New Delhi, Feb 28: దేశంలో గత కొద్ది రోజులుగా నిత్యం 16వేలకుపైగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. తాజాగా గడిచిన 24గంటల్లో 16,752 పాజిటివ్ కేసులు (India Covid Updates) నమోదయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వశాఖ ఆదివారం తెలిపింది. తాజాగా నమోదైన కేసులతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1,10,96,731కు పెరిగాయి.
కొత్తగా 11,718 మంది డిశ్చార్జి కాగా.. ఇప్పటి వరకు 1,07,75,169 మంది కోలుకున్నారని మంత్రిత్వశాఖ చెప్పింది. మరో 113 మంది మృత్యువాతపడగా.. మొత్తం మృతుల సంఖ్య 1,57,051కు పెరిగిందని పేర్కొంది. ప్రస్తుతం దేశంలో 1,64,511 యాక్టివ్ కేసులున్నాయని, టీకా డ్రైవ్‌లో భాగంగా 1,43,01,266 మందికి వ్యాక్సిన్ వేసినట్లు ఆరోగ్య మంత్రిత్వశాఖ వివరించింది.
తెలంగాణలో తాజాగా మరో 176 మందికి కరోనా పాజిటివ్ గా (TS Coronavirus) నిర్ధారణ అయింది. అదే సమయంలో 163 మంది కోలుకోగా, ఒకరు మృతి చెందారు. తెలంగాణలో ఇప్పటివరకు 2,98,807 పాజిటివ్ కేసులు నమోదు కాగా 1,634 మంది మరణించారు. కాగా, మహారాష్ట్రలో కరోనా కేసులు మళ్లీ అధికమవుతుండడం పట్ల పొరుగునే ఉన్న తెలంగాణలో ఆందోళన వ్యక్తమవుతోంది. అయితే మహారాష్ట్రలో నమోదువుతున్న కేసులకు కొత్త స్ట్రెయిన్ కారణమా లేక పాత రకం కరోనా వల్లే వ్యాప్తి జరుగుతోందా అనేది ఇంకా తెలియరాలేదు.
ఏపీ రాష్ట్రంలో గడచిన 24 గంటల్లో 37,041 కరోనా పరీక్షలు నిర్వహించగా 118 మందికి పాజిటివ్ (AP Coronavirus) అని తేలింది. చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 33 కొత్త కేసులు నమోదయ్యాయి. గత వారం రోజుల వ్యవధిలో చిత్తూరు జిల్లాలోనే ఎక్కువ కేసులు వస్తున్నాయి. ఇక ఇతర జిల్లాల విషయానికొస్తే... తూర్పు గోదావరిలో 14, విశాఖలో 14, గుంటూరు జిల్లాలో 13 కేసులు గుర్తించారు.
విజయనగరం జిల్లాలో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. అదే సమయంలో 86 మంది కొవిడ్ నుంచి కోలుకున్నారు. ఎలాంటి మరణాలు సంభవించలేదు. ఏపీలో ఇప్పటివరకు 8,89,799 పాజిటివ్ కేసులు నమోదు కాగా 8,81,963 మంది కోలుకున్నారు. ఇంకా 667 మంది చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో కరోనా మృతుల సంఖ్య 7,169గా నమోదైంది.
మహారాష్ట్రలో కరోనా ఒక్కరోజే కొత్తగా 8 వేల పైచిలుకు కరోనా కేసులు (Maharashtra Coronavirus) నమోదయ్యాయి. ఇలా జరగడం ఇది వరుసగా నాలుగో సారి. ప్రభుత్వ గణాంకాల ప్రకారం.. గత 24 గంటల్లో మహారాష్ట్రలో కొత్తగా 8,623 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 21,46,777కు చేరుకుంది. మరణాల రేటు 2.43 శాతంగా నమోదైంది. కరోనా టెస్టులకు సంబంధించిన పాజిటివిటీ రేటు 13.25 శాతంగా ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో 3.3 లక్షల మంది హోం క్వారంటైన్‌లో ఉండగా.. 3084 మంది ప్రభుత్వం ఏర్పాటు చేసిక క్వారంటైన్ కేంద్రాల్లో ఉన్నారు. మరోవైపు..మొత్తం కరోనా మరణాల సంఖ్య 10302కు చేరుకుంది. కాగా.. కరోనా కట్టడి కోసం అక్కడి ప్రభుత్వం అమరావతిలో లాక్‌డౌన్‌ను మార్చి 8 వరకూ పొడిగించింది. కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
ఇక ఒడిశా సంబల్పూర్ జిల్లాలోని బుర్లాలోని వీర్ సురేంద్రసాయి యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ (వీఎస్‌ఎస్‌యూటీ)కి చెందిన 25 మంది ఇంజినీరింగ్ విద్యార్థులు కరోనా మహమ్మారి బారినపడ్డారు. బాధిత విద్యార్థులంతా ఒకే హాస్టల్‌కు చెందిన వారని, వారిని చికిత్స కోసం బుర్లా వీర్ సురేంద్ర సాయి ఇస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్‌లోని కొవిడ్-19 హాస్పిటల్‌లో చేర్పించినట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఎలాంటి లక్షణాలు లేని మరో 15 మందిని హాస్టల్‌లోని ప్రత్యేక భవనంలో ఉంచినట్లు తెలిపారు. తేలికపాటి లక్షణాలు ఉన్న విద్యార్థులను ఇండ్లకు పంపినట్లు చెప్పారు. ప్రస్తుతం కాంటాక్ట్ ట్రేసింగ్ జరుగుతోందని అధికారులు తెలిపారు. కాగా, యూనివర్సిటీ 20న నాల్గో సంవత్సరం విద్యార్థులకు, మిగతా విద్యార్థులందరికీ ఈ నెల 20న తరగతులు ఆఫ్‌లైన్ తరగతులను ప్రారంభించింది.
