంస్థలకు మూడు రోజులపాటు సెలవులు ప్రకటించింది. ఇక హైకోర్టు తీర్పు నేపథ్యంలో మూసివేసిన విద్యాసంస్థలను దశల వారీగా తిరిగి తెరవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. తొలి దశలో సోమవారం (14వ తేదీ) నుంచి పదో తరగతి వరకు విద్యార్థులను అనుమతిస్తారు. ఆ పై తరగతులకు సంబంధించి మాత్రం తర్వాత నిర్ణయం తీసుకుంటారు. ముఖ్యమంత్రి బొమ్మై శుక్రవారం సాయంత్రం 5 గంటలకు ఈ విషయమై మంత్రులతో సమావేశమై చర్చిస్తారు. ఈ సమావేశంలో కలెక్టర్లు, పోలీసు అధికారులు కూడా హాజరవుతారు.