Hyd, Nov 5: తెలంగాణ రాష్ట్ర రాజధానిలో గత మూడు రోజుల్లో హెల్మెట్ లేకుండా వాహనం నడుపుతూ ముగ్గురు రైడర్లు ప్రాణాలు కోల్పోయారని సిటీ ట్రాఫిక్ చీఫ్ పి.విశ్వప్రసాద్ సోమవారం పేర్కొన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని నేటి నుంచి నగర వ్యాప్తంగా హెల్మెట్, రాంగ్ సైడ్/రాంగ్ రూట్ డ్రైవింగ్‌పై ప్రత్యేక డ్రైవ్స్ నిర్వహిస్తున్నట్లు ఆయన ప్రకటించారు.
ఈ ఏడాది ఇప్పటి వరకు జరిగిన రోడ్డు ప్రమాదాల్లో 215 మంది మృతి చెందారని తెలిపిన ఏసీపీ...వీరిలో 100 మంది ద్విచక్ర వాహన చోదకులే అని పేర్కొన్నారు. వీరిలో 46 మంది హెల్మెట్ ధరించని కారణంగానే చనిపోయారని, హెల్మెట్ ధరిస్తే క్షతగాత్రులుగా మారే ప్రమాదం 70 శాతం, మృత్యువాతపడే ముప్పు 40 శాతం తగ్గుతుందని ఏసీపీ విశ్వప్రసాద్ వివరించారు.
ఈ నేపథ్యంలోనే నగరంలోని ద్విచక్ర వాహనచోదకులు 100 శాతం హెల్మెట్ ధరించేలా చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నామని తెలిపారు. ఇందులో భాగంగా నేటి నుంచి స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నామని తెలిపారు. దీంతో పాటు రాంగ్ సైడ్ డ్రైవింగ్ పైనా దృష్టి పెడుతున్నామని పేర్కొన్నారు. ట్రాఫిక్ నిబంధనలు, భద్రతపై ప్రయాణికులకు అవగాహన కల్పించేందుకు ట్రాఫిక్ పోలీసులు అనేక ట్రాఫిక్ ఎడ్యుకేషన్, అవగాహన శిబిరాలను నిర్వహిస్తున్నారని తెలిపారు.
హెల్మెట్ ధరించని వారికి రూ.200, రాంగ్ సైడ్/రాంగ్ రూట్ డ్రైవింగ్‌కి రూ.2 వేలు జరిమానా విధిస్తామని తెలిపారు. నగరవాసులు సైతం తమ దృష్టికి వచ్చిన ఉల్లంఘనల్ని ట్రాఫిక్ పోలీసు అధికారిక ఫేస్‌బుక్, ఎక్స్ ఖాతాలతో పాటు హెల్ప్‌లైన్ నెం.9010203626 ద్వారా అధికారుల దృష్టికి తేవాలని కోరారు.
మోటారు వాహన చట్టం, 1988 ప్రకారం హెల్మెట్ ధరించని, రాంగ్ సైడ్ డ్రైవింగ్ ఉల్లంఘనలకు సెక్షన్లు, జరిమానాలు:
• హెల్మెట్ లేకుండా డ్రైవింగ్ చేయడం MV చట్టంలోని సెక్షన్ 129/177 ప్రకారం ఉల్లంఘన
• హెల్మెట్ లేకుండా డ్రైవింగ్ చేయడం ద్వారా రూ.200 జరిమానా విధిస్తారు.
• MV చట్టంలోని సెక్షన్ 119/177 మరియు 184 ప్రకారం తప్పుగా/మార్గంలో డ్రైవింగ్ చేయడం శిక్షార్హమైనది
• దీనిపై రూ. 2000 జరిమానాతో పాటుగా డ్రైవింగ్ లైసెన్స్ సస్పెన్షన్ ఉంటుంది.
• మోటారు వాహనాల చట్టంలోని సెక్షన్ 19 ప్రకారం 3 నెలల పాటు లైసెన్స్ సస్పెన్షన్.
• హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు అప్రమత్తమైన ప్రయాణికులు ట్రాఫిక్ ఉల్లంఘనల గురించి తెలియజేయవలసిందిగా అభ్యర్థించారు
• వారు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ Facebook, X (ట్విట్టర్), ట్రాఫిక్ హెల్ప్ లైన్ – 9010203626 ద్వారా తెలియజేయవచ్చు.