దీంతో ఆయా రాష్ట్రాలు, జిల్లాల నుంచి విద్యార్థులు హాస్టళ్లకు తరిగివచ్చారు. ప్రస్తుతం వర్సిటీలోని నాలుగు హాస్టళ్లలో 1500 విద్యార్థులు ఉంటున్నారు. ఈ నెల 25న నాల్గో సంవత్సరం విద్యార్థి కొవిడ్ పాజిటివ్‌గా పరీక్షించాడు. అయితే, విద్యార్థులకు వైరస్ ఎలా సోకిందనేది తెలియడం లేదు. క్యాంప్ నుంచి బయటకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వడంతోనే.. ఎవరై నుంచైనా సోకి ఉంటుందని భావిస్తున్నారు. సమాచారం తెలుసుకున్న కలెక్టర్ మయూర్ సూర్యవంశి క్యాంప్‌ను సందర్శించారు. వైరస్ వ్యాప్తి చెందకుండా కఠినంగా పోట్రోకాల్స్ అమలు చేయాలని ఆదేశించారు. విద్యార్థులు వైరస్ పాజిటివ్‌గా పరీక్షించడంతో యూనివర్సిటీ మళ్లీ ఆన్‌లైన్ తరగతులు నిర్వహిస్తామని, చివరి సంవత్సరం పెండింగ్ పరీక్షలు మాత్రం ఆఫ్‌లైన్ మోడ్‌లో నిర్వహించనున్నట్లు పేర్కొంది.
త్వరలో ఇండియాలో మూడు నుంచి నాలుగు వ్యాక్సిన్లు అందుబాటులోకి రానున్నాయని, ఎవరికి ఏది కావాలో నిర్ణయించుకునే తీసుకునే సౌకర్యం కూడా అందుబాటులో ఉంటుందని ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) ఢిల్లీ చీఫ్ రణదీప్ గులేరియా వ్యాఖ్యానించారు. వ్యాక్సిన్ డ్రైవ్ ను ఇండియాలో మరింత వేగవంతం చేయాలని ఇప్పటికే నిర్ణయించామని పేర్కొన్నా ఆయన, ప్రైవేటు ఆసుపత్రుల్లో వివిధ రకాల వ్యాక్సిన్లు అందుబాటులోకి వస్తాయని, ప్రభుత్వం మాత్రం ఒకటే వ్యాక్సిన్ ను లబ్దిదారులకు అందిస్తుందని తెలిపారు.
ప్రైవేటు ఆసుపత్రుల్లో వ్యాక్సిన్ ఇవ్వడం ప్రారంభించి, మరిన్ని టీకా వేరియంట్లు అందుబాటులోకి వచ్చిన తరువాత, పరోక్షంగానైనా తమకు నచ్చిన కంపెనీకి చెందిన టీకాను తీసుకునే అవకాశం ఉంటుందని అన్నారు. అయితే, ఒక వ్యాక్సిన్ కేంద్రంలో ఒకే వేరియంట్ లభిస్తుందని, కావాల్సిన వ్యాక్సిన్ ఎక్కడుందో తెలుసుకుని వెళ్లాల్సి వుంటుందని ఆయన స్పష్టం చేశారు.
ఆరు రాష్ట్రాల పరిధిలో కొత్త కరోనా కేసుల సంఖ్య చాలా అధికంగా వస్తున్నాయని గుర్తు చేసిన ఆయన, టీకా పంపిణీని అత్యవసరంగా విస్తృతం చేయాలని అభిప్రాయపడ్డారు. ఎక్కువ మందికి వ్యాక్సిన్ ఇస్తుంటే, క్రమంగా కరోనా అంతరించి పోతుందని వ్యాఖ్యానించిన ఆయన, కేసులు ఎక్కువగా ఉన్న ప్రాంతాలకు మరిన్ని వయల్స్ పంపుతామని అన్నారు. వ్యాక్సిన్ ధర కూడా ప్రజలందరికీ అందుబాటులోనే ఉంటుందని, ఈ విషయంలో స్పష్టమైన మార్గదర్శకాలను కేంద్రం ఇప్పటికే విడుదల చేసిందని తెలిపారు.
ఇదిలావుండగా, ఇప్పటివరకూ ఇండియాలో సీరమ్ తయారు చేసిన కొవీషీల్డ్, భారత్ బయోటెక్ తయారు చేసిన కోవాగ్జిన్ ను మాత్రమే పంపిణీ చేస్తున్నారు. మొత్తం వ్యాక్సిన్ పొందిన వారిలో కేవలం 11 శాతంగా మాత్రమే కొవాగ్జిన్ తీసుకున్న వారు ఉన్నారు. ఈ శాతాన్ని మరింతగా పెంచుతామని, కొవాగ్జిన్ మూడొో దశ ట్రయల్స్ ఫలితాలు వెల్లడికాగానే మరిన్ని డోస్ లు అందుబాటులోకి వస్తాయని గులేరియా వ్యాఖ్యానించారు.