New Delhi, Sep 26: దేశంలో కొత్తగా 28,326 మంది కరోనా బారినపడ్డారు. దీంతో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 3,36,52,745కు (Coronavirus in India) చేరింది. ఇందులో 3,03,476 మంది చికిత్స పొందుతుండగా, 3,29,02,351 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. మరో 4,46,918 మంది కరోనా వల్ల మరణించారని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.
గత 24 గంటల్లో 26,032 మంది కొత్తగా వైరస్ నుంచి బయటపడ్డారని, 260 మంది (260 Deaths in Past 24 Hours) మరణించారని తెలిపింది. కాగా, కొత్తగా నమోదైన పాజిటివ్ కేసుల్లో 16,671 కేసులు ఒక్క కేరళలోనే ఉన్నాయని వెల్లడించింది. రాష్ట్రంలో మరో 260 మంది కన్నుమూశారని తెలిపింది. 68,42,786 మందికి కరోనా వ్యాక్సినేషన్ చేశామని పేర్కొంది. దీంతో మొత్తంగా 85,60,81,527 కరోనా వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేశామని తెలిపింది.
భారత్ లో కరోనా వైరస్ సెకండ్ వేవ్ ఇంకా కొనసాగుతోంది. ఇప్పటికీ కరోనా కేసులు పూర్తిగా కట్టడి కాలేదు. మరోవైపు థర్డ్ వేవ్ హెచ్చరికలను కూడా వైద్య నిపుణులు చేస్తున్నారు. ఈ సందర్భంగా ఎయిమ్స్ డైరెక్టర్ రణదీప్ గులేరియా మాట్లాడుతూ, వచ్చే 6 నుంచి 8 వారాల పాటు ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ జాగ్రత్తలు పాటిస్తేనే మనం మహమ్మారి నుంచి బయటపడి మునుపటి పరిస్థితికి వెళ్లొచ్చని చెప్పారు. మహమ్మారి ఇంకా పూర్తిగా పోలేదని అన్నారు. ముఖ్యంగా పండుగల సీజన్ లో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని చెప్పారు.
వ్యాక్సిన్ తీసుకున్నవారు కూడా జాగ్రత్తగా ఉండాలని అన్నారు. టీకా తీసుకున్న వారికి ఒకవేళ కరోనా సోకినా అది తేలికపాటి దశకే పరిమితమవుతుందని చెప్పారు. వ్యాక్సిన్ అనేది రోగం తీవ్రతరం కాకుండా చూస్తుందని తెలిపారు. కరోనా మహమ్మారి ప్రస్తుతం తిరోగమనంలో సాగుతోందని... ఇలాంటి సమయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించొద్దని హెచ్చరించారు. మళ్లీ కేసుల సంఖ్య పెంచే పరిస్థితిని తీసుకురాకూడదని అన్నారు. అందరూ మాస్కులు ధరించాలని, ఎక్కువ మంది ఒకే చోట గుమికూడవద్దని సూచించారు.