Coronavirus in India (Photo Credits: PTI)

దేశంలో కొత్త‌గా 1,68,063 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయ‌ని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. అలాగే, దేశంలో నిన్న 69,959 మంది క‌రోనా నుంచి కోలుకున్నారు. నిన్న క‌రోనాతో 277 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్ర‌స్తుతం ఆసుప‌త్రులు, హోం క్వారంటైన్ల‌లో 8,21,446 మందికి చికిత్స అందుతోంది. డైలీ పాజిటివిటీ రేటు 10.64 శాతంగా ఉంది. ఒమిక్రాన్ కేసుల సంఖ్య‌ 4,461కు పెరిగింది. నిన్నటి వ‌ర‌కు మొత్తం 69,31,55,280 క‌రోనా ప‌రీక్ష‌లు చేశారు. నిన్న ఒక్క‌రోజు 15,79,928 క‌రోనా ప‌రీక్ష‌లు నిర్వ‌హించారు.

కరోనా కారణంగా ఆసుపత్రుల్లో చేరేవారి సంఖ్య వేగంగా మారిపోవచ్చని, అప్రమత్తంగా ఉండాలంటూ అన్ని రాష్ట్రాలను కేంద్ర సర్కారు అప్రమత్తం చేసింది. హోమ్ ఐసోలేషన్, ఆసుపత్రుల్లో చికిత్స తీసుకుంటున్న వారిపై పర్యవేక్షణ అవసరమని పేర్కొంది. ఆసుపత్రుల్లో చికిత్సా సదుపాయాలను పెంచుకోవాలని.. అవసరమైతే ఎంబీబీఎస్ చివరి సంవత్సరం విద్యార్థులు, జూనియర్ రెసిడెంట్లు, నర్సింగ్ విద్యార్థులు, రిటైర్డ్ వైద్యుల సేవలను వినియోగించుకోవాలంటూ కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ సూచించారు.

సెకండ్ వేవ్ కంటే ఎక్కువ తీవ్రతతో థర్డ్ వేవ్, జనవరి మొదటివారంలోనే ఆర్ నాట్ వాల్యూ 4, రానున్న మరింత రోజుల్లో మరింత పెరిగే అవకాశం

‘‘కరోనా రెండో విడతలో (డెల్టా వేరియంట్) మొత్తం పాజిటివ్ కేసుల్లో 20-23 శాతం వరకు ఆసుపత్రులలో చేేరిన పరిస్థితి చూశాం. ఒమిక్రాన్ రకంలో ఆసుపత్రుల్లో చేరుతున్న వారు 5-10 శాతంలోపే ఉన్నారు. పరిస్థితి మారుతోంది. కనుక ఆసుపత్రుల్లో చేరే వారి సంఖ్య పెరగొచ్చు’’అని రాజేష్ భూషణ్ వివరించారు. ఆక్సిజన్, ఐసీయూ పడకలు, వెంటిలేటర్ సదుపాయాలను సిద్దంగా ఉంచుకోవాలని కోరారు. ప్రస్తుతం కేసుల పెరుగుదల ఒమిక్రాన్ వల్లేనని, డెల్టా కూడా దేశంలోని చాలా ప్రాంతాల్లో ఇంకా కొనసాగుతోందని భూషణ్ చెప్పారు.