Coronavirus in India (Photo Credits: PTI)

New Delhi, Feb 20: దేశంలో గత 24 గంటల్లో 13,993 మందికి కరోనా నిర్ధారణ (India Covid Updates) అయింది. అదే స‌మ‌యంలో 10,307 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,09,77,387కు చేరింది. గడచిన 24 గంట‌ల సమయంలో 101 మంది కరోనా (Covid Deaths) కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,56,212కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 1,06,78,048 మంది కోలుకున్నారు. 1,43,127 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. ఇప్ప‌టివ‌ర‌కు 1,07,15,204 మందికి వ్యాక్సిన్ వేశారు.

తెలంగాణలో కొత్త‌గా 157 కరోనా కేసులు (TS Covid) నమోదయ్యాయి. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఈ రోజు ఉదయం వెల్లడించిన కరోనా కేసుల వివరాల ప్ర‌కారం... గత 24 గంటల్లో కరోనాతో కొత్త మ‌ర‌ణాలు న‌మోదు కాలేదు. అదే సమయంలో 157 మంది కోలుకున్నారు. ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,97,435 కి చేరింది. ఇప్పటివరకు మొత్తం 2,94,097 మంది కోలుకున్నారు. మృతుల సంఖ్య 1,623 గా ఉంది. తెలంగాణలో ప్రస్తుతం 1,715 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. వారిలో 649 మంది హోం క్వారంటైన్ లో చికిత్స తీసుకుంటున్నారు. జీహెచ్ఎంసీలో కొత్త‌గా 27 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి.

విరుచుకుపడుతున్న కొత్త వేరియంట్లు, భారత్‌లో ఏకంగా ఐదు వేల రకాల కరోనా స్ట్రెయిన్లు, సంచలన వివరాలను వెల్లడించిన సీసీఎంబీ శాస్త్రవేత్తలు

ఏపీలో గడచిన 24 గంటల్లో 26,526 కరోనా పరీక్షలు (AP Covid) నిర్వహించగా 79 మందికి పాజిటివ్ అని నిర్ధారణ అయింది. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 16 మందికి కరోనా సోకింది. నెల్లూరు జిల్లాలో 12, అనంతపురం జిల్లాలో 11 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. విజయనగరం జిల్లాలో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. అదే సమయంలో 77 మంది కరోనా నుంచి కోలుకోగా, విశాఖ జిల్లాలో ఒకరు మృతి చెందారు. రాష్ట్రంలో ఇప్పటివరకు మొత్తం 8,89,156 పాజిటివ్ కేసులు నమోదు కాగా 8,81,369 మంది కరోనా నుంచి విముక్తులయ్యారు. రాష్ట్రంలో కరోనా మృతుల సంఖ్య 7,167కి చేరింది.

మూడున్నర నెలల తర్వాత నిన్న మళ్లీ మహారాష్ట్రలో (Maharashtra Covid) రికార్డు స్థాయిలో 6,112 కేసులు నమోదయ్యాయి. అక్టోబరు 30 తర్వాత 6 వేలకు పైగా కేసులు నమోదు కావడం ఇక్కడ ఇదే తొలిసారి. ఆ తర్వాత క్రమంగా తగ్గుతూ వచ్చిన కేసుల సంఖ్య మళ్లీ పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. నిన్న నమోదైన కేసుల్లో అకోలా, పూణె, ముంబై డివిజన్‌లలోనే అత్యధికంగా వెలుగు చూసినట్టు అధికారులు తెలిపారు. తాజా కేసులతో కలుపుకుని రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 20,87,632కు చేరినట్టు ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది.

మరో కొత్త షాక్, డిసెంబర్‌కు ముందే చైనాలో కరోనా, వుహాన్‌లో 13 రకాల కోవిడ్ స్ట్రెయిన్లు, SARS-COV-2కు సంబంధించి 13 ర‌కాల జ‌న్యు క్ర‌మాల‌ను గుర్తించిన‌ట్లు తెలిపిన డబ్ల్యూహెచ్‌ఓ

కాగా, కరోనా కారణంగా నిన్న 44 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరితో కలుపుకుని రాష్ట్రంలో కరోనాకు బలైన వారి సంఖ్య 51,713కు పెరిగింది. రాష్ట్రంలో కరోనా కేసులు పెద్ద ఎత్తున వెలుగు చూస్తుండగా అదే సమయంలో రికవరీల సంఖ్య గణనీయంగా పడిపోతుండడం ఆందోళన కలిగిస్తోంది. రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య 44,765గా ఉండగా, నిన్న కరోనా కోరల నుంచి 2,159 మంది మాత్రమే బయటపడ్డారు.

