Coronavirus Outbreak. | (Photo-PTI)

New Delhi, Oct 17: దేశంలో కొత్తగా 14,146 మంది కరోనావైరస్ బారిన పడ్డారు. దీంతో కోవిడ్ సోకినవారి సంఖ్య 3,40,67,719కు (Coronavirus in India) చేరింది. ఇందులో 3,34,19,749 మంది కరోనా నుంచి కోలుకోగా, 1,95,846 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు. మరో 4,52,124 మంది మహమ్మారివల్ల మరణించారు. కాగా, గత 24 గంటల్లో కొత్తగా 19,788 మంది కరోనా నుంచి బయటపడగా, 144 మంది (COVID 19 Deaths in India) మృతి చెందారని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.

ఇక దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్‌ ముమ్మరంగా సాగుతున్నది. గత 24 గంటల వ్యవధిలో 41,20,772 మందికి వ్యాక్సిన్‌ ఇచ్చామని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. దీంతో మొత్తంగా 97,65,89,540 కరోనా డోసులను పంపిణీ చేశామని వెల్లడించింది. రాష్ట్రాలకు ఇప్పటివరకు 101.7 కోట్ల వ్యాక్సిన్‌ డోసులను సరఫరా చేశామని పేర్కొంది. అందులో 10.42 కోట్ల డోసులు రాష్ట్రాల వద్ద అందుబాటులో ఉన్నాయని స్పష్టం చేసింది.

ట్యూషన్‌ సెంటర్‌లో ఎనిమిది మంది విద్యార్థులకు కోవిడ్‌ సోకడంతో గుజరాత్‌లోని సూరత్‌ నగరంలో కలకలం రేగింది. ట్యూషన్‌ సెంటర్‌ క్లాసులకు రెగ్యులర్‌గా వెళ్లే విద్యార్థి ఒకరు ఈనెల 7న కరోనా బారిన పడ్డారు. దీంతో మొత్తం 125 మంది విద్యార్థులకు కరోనా నిర్ధారిత పరీక్షలు నిర్వహించారు. వీరిలో ఏడుగురు కరోనా పాజిటివ్‌గా తేలారని సూరత్‌ డిప్యూటీ మున్సిపల్‌ కమిషనర్‌(హెల్త్‌) ఆశిష్‌ నాయక్‌ తెలిపారు. మరింత మందికి కరోనా సోకకుండా ట్యూషన్‌ సెంటర్‌ను వెంటనే మూసివేసినట్టు చెప్పారు.

కరోనా మాటున మరో మృత్యుఘోష, టీబీ వ్యాధితో గతేడాది కోటిన్నర మందికి పైగా మృతి, ఆందోళన వ్యక్తం చేసిన ప్రపంచ ఆరోగ్య సంస్థ, గ్లోబల్‌ టీబీ - 2021 నివేదికలో వివరాలు

సూరత్‌ విద్యాసంస్థల్లో కోవిడ్‌ కేసులు వెలుగు చూడటం ఈ నెలలో ఇది రెండోసారి. ఈ నెలారంభంలో కొంత మంది విద్యార్థులు కరోనా బారిన పడటంతో ఓ ప్రైవేటు స్కూల్‌ను తాత్కాలికంగా మూసివేశారు. సూరత్ నగరంలో ఇప్పటివరకు 1,11,669 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 1,09,975 రికవరీలు నమోదు కాగా, రికవరీ రేటు 98.48 శాతంగా ఉంది. మునిసిపల్ కార్పొరేషన్ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం సూరత్‌లో ఇప్పటివరకు మొత్తం 1,629 మంది కోవిడ్ -19 రోగులు మరణించారు.

రష్యాలో కోవిడ్‌ 24 గంటల వ్యవధిలో వెయ్యి మందిని బలి తీసుకుంది. ఒకే రోజు 33,208 కొత్త కేసులు నమోదు కాగా, 1,002 మంది ప్రాణాలు కోల్పోయినట్టుగా ప్రభుత్వం వెల్లడించింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 79,58,384కి చేరుకోగా, ఇప్పటివరకు 2,22,315 మంది ప్రాణాలు కోల్పోయారు. యూరప్‌ దేశాల్లో అత్యధిక కరోనా మరణాలు రష్యాలోనే సంభవించాయి. అమెరికా, బ్రెజిల్, భారత్, మెక్సికో తర్వాత కరోనా కేసులు అధికంగా రష్యాలోనే వెలుగులోకి వస్తున్నా యి. అయితే, ప్రభుత్వం మాత్రం కరోనా ఆంక్షలు విధించాలో, వద్దో స్థానిక యంత్రాంగం నిర్ణయించాలని అంటోంది. ఇప్పటి వరకు కేవలం 29% మంది జనాభాకి మాత్రమే వ్యాక్సిన్‌ ఇచ్చారు.