New Delhi, January 9: భారతదేశంలో గత 24 గంటల్లో కొత్తగా 18,222 కరోనా పాజిటివ్ కేసులు (India Coronavirus Update) నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,04,31,639కు చేరింది. ఇందులో 1,00,56,651 మంది బాధితులు కోలుకున్నారు. మరో 2,24,190 కేసులు యాక్టివ్‌గా ఉండగా, ఇప్పటివరకు 1,50,798 మంది బాధితులు కరోనా మహమ్మారి వల్ల మృతిచెందారు. కాగా, గడిచిన 24 గంటల్లో కొత్తగా 228 మంది మరణించారు. కొత్తగా 19,253 మంది ప్రాణాంతక వైరస్ నుంచి కోలుకున్నారని కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది.
కాగా, దేశంలో కరోనా కేసుల జాబితాలో మహారాష్ట్ర అగ్రస్థానంలో కొనసాగుతున్నది. రాష్ట్రంలో ఇప్పటివకు 19,61,975 కేసులు (Maharashtra Covid) నమోదయ్యాయి. నిన్న ఒక్కరోజే 3693 మంది కరోనా బారినపడ్డారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 49,970 మంది మృతిచెందారు. ఇక కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, ఢిల్లీ అత్యధిక రోజువారీ కేసులతో తర్వాతి స్థానాల్లో కొనసాగుతున్నాయి.
ఇక తెలంగాణలో గత 24 గంటల్లో కొత్తగా 298 కరోనా కేసులు (TS Coronavirus Report) నమోదయ్యాయి. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఈ రోజు ఉదయం వెల్లడించిన కరోనా కేసుల వివరాల ప్రకారం... గత 24 గంటల్లో కరోనాతో ఇద్దరు ప్రాణాలు కోల్పోగా, అదే సమయంలో 474 మంది కోలుకున్నారు. ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,89,433 కి చేరింది. ఇప్పటివరకు మొత్తం 2,83,048 మంది కోలుకున్నారు. మృతుల సంఖ్య 1,563 కి పెరిగింది. తెలంగాణలో ప్రస్తుతం 4,822 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. వారిలో 2,614 మంది హోం క్వారంటైన్ లో చికిత్స తీసుకుంటున్నారు. జీహెచ్ఎంసీలో కొత్తగా 61 కరోనా కేసులు నమోదయ్యాయి.
దేశంలో కొవిడ్ న్యూ స్ట్రెయిన్ విస్తరణ కొనసాగుతున్నది. శుక్రవారం ఉదయానికి 82గా ఉన్న న్యూ స్ట్రెయిన్ (New Strain Cases) పాజిటివ్ కేసుల సంఖ్య శనివారం ఉదయానికి 90కి చేరింది. అంటే గత 24 గంటల్లో దేశంలో మరో 8 మందిలో కొవిడ్ న్యూ స్ట్రెయిన్ బయటపడింది. కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ ఈ వివరాలను వెల్లడించింది. ఇదిలావుంటే ఒకవైపు యూకేలో కొత్తరకం కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తుంటే.. కేంద్రం భారత్-యూకే మధ్య విమానాల రాకపోకలను నిలిపివేసినట్లే నిలిపేసి మళ్లీ పునఃప్రారంభించడం ఆందోళన కలిగిస్తున్నది.