New Delhi, Sep 13: దేశంలో తాజాగా కొత్త కేసులు, మరణాలు భారీగా తగ్గాయి. 24 గంటల వ్యవధిలో 12,08,247 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 27,254 మందికి వైరస్ (Coronavirus in India) పాజిటివ్‌గా తేలింది. ముందురోజుతో పోల్చితే కేసుల్లో 4.6 శాతం తగ్గుదల కనిపించింది. ఈ నెలలో మరణాల సంఖ్య మరోసారి 200కు దిగొచ్చింది. నిన్న 219 మంది ప్రాణాలు కోల్పోయారు.
మొత్తంగా 3.32 కోట్ల మంది వైరస్ (Covid in India) బారిన పడగా.. ఇప్పటివరకు 4.42 లక్షల మంది మృత్యుఒడికి చేరుకున్నారు. ఈ మేరకు సోమవారం కేంద్ర ఆరోగ్య శాఖ గణాంకాలను వెల్లడించింది. నిన్న 37,687 మంది కొవిడ్ నుంచి కోలుకున్నారు. ఇప్పటి వరకు 3.24 కోట్ల మందికి పైగా వైరస్ నుంచి బయటపడ్డారు. ప్రస్తుతం 3,74,269 మంది మహమ్మారితో బాధపడుతున్నారు. క్రియాశీల రేటు 1.13 శాతంగా ఉండగా.. రికవరీ రేటు 97.54 శాతానికి చేరింది. నిన్న ఒక్కరోజే 53,38,945 మందికి టీకా వేశారు. ఇప్పటి వరకు పంపిణీ అయిన డోసుల సంఖ్య 74,38,37,643కి చేరింది.
కేరళలో కరోనా మహమ్మారి ప్రభావం ఇంకా ఎక్కువగానే ఉన్నది. అక్కడ ఇప్పటికీ రోజువారీ కేసుల సంఖ్య 20 వేలకు తగ్గడంలేదు. గడిచిన 24 గంటల్లో కూడా 20,240 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. దాంతో ఆ రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 43,75,431కి చేరింది. ఇక కొత్తగా 67 మంది కరోనా బాధితులు మరణించడంతో మొత్తం కరోనా మరణాల సంఖ్య 22,551కి పెరిగింది.
గడిచిన 24 గంటల్లో మొత్తం 1,15,575 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా 20,240 మందికి పాజిటివ్ వచ్చింది. అంటే పాజిటివిటీ రేటు 17.51 శాతంగా ఉంది. ఇక కొత్తగా 29,710 మంది మహమ్మారి బారి నుంచి కోలుకోవడంతో మొత్తం రికవరీల సంఖ్య 41,30,065కు పెరిగింది. ప్రస్తుతం కేరళలో 2,22,255 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రాష్ట్రంలోని 14 జిల్లాల్లో కరోనా కేసులు ఎక్కువగా ఉన్నాయని, వాటిలో ఎర్నాకుళం జిల్లాలో అత్యధికంగా ఉన్నాయని కేరళ ఆరోగ్యశాఖ తెలిపింది.