COVID-19 Scare: ఒకరి నుంచి 30 రోజుల్లో 406 మందికి కరోనావైరస్, లాక్‌డౌన్ ఆదేశాలు పాటించ‌కుంటే జరిగేది అదేనన్న ఆరోగ్య‌శాఖ, భార‌త్‌లో వైర‌స్ వ‌ల్ల 117 మంది మృతి
ICMR Study Shows One COVID-19 Patient Can Infect 406 Persons in 30 Days if Lockdown Order Flouted: Health Ministry (Photo Credits: IANS)

New Delhi, April 8: కరోనావైరస్ (Coronavirus) పేషెంట్ ఒక‌వేళ లాక్‌డౌన్ ఆదేశాలు (Lockdown Orders) పాటించ‌కుంటే లేదా ఆ పేషెంట్ సామాజిక దూరాన్ని పాటించకున్నా.. వారి నుంచి క‌రోనా వైర‌స్ (Deadly COVID-19) కేవ‌లం 30 రోజుల్లో 406 మందికి సోకే ప్ర‌మాదం ఉంద‌ని కేంద్ర ఆరోగ్య‌శాఖ (Health Ministry) వెల్ల‌డించింది.

లాక్‌డౌన్‌ను పొడగించే ఆలోచనలో కేంద్ర ప్రభుత్వం?

ఈ విష‌యాన్ని ఇవాళ మీడియాతో మాట్లాడిన ఆరోగ్య‌శాఖ జాయింట్ సెక్ర‌ట‌రీ ల‌వ్ అగ‌ర్వాల్ (Luv Aggarwal) తెలిపారు. ఐసీఎంఆర్ (ICMR) నిర్వ‌హించిన స్ట‌డీలో ఇది నిర్ధార‌ణ అయిన‌ట్లు ఆయ‌న తెలిపారు. కాగా ఇప్ప‌టి వ‌ర‌కు భార‌త్‌లో వైర‌స్ వ‌ల్ల 117 మంది చ‌నిపోయిన‌ట్లు ఆయ‌న చెప్పారు. 4421 కేసులు పాజిటివ్‌గా తేలాయ‌న్నారు.

భార‌తీయ రైల్వే దాదాపు 2500 కోచ్‌ల్లో.. సుమారు 40 వేల ఐసోలేష‌న్ బెడ్‌ల‌ను త‌యారీ చేసిన‌ట్లు ల‌వ్ అగ‌ర్వాల్‌ చెప్పారు. ప్ర‌తి రోజూ రైల్వేశాఖ 375 ఐసోలేష‌న్ బెడ్ల‌ను త‌యారీ చేస్తున్న‌ట్లు వెల్ల‌డించారు. మొత్తం 133 లొకేష‌న్ల‌లో ఈ ప‌ని జ‌రుగుతుంద‌న్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు ల‌క్షా ఏడు వేల ఆరు మందికి క‌రోనా ప‌రీక్ష‌లు జ‌రిపిన‌ట్లు ఐసీఎంఆర్ ఎపిడ‌మాల‌జీ అధిప‌తి గంగాఖేద్క‌ర్‌ తెలిపారు. 136 ప్ర‌భుత్వ ల్యాబ్‌లు ప‌రీక్ష‌లు చేప‌డుతున్నాయ‌ని, 59 ప్రైవేటు ల్యాబ్‌లు కూడా ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తున్న‌ట్లు ఆయ‌న చెప్పారు.

ఐఆర్‌సీటీసీ కీలక నిర్ణయం, ఏప్రిల్ 30 వరకు రైల్వే టికెట్ల ఆన్‌లైన్‌ బుకింగ్ రద్దు

ప్రాణాంతక మహమ్మారి కరోనా వైరస్ (Coronavirus) ప్రపంచ వ్యాప్తంగా మృత్యు ఘంటికలు మోగిస్తోంది. కోవిడ్-19 కారణంగా ఇప్పటి వరకు మృతి చెందిన వారి సంఖ్య 75 వేలు దాటినట్టు ఏజెన్సీ ఫ్రాన్స్‌ ప్రెస్‌ (ఏఎఫ్‌పీ) వర్గాలు వెల్లడించాయి. గతేడాది డిసెంబర్లో చైనాలోని వుహాన్‌ కేంద్రంగా వెలుగుచూసిన ఈ మహమ్మారి కారణంగా ఐరోపాలోనే అత్యధిక మరణాలు నమోదయ్యాయి.

ఇప్పటివరకు మొత్తం 75,558 కరోనా మరణాలు నమోదు కాగా.. ఒక్క ఐరోపా ఖండంలోనే 53,928 మంది చనిపోయారు. ఇవన్నీ అధికారికంగా నమోదైన గణాంకాలు మాత్రమే. దాదాపు చాలా దేశాల్లో అత్యంత తీవ్రమైన కేసుల్లోనే ప్రస్తుతం వైద్య పరీక్షలు జరుపుతున్నారు.

కాగా ఫిబ్రవరి చివరిలో తొలి కరోనా మరణం నమోదైన ఇటలీలో ఇప్పటివరకు అత్యధికంగా 16,523 మంది ప్రాణాలు కోల్పోయారు. స్పెయిన్‌లో 13, 798 మంది, అమెరికాలో 10,993 మంది, ఫ్రాన్స్‌లో 8,911 మంది ఈ మహమ్మారికి బలయ్యారు. ఇప్పటివరకు ప్రపంచ వ్యాప్తంగా 13.5 లక్షల మందికి పైగా కరోనా బారిన పడగా.. ఒక్క ఐరోపాలోనే 7 లక్షలకు పైగా కోవిడ్-19 కేసులు నమోదయ్యాయి. అమెరికా, కెనడా వ్యాప్తంగా 3.8 లక్షలు, ఆసియాలో 1.22 లక్షల మందికి కరోనా సోకినట్టు గుర్తించారు.