మహారాష్ట్రలో అమరావతి, అకోలా జిల్లాల్లో కరోనా కొత్త స్ట్రెయిన్స్‌ కలకలం రేపుతున్నాయి. జన్యుపరంగా మారిన ఈ కొత్త రకం వైరస్‌ మరింత త్వరితంగా వ్యాప్తి చెందుతోందని కోవిడ్‌–19పై ప్రభుత్వ సలహాదారు డాక్టర్‌ సుభాష్‌ సలంఖే చెప్పారు. ఈ కొత్త స్ట్రెయిన్‌ సోకిన వెంటనే న్యుమోనియాలోకి దింపేస్తోందని, దీనివల్ల మరణాలు ఎక్కువగా సంభవిస్తాయని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తున్న ఆయన అమరావతిలో 700 మందికి కరోనా పాజిటివ్‌ వస్తే అందులో 350 మందికి ఈ కొత్త రకం సోకిందని చెప్పారు. నాగపూర్‌ నుంచి ఔరంగాబాద్‌ వరకు ఈ కేసులు వెలుగులోకి వస్తున్నాయని తెలిపారు.

మరోవైపు, గతేడాది సెప్టెంబరులో కరోనా బారినపడి కోలుకున్న మహారాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి బచ్చు కడుతోపాటు ఎన్సీపీ నేత, మాజీ మంత్రి ఏక్‌నాథ్ ఖడ్సే రెండోసారి కరోనా బారినపడ్డారు. ఖడ్సేకు గతేడాది నవంబరులో కరోనా సోకగా చికిత్స అనంతరం బయటపడ్డారు. తాజాగా తాము రెండోసారి కరోనా వైరస్ బారినపడినట్టు వీరిద్దరూ ట్విట్టర్ ద్వారా తెలిపారు. కాగా, రాష్ట్రంలో గత వారం రోజులుగా ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోయాయని, వైరస్ వ్యాప్తి మళ్లీ పెరగడానికి అదే కారణమని ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.

ఇప్పటికే కరోనా వైరస్ కొత్త రకాలను వివిధ దేశాల్లో గుర్తించిన సంగతి తెలిసిందే. తమ దేశంలో కూడా మరో కొత్త కరోనా వైరస్ రకాన్ని గుర్తించినట్టు జపాన్ ప్రకటించింది. తూర్పు జపాన్ లోని కాంటే ప్రాంతంలో 91 కొత్త రకం కేసులను గుర్తించామని తెలిపింది. విమానాశ్రయాల్లో కూడా ఈ రకం కేసులు రెండింటిని గుర్తించామని వెల్లడించింది. ఇతర రకాల కంటే ఈ కోవిడ్ రకం విభిన్నంగా ఉందని... ఇది వేరే దేశాల్లో ఉత్పన్నమై ఉండొచ్చని జపాన్ కు చెందిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫెక్షన్ డిసీజెస్ తెలిపింది. వ్యాక్సిన్ పనితీరును కూడా దెబ్బతీసే ఈ484కే మ్యుటేషన్ ఈ వైరస్ లో ఉందని చెప్పింది.

కొత్త రకం కోవిడ్ నేపథ్యంలో టోక్యో ఇమిగ్రేషన్ కేంద్రంలో ఇన్ఫెక్షన్ క్లస్టర్ ను ఏర్పాటు చేశామని తెలిపింది. ఇతర రకాల వైరస్ ల కంటే ఈ కొత్త వైరస్ మరింత వేగంగా వ్యాపించే అవకాశం ఉందని చెప్పింది. కొత్త రకం కరోనా వైరస్ వల్ల కేసులు మళ్లీ పెరిగే అవకాశం ఉందని తెలిపింది. వ్యాక్సిన్లకు కూడా ఈ వైరస్ లొంగకపోయే అవకాశం ఉండటం వల్ల... జపాన్ ప్రభుత్వం మరింత అప్రమత్తమయింది. జపాన్ లో ఈ వారమే వ్యాక్సినేషన్ ప్రారంభమైంది. ఇంతలోనే కొత్త రకం వైరస్ బయటపడటం కలకలం రేపుతోంది.