
New Delhi, Aug 15: దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. రోజువారీ కేసులు, మరణాల్లో హెచ్చుతగ్గులు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 36,083 కొత్త కేసులు (Coronavirus in India) వెలుగు చూడగా.. మరణాల సంఖ్య 500లోపే నమోదైంది. కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. నిన్న 19,23,863 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. గడిచిన 24 గంటల్లో కొవిడ్‌తో 493 మంది ప్రాణాలు (493 Deaths in Past 24 Hours) కోల్పోయారు. దీంతో ఇప్పటి వరకూ మృతిచెందిన వారి సంఖ్య 4,31,225కి చేరింది.
కొత్త కేసుల కంటే రికవరీలే ఎక్కువగా నమోదయ్యాయి. తాజాగా 37,927 మంది కరోనాను జయించగా.. ఇప్పటి వరకూ కోలుకున్న వారి సంఖ్య 3,13,76,015కి చేరింది. ఇక రికవరీ రేటు 97.46%కి పెరిగింది. ప్రస్తుతం దేశంలో 3,85,336(1.20శాతం) క్రియాశీల కేసులు ఉన్నాయి. ఇక దేశంలో వ్యాక్సినేషన్ ముమ్మరంగా సాగుతోంది. నిన్న ఒక్క రోజే 73,50,553 మందికి టీకాలు అందించారు. దీంతో ఇప్పటి వరకూ పంపిణీ చేసిన డోసుల సంఖ్య 54,38,46,290కి చేరింది.
కరోనా మూడో ఉధృతి వ్యాప్తి భయాలు విస్తరిస్తుండడంతో కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం మళ్లీ ఆంక్షల వైపు మొగ్గుచూపుతోంది. శనివారం సాయంత్రం ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై అధ్యక్షతన నిపుణులు, అధికారులతో కీలక సమావేశం జరిగింది. థర్డ్ వేవ్‌ను అడ్డుకోవాలంటే లాక్‌డౌన్ తరహా ఆంక్షలను విధించక తప్పదని నిర్ణయించారు. సమావేశ అనంతరం సీఎం బొమ్మై మీడియాతో వివరాలు వెల్లడించారు. ప్రస్తుత పరిస్థితుల్లో లాక్‌డౌన్ అవసరం లేదు. కొత్త నిబంధనల బదులు ఉన్న వాటినే కఠినతరం చేస్తాం. కరోనా థర్డ్ వేవ్ చిన్నారులపై ప్రభావం చూపుతుందని అంటున్నారు కాబట్టి పిల్లలపై తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ వహించాలి అని తెలిపారు. తాజా నిబంధనలు అన్ని జిల్లాల్లో ఒకే విధంగా ఉండబోవని చెప్పారు.