India Covid Updates: దేశంలో మళ్లీ ఒక్కసారిగా పెరిగిన కేసులు, తాజాగా 17,407 మందికి కరోనా పాజిటివ్, 24 గంటల్లో 89 మంది మృతి, కోవిడ్ పెరుగుదలతో వణుకుతున్న ఆరు రాష్ట్రాలు
Coronavirus Outbreak. | (Photo-PTI)

New Delhi, Mar 4: ‌దేశంలో క‌రోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. మొన్న క‌రోనా కేసులు 12,286 గా న‌మోదు కాగా, నిన్న 14,989 కేసులు న‌మోద‌య్యాయి. గత 24 గంటల్లో 17,407 మందికి కరోనా (India Covid Updates) నిర్ధారణ అయింది. దేశంలో అదే స‌మ‌యంలో 14,031 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,11,56,923కు (Coronavirus in India) చేరింది.

గడచిన 24 గంట‌ల సమయంలో 89 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,57,435కు (Covid Deaths) పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 1,08,26,075 మంది కోలుకున్నారు. 1,73,413 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. ఇప్ప‌టివ‌ర‌కు 1,66,16,048 మందికి వ్యాక్సిన్ వేశారు.

ఇదిలా ఉంటే గడచిన 24 గంటల వ్యవధిలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా 21 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఒక్క కరోనా మరణం కూడా సంభవించలేదని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇక మహారాష్ట్ర, కేరళ, పంజాబ్, తమిళనాడు, గుజరాత్, కర్ణాటక రాష్ట్రాల్లోనే కేసులు అధికంగా ఉన్నాయని, మొత్తం నమోదైన దాదాపు 15 వేల కేసుల్లో 85 శాతానికి పైగా ఈ ఆరు రాష్ట్రాల్లోనే ఉన్నాయని స్పష్టం చేసింది. ఈ రాష్ట్రాల్లో తీసుకుంటున్న కరోనా నియంత్రణ చర్యలను పర్యవేక్షించేందుకు ముగ్గురేసి సభ్యులతో కూడిన కేంద్ర బృందాలను పంపించామని ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు తెలిపారు.

కొత్త వేరియంట్లతో 4వ వేవ్ ముప్పు, అమెరికాలో సగటున రోజూ 2 వేల మంది దాకా చనిపోతున్నారంటూ హెచ్చరికలు జారీ చేసిన సీడీసీ, అమెరికాను వణికిస్తున్న B.1.1.7 వేరియంట్

ఇదిలావుండగా, కరోనా టీకా పంపిణీ వేళలపై ఉన్న ఆంక్షలను తొలగిస్తున్నట్టు కేంద్రం ప్రకటించింది. ఇకపై రోజులో ఏ సమయంలోనైనా టీకాను పొందవచ్చని కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్ వెల్లడించారు. అన్ని ప్రైవేటు ఆసుపత్రుల్లో 24 గంటల పాటు వ్యాక్సినేషన్ కొనసాగుతుందని, ప్రజలు వారికి నచ్చిన సమయంలో వెళ్లి వ్యాక్సిన్ తీసుకోవచ్చని స్పష్టం చేశారు. అయితే, ప్రైవేటు ఆసుపత్రులు టీకా పంపిణీ వేళలను ముందుగానే నిర్ణయించుకుని, రాష్ట్ర ప్రభుత్వాలకు తెలియజేయాల్సి వుంటుందని ఆయన స్పష్టం చేశారు.

ఇక కరోనా నుంచి కోలుకున్నప్పటికీ ఆ బాధలు 14 రోజుల నుంచి 110 రోజుల వరకు అంటిపెట్టుకునే ఉంటున్నట్టు అమెరికా, యూరప్, ఆసియా, ఆస్ట్రేలియా తదితర దేశాల్లో నిర్వహించిన 18,251 అధ్యయనాలు చెబుతున్నాయి.వైరస్ నుంచి బయటపడిన వారిలో 58 శాతం మంది చిన్న పనికే అలసిపోతుండగా, 44 శాతం మందిలో తలనొప్పి వేధిస్తోంది. 80 శాతం మంది ఒకటికి మించిన సమస్యలతో ఇబ్బంది పడుతున్నట్టు అధ్యయనంలో తేలింది. 47,910 మంది కరోనా రోగులకు అందించిన చికిత్సలను అధ్యయనం చేయగా ఈ విషయాలు వెలుగుచూశాయి. 17-87 ఏళ్ల మధ్య వయస్కులను ఈ అధ్యయనం కోసం ఎంచుకున్నారు.

వేసవిలో కరోనా కేసులు భారీగా పెరిగే అవకాశం ఉందంటున్న నిపుణులు, 

అధ్యయనంలో వెల్లడైన దానిని బట్టి.. 25 శాతం మందిలో జుట్టు రాలిపోవడం, 24 శాతం మందిలో శ్వాస తక్కువసార్లు తీసుకోవడం, 21 శాతం మందిలో శ్వాస ఎక్కువసార్లు తీసుకోవాల్సి రావడం, 21 శాతం మందిలో వాసన తెలియకపోవడం, 19 శాతం మందిలో దగ్గు, 11 శాతం మందిలో జ్వరం, 23 శాతం మందిలో రుచిని గుర్తించలేకపోవడం, 16 శాతం మందిలో జ్ఞాపకశక్తి సన్నగిల్లడం, మూడు శాతం మందిలో కళ్లు తిరగడం, 6 శాతం మందిలో కళ్లు ఎర్రబడడం తదితర సమస్యలను అధ్యయనకారులు గుర్తించారు.

కరోనా వైరస్ వ్యాప్తికి ఎవరు ఎక్కువ కారకులు అవుతున్నారన్నదానిపై నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ లో ప్రచురితమైన ఓ అధ్యయనం వివరాలు అందించింది. సాధారణంగా కరోనా రోగిని తాకినా, ఆ రోగి ముక్కు, నోటి నుంచి వెలువడిన తుంపరలను పీల్చినా, వైరస్ ఉన్న ఉపరితలాలను తాకినా వైరస్ బారినపడతారు. కొందరు వ్యక్తులు పెద్ద సంఖ్యలో ప్రజలు కరోనా బారినపడడానికి కారకులైనప్పుడు వారిని సూపర్ స్ప్రెడర్స్ అంటారు.

అయితే, ఇతరులతో పోల్చితే ఆ సూపర్ స్ప్రెడర్స్ లో భిన్నత్వం ఏంటన్నది తాజా అధ్యయం విశదీకరిస్తోంది. ఊబకాయంతో బాధపడుతూ బాడీ మాస్ ఇండెక్స్ (బీఎంఐ) అధికంగా ఉన్న వ్యక్తులే కరోనాను అధికంగా వ్యాప్తి చేస్తున్నారని ఈ అధ్యయనంలో పేర్కొన్నారు. అధిక బరువు ఉన్నవాళ్లు శ్వాస తీసుకునే రేటు అధికంగా ఉంటుందని, వారిలో ఉఛ్వాస నిశ్వాసలు అధికంగా ఉండడంతో వారి ముక్కు, నోటి నుంచి వెలువడే తుంపరలు విస్తృతంగా వాతావరణంలో కలుస్తుంటాయని తెలిపారు. బీఎంఐ అధికంగా ఉన్న 194 మందిపై పరిశోధన జరిపి ఈ నిర్ణయానికి వచ్చారు. బీఎంఐ అధికంగా ఉన్న వృద్ధులకు కరోనాతో ముప్పు ఎక్కువని గుర్తించారు.