New Delhi. Sep 21: దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 26,115 కరోనా పాజిటివ్ కేసులు (Coronavirus in India) నమోదు అయ్యాయి. కరోనా నుంచి కోలుకుని 34,469 మంది డిశ్చార్జ్ అవగా (34,469 recoveries in last 24 hrs)..252 మంది మృతి చెందారు. దేశ వ్యాప్తంగా మొత్తం కరోనా కేసుల సంఖ్య దేశంలో 3,35,04,534 కి చేరింది. అలాగే మొత్తం కోలుకున్న వారి సంఖ్య 3,27,49,574గా ఉంది. ప్రస్తుతం 3,09,575 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. ఇప్పటి వరకు మృతి చెందిన వారి సంఖ్య 4,45,385గా ఉంది. అలాగే 81,85,13,827 మంది టీకా తీసుకున్నారు.
కరోనా వైరస్ రూపాన్ని మార్చుకుంటోంది. రూటు మార్చుకుని వాయు వేగంతో మళ్లీ దాడి చేసేందుకు రెడీ అవుతోంది. కరోనా వైరస్ ఏరోసాల్స్(గాలి తుంపర), డ్రాప్‌లెట్స్(సూక్ష్మ బిందువులు) గాలిలో ఎక్కువ కాలం బతికేందుకు కావాల్సిన శక్తిని సమకూర్చుకుంటోందని అధ్యయనాలు చెబుతున్నాయి. దీని ద్వారా ఒకరికి జలుబు చేస్తే మిగతా వారికి అంటుకునే విధంగా కరోనా రెడీ అవుతోంది. కరోనా వేరియంట్లు గాల్లో ప్రయాణించడంలో మెలకువలు సాధిస్తున్నాయని, దీనివల్ల కరోనా గాలి ద్వారా వ్యాపించే అవకాశాలు పెరుగుతాయని మేరీల్యాండ్ యూనివర్సిటీ అధ్యయనం వెల్లడించింది.
ఈ నేపథ్యంలో ప్రజలు మరింత టైట్ ఫిట్ మాస్కులు ధరించడం, నివాస గృహాల్లో విస్తృత వెంటిలేషన్ ఏర్పరుచుకోవడం చేయాలని అధ్యయనం సూచించింది. అప్పుడే వైరస్ వ్యాప్తిని అడ్డుకోగలమని తెలిపింది. అల్ఫా వేరియంట్ సోకిన వారు వదిలే గాలిలో 43–100 రెట్లు అధిక వైరస్‌లోడు ఉంటుందని అధ్యయనాలు వివరిస్తున్నాయి. ఇప్పటివరకు ఇవి బయట గాలిలో ఎక్కువ దూరం ప్రయాణించి ఇతరులకు సోకడం జరగలేదు. అయితే క్రమంగా వాయు ప్రయాణం చేసే శక్తిని వేరియంట్లు పెంచుకుంటున్నాయని, దీనివల్ల వైరల్ ఏరోసాల్స్ పెరిగిపోతున్నాయని సీఐడీ జర్నల్‌లో ప్రచురితమైన అధ్యయనం తెలిపింది.
అల్ఫాతో పోలిస్తే డెల్టా వేరియంట్‌కు అధిక సంక్రమణ శక్తి కలిగిఉన్నట్లు అధ్యయనంలో పాల్గొన్న ప్రొఫెసర్ డాన్ మిల్టన్ చెప్పారు. ఇవి పూర్తిగా వాయుమార్గంలో సోకే వేరియంట్లుగా మారకుండా నిరోధించేందుకు టీకా తీసుకోవడం, టైట్ మాస్కులు ధరించడం, శుభ్రమైన వాతావరణంలో నివసించడం చేయాలన్నారు. మాస్కుల వల్ల వైరస్‌సోకే అవకాశాలు దాదాపు 50 శాతం తగ్గుతాయని వివరించారు.