New Delhi, April 7: దేశంలో కరోనావైరస్ (Coronavirus) విలయతాండవం చేస్తోంది. రోజు రోజుకు కేసులు పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం (Central Govt) దాని కట్టడికి చర్యలను తీసుకుంది. దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ విధించింది. మార్చి 24 నుంచి 21 రోజుల పాటు దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ (India Lockdown) విధించిన సంగతి తెలిసిందే. అది ఈ నెల 15తో ముగిసిపోనుంది. ఆ తర్వాత రైళ్లు, విమానాలు తిరుగుతాయని భావిస్తున్నవారికి ఇండియన్ రైల్వే (Indian Railways) ఝలక్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది.
లాక్‌డౌన్ తర్వాత రైళ్లు నడవడంపై స్పందించిన రైల్వే శాఖ
తాజాగా భారతీయ రైల్వే శాఖ అనుబంధ సంస్థ అయిన ఐఆర్‌సీటీసీ (IRCTC) కీలక నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. రైల్వే టికెట్లను ఆన్‌లైన్‌లో బుక్ చేసుకునే సదుపాయాన్ని ఏప్రిల్ 30 వరకు రద్దు చేస్తున్నట్లు ఐఆర్‌సీటీసీ ప్రకటించింది. కేవలం తేజస్ 2 రైళ్లు, Kashi Mahakal Express ఒకటి మాత్రమే తిరుగుతాయని ఐఆర్‌సిటిసి ప్రతినిధి ప్రకటించారు. ఐఆర్‌సీటీసీ (Indian Railway Catering and Tourism Corporation) తీసుకున్నఈ నిర్ణయంతో లాక్‌డౌన్ పొడిగింపుపై పరోక్ష సంకేతాన్ని ఇచ్చినట్లయింది.
ఐఆర్‌సీటీసీ ప్రస్తుతం రెండు తేజాస్ రైళ్లను, కాశీ ఎక్స్‌ప్రెస్‌ను నడుపుతోంది. కాశీ మహాకాళ్ ఎక్స్‌ప్రెస్ వారణాసి-ఇండోర్ రూట్‌లో రాకపోకలు సాగిస్తుండగా, తేజాస్ రైళ్లు లక్నో-న్యూఢిల్లీ, అహ్మదాబాద్-ముంబై రూట్లలో నడుస్తున్నాయి. ఈ రూట్లలో ప్రైవేట్ రైళ్లను ఏప్రిల్ 15-30 వరకూ ఐఆర్‌సీటీసీ నిలిపివేసింది. దేశవ్యాప్తంగా 28 ప్రాంతాల్లోని తమ కిచెన్లలో ఆహారం సిద్ధం చేసి ప్రజలకు సరఫరా చేసేందుకు సన్నాహాలు చేపట్టామని ఐఆర్‌సీటీసీ తెలిపింది.
Here's ANI Tweet
Indian Railway Catering and Tourism Corporation (IRCTC) has decided to suspend bookings for trains that are run by it, till 30th April. IRCTC runs three trains as of now, 2 Tejas trains and 1 Kashi Mahakal Express: IRCTC Spokesperson pic.twitter.com/7IC2LJekws
— ANI (@ANI) April 7, 2020
కాగా ఈ నెలాఖరు వరకూ లాక్‌డౌన్‌ను పొడిగించాలన్న ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నారనే వాదన తెరపైకొచ్చింది. పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా లాక్‌డౌన్ పొడిగింపే మేలనే భావనకు రావడంతో కేంద్రం ఆ దిశగానే అడుగులేస్తున్నట్లు సమాచారం. కాగా కరోనా కట్టడికి మార్చి 24 నుంచి దేశవ్యాప్తంగా అమలవుతున్న లాక్‌డౌన్‌ను పొడిగించాలని పలు రాష్ట్రాలు చేసిన వినతులపై కేంద్రం సానుకూలంగానే స్పందించినట్లే కనిపిస్తోంది.
లాక్‌డౌన్‌ను పొడగించే ఆలోచనలో కేంద్ర ప్రభుత్వం?
ఇదిలా ఉంటే ఐఆర్సీటీసీ వెబ్ సైట్ ద్వారా నాలుగు రోజుల క్రితమే రైల్ రిజర్వేషన్ ప్రారంభం కాగా, 15, 16 తేదీలకు దాదాపు అన్ని రైళ్లకూ బుకింగ్స్ పూర్తికాగా, కొన్ని రైళ్లలో 100 వరకూ వెయిటింగ్ లిస్ట్ కనిపిస్తోంది. వివిధ ప్రాంతాల నుంచి స్వస్థలాలకు వచ్చి, తిరిగి వెనక్కు వెళ్లలేకపోయిన వారు ఈ టికెట్లను బుక్ చేసుకున్నట్టు తెలుస్తోంది.
ఒకవేళ లాక్ డౌన్ కొనసాగినట్లయితే, ఆన్ లైన్ లోనే టికెట్ల రద్దునకు అవకాశం ఉండటంతో, ఎందుకైనా మంచిదన్న ఉద్దేశంతో టికెట్లను ప్రయాణికులు బుక్ చేసుకుంటున్నారు.ఇక ఈ వేసవిలో పిల్లా జెల్లాతో కలిసి విహార యాత్రలకు ప్లాన్ చేసుకున్న వారిలో అత్యధికులు తమ ప్రయాణాలను రద్దు చేసుకోవడంతో, కొన్ని రైళ్లలో మే, జూన్ నెల ప్రయాణాలకు టికెట్లు కనిపిస్తున్నాయి.