Coronavirus scanning at an airport (Photo Credit: PTI)

New Delhi, June 30: భారత్‌లో తాజాగా కొత్త కేసులు మళ్లీ 40 వేలకు పైగా నమోదయ్యాయి. గడచిన 24 గంటల్లో 45,951 పాజిటివ్ కేసులు (Coronavirus in India) నమోదయ్యాయి. వరుసగా మూడో రోజు 1000లోపు మరణాలు సంభవించాయి. కోవిడ్‌తో నిన్న 817 మంది మృతిచెందారు. మంగళవారం రోజు 60,729 మంది కోలుకున్నారు. గత 24 గంటల్లో 36,51,983 మంది వ్యాక్సిన్‌ తీసుకున్నారు. ఈ మేరకు కేంద్ర వైద్యారోగ్యశాఖ బుధవారం కోవిడ్‌పై హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది.

దీంతో దేశంలో ఇప్పటివరకు నమోదయిన పాజిటివ్ కేసుల సంఖ్య 3,03,62,848గా ఉంది. మొత్తం 3,98,454 మంది మరణించారు. ఇప్పటి వరకు 2,94,27,330 మంది డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం 5,37,064 లక్షల యాక్టీవ్‌ కేసులున్నాయి. దేశంలో 96.92 శాతం కరోనా రికవరీ రేటు ఉంది. యాక్టివ్ కేసుల శాతం 1.77 శాతం, మరణాల రేటు 1.31 శాతంగా ఉంది.

కొవిషీల్డ్‌ టీకా రెండు డోసుల మధ్య 45 వారాల వ్యవధి ఉంటే.. వ్యక్తుల్లో రోగ నిరోధకత స్పందన మరింత మెరుగ్గా కనిపిస్తున్నట్లు తేల్చింది. ఈ వ్యాక్సిన్‌ మూడో డోసును కూడా తీసుకుంటే యాంటీబాడీల స్థాయులు ఇంకా ఎక్కువగా వృద్ధి చెందుతున్నాయని నిర్ధారించింది. భారత్‌లో ప్రస్తుతం కొవిషీల్డ్‌ డోసుల మధ్య విరామాన్ని 12-16 వారాలుగా నిర్ణయించిన సంగతి తెలిసిందే. 18-55 ఏళ్ల మధ్య వయసున్న వాలంటీర్లపై బ్రిటన్‌లోని ఆక్స్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయం పరిశోధకులు తాజా అధ్యయనాన్ని నిర్వహించారు. ఈ అధ్యయన వివరాల ప్రకారం.. కొవిషీల్డ్‌ తొలి డోసును తీసుకున్నాక కనీసం ఏడాది వరకు వ్యక్తుల్లో యాంటీబాడీల స్థాయులు అధికంగా ఉంటున్నాయి.

ఒకే దేశం.. ఒకే రేషన్ కార్డు పథకాన్ని అమలు చేయాల్సిందే, రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు తేల్చి చెప్పిన సుప్రీంకోర్టు, జులై 31లోగా పథకాన్ని ప్రారంభించాలని ఆదేశాలు

12 వారాల విరామంతో రెండు డోసులను తీసుకున్నవారితో పోలిస్తే.. 45 వారాల (దాదాపు 11 నెలలు) వ్యవధితో ద్వితీయ డోసును పొందినవారిలో యాంటీబాడీ స్థాయులు నాలుగు రెట్లు ఎక్కువగా ఉంటున్నాయి. రెండో డోసు (11 నెలల విరామంతో) తీసుకున్న 28 రోజుల తర్వాత యాంటీబాడీ స్పందన 18 రెట్లు పెరుగుతోంది. ద్వితీయ డోసు తర్వాత ఆరు నెలల విరామంతో మూడో డోసును తీసుకుంటే.. యాంటీబాడీ స్థాయులు ఆరు రెట్లు అధికమవుతున్నాయి. రోగ నిరోధక వ్యవస్థలో కీలకమైన టీ-సెల్‌ స్పందనలు కూడా మెరుగుపడుతున్నాయి. ఆల్ఫా, బీటా, డెల్టా వేరియంట్లను అడ్డుకోవడంలో మూడో డోసు మరింత క్రియాశీలకంగా పనిచేస్తోంది. తొలి డోసు గ్రహీతలతో పోలిస్తే.. కాస్త ఆలస్యంగా రెండో డోసు తీసుకున్నవారిలో, మూడో డోసు పొందినవారిలో దుష్ప్రభావాలు తలెత్తే అవకాశాలూ తక్కువేనని రిపోర్ట్ తెలియజేసింది.