COVID19 in India: భారత్‌లో మళ్లీ విజృంభిస్తున్న కరోనావైరస్, కొత్తగా 44,230 పాజిటివ్ కేసులు నమోదు; టీకాలు వేసుకున్న యాత్రికులకు తమ దేశంలోకి అనుమతిస్తున్నట్లు ప్రకటించిన సౌదీ అరేబియా
Coronavirus Outbreak, . Representational Image | (Photo Credit: PTI)

New Delhi, July 30: భారత్‌లో కోవిడ్ కేసులు మళ్లీ క్రమంగా పెరుగుతున్నాయి. ఈ వారంలో వరుసగా నాల్గవ రోజు పెరిగి, శుక్రవారం నాటికి రోజూవారీ కోవిడ్ కేసులు 44 వేల మార్కును దాటి జూలై 7 నాటి గరిష్ఠ స్థితికి చేరుకున్నాయి. కేరళలో పరిస్థితి అదుపులోకి రావడం లేదు, వరుసగా మూడో రోజు కేరళలో 22 వేల పైగా కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్ర సర్కార్ శని, ఆదివారాల్లో సంపూర్ణ రాష్ట్రవ్యాప్త లాక్డౌన్ ను ప్రకటించింది. కాగా, మిగతా చోట్ల కేసుల్లో ఎలాంటి మార్పు కనిపించడం లేదు, అయినప్పటికీ ప్రజా అవసరాల దృష్ట్యా ఆంక్షలు సడలిస్తున్నాయి. మహారాష్ట్రలోని పలు జిల్లాల్లో ఆదివారం మినాహాయించి మిగతా రోజులలో షాపింగ్ మాల్స్, మల్టీప్లెక్సులు తెరవడానికి ఆ రాష్ట్ర ప్రభుత్వం అనుమతించింది.

మరోవైపు దాదాపు 17 నెలల తర్వాత సౌదీ అరేబియా దేశాలు టీకాలు పొందిన యాత్రీకులను తమ దేశంలోకి అనుమతిస్తున్నట్లు ప్రకటించింది. అయితే రియాద్ దేశం మాత్రం ఇంకా స్పష్టతనివ్వలేదు.

ఇక, గడిచిన ఒక్కరోజులో భారత్ నమోదు చేసిన కోవిడ్ గణాంకాలను ఒకసారి పరిశీలిస్తే, దేశవ్యాప్తంగా కొత్తగా మరో 44,230 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తాజా కేసులతో దేశంలోని మొత్తం COVID-19 పాజిటివ్ కేసుల సంఖ్య 3,15,72,344 కు చేరింది. నిన్న ఒక్కరోజే 555 కోవిడ్ మరణాలు నమోదయ్యాయి, దీంతో ఈ వైరస్ కారణంగా దేశంలో ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 4,23,217కు పెరిగింది.

అలాగే, గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 42,360 కరోనా బాధితులు కోలుకొని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటివరకు 3,07,43,972 మంది బాధితులు కోలుకొని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం దేశంలో4,05,155 ఆక్టివ్ కేసులు ఉన్నాయి.

ఆరోగ్యశాఖ వెల్లడించిన వివరాల ప్రకారం దేశంలో కొవిడ్ రికవరీ రేటు 97.38% స్థిరంగా ఉండగా ప్రస్తుతం తీవ్రత (యాక్టివ్ కేసులు) 1.28 శాతంగా ఉన్నాయి. ఇక భారత్‌లో కొవిడ్ మరణాల రేటు 1.34% గా ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ పేర్కొంది.

India's COVID Status Update:

జూలై 29 నాటికి దేశవ్యాప్తంగా 46,46,50,723 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించినట్లు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసిఎంఆర్) వెల్లడించింది. నిన్న ఒక్కరోజే 18,16,277 శాంపుల్స్ పరీక్షించినట్లు పేర్కొంది.

ఇక, దేశవ్యాప్తంగా కోవిడ్ నివారణ వ్యాక్సినేషన్ కొనసాగుతుంది. గడిచిన ఒక్కరోజులో దేశవ్యాప్తంగా 51,83,180 వ్యాక్సిన్ డోసుల పంపిణీ జరిగినట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. దేశంలో వ్యాక్సినేషన్ ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటివరకు దేశవ్యాప్తంగా టీకా పొందిన వారి సంఖ్య 45.60 కోట్లు దాటింది. తాజా గణాంకాల ప్రకారం దేశవ్యాప్తంగా 45,60,33,754 మంది పౌరులు టీకాలు వేయించుకున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. అయితే, ఇందులో ఫస్ట్ డోస్ తీసుకున్న వారు 35.61 కోట్లు ఉండగా, 9.98 కోట్ల మందికి సెకండ్ డోస్ పూర్తయిందని నివేదించారు.