New Delhi, October 20: భారత్‌లో గడిచిన 24 గంటల్లో 46,791 పాజిటివ్ కేసులు (India Reports 46,790 COVID-19 Cases) నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 75,97,064కు చేరుకుంది. వైరస్ బాధితుల్లో తాజాగా 587 మంది మృతి చెందడంతో ఆ మొత్తం సంఖ్య 1,15,197 కు చేరింది. దేశ వ్యాప్తంగా నిన్నటి రోజున 69,721 మంది డిశ్చార్జి కాగా.. ఇప్పటివరకు కోలుకున్న వారి మొత్తం సంఖ్య 67,33,329గా ఉంది. ప్రస్తుతం యాక్టివ్‌గా ఉన్న కేసుల సంఖ్య 7,48,538. ఈమేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ (Health Ministry) మంగళవారం హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది.
వచ్చే ఏడాది ఫిబ్రవరి నాటికి 130 కోట్ల దేశ జనాభాలో సగం మందికి కరోనా (Coronavirus Outbreak) సోకే అవకాశమున్నదని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ తెలిపింది. ‘మా గణిత నమూనా అంచనా ప్రకారం ప్రస్తుతం జనాభాలో 30 శాతం మంది కరోనా సోకింది. ఫిబ్రవరి నాటికి ఇది 50 శాతం వరకు పెరిగే అవకాశం ఉంది’ అని కాన్పూర్‌లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఫర్ టెక్నాలజీ ప్రొఫెసర్, కమిటీ సభ్యుడు మనీంద్ర అగర్వాల్ చెప్పారు.
కేంద్ర ప్రభుత్వం సెప్టెంబర్‌లో నిర్వహించిన సెరోలాజికల్ సర్వే ప్రకారం దేశ జనాభాలో 14 శాతం మందికి వైరస్ సోకినట్లు తెలిపారు. గత నెల రోజుల్లో వైరస్ వ్యాప్తి బాగా పుంజుకోవడంతో దేశ జనాభాలో 30 శాతం మంది కరోనా బారినపడ్డారని చెప్పారు. అయితే జనాభా భారీ పరిమాణం కారణంగా సెరోలాజికల్ సర్వే ద్వారా నమూనాలను సరిగా అంచనా వేయలేకపోయినట్లు అగర్వాల్ అభిప్రాయపడ్డారు.
కరోనాతో (Covid) బ్రెయిన్ డ్యామేజ్‌కు సంబంధించిన తొలి కేసు ప్రఖ్యాత ఎయిమ్స్ ఆస్పత్రిలో నమోదైంది. కరోనా కారణంగా ఓ చిన్నారి మెదడులోని నాడులు దెబ్బతినడంతో ఆమె చూపు మందగించింది. కాగా..చైల్డ్ న్యూరాలజీ విభాగం శాస్త్రవేత్తలు ఈ కేసు పూర్తి వివరాలను ప్రచురించేందుకు సిద్ధమవుతున్నారు. ‘కరోనా బారిన పడ్డ 11 ఏళ్ల బాలికలో వైరస్ కారణంగా కలిగిన ఎక్యూట్ డీమైలినేటింగ్ సిండ్రోమ్(ఏడీఎస్) వ్యాధిని గుర్తించాం.
ఈ వయసు పిల్లల్లో ఇటువంటి వ్యాధి రావడం ఇదే తొలిసారి’ అని అక్కడి డాక్టర్లు తెలిపారు. డాక్టర్లు తెలిపిన వివరాల ప్రకారం.. మెదడు నాడుల్లోని కణాల చూట్టూ మైలిన్ పొర ఉంటుంది. కణాల ద్వారా జరిగే సమాచార మార్పిడికి ఈ పొర ఎంతో ముఖ్యం. అయితే వైరస్ కారణంగా..ఈ పొర దెబ్బతినడంతో నాడి వ్యవస్థపై ప్రభావం పడింది. దీంతో బాలిక చూపు మందగించిందని తెలిపారు.
కరోనాతో పలువురిలో మధుమేహం స్థాయిలు పెరగడంతో పాటు, లంగ్ ఇన్‌ఫెక్షన్స్‌కు గురవడం, లివర్, కిడ్నీలపై ప్రభావం చూపుతున్నట్లు వైద్య నిపుణులు గుర్తించారు. ఈ వార్త కలవరపెట్టకముందే కరోనాకు గురైన వారిలో కొందరిలో రక్తనాళాల్లో గడ్డలు ఏర్పడటంతో గుండెపోటు, బ్రెయిన్‌స్ట్రోక్‌లకు గురవుతున్నట్లు వెల్లడైంది.
ఆస్పత్రిలో చికిత్స పొంది, డిశ్చార్జి అయి ఇంటికి వెళ్లిన రోగుల్లో 7 నుంచి 8 శాతం మంది రోగులు నాలుగు నుంచి ఆరు వారాల్లో గుండె పోటు, బ్రెయిన్ స్ట్రోక్‌కు గురవుతున్నట్లు అధ్యయనాల్లో తేలింది. ముఖ్యంగా వెంటిలేటర్ దాకా వెళ్లొచ్చిన రోగుల్లో ఈ సమస్య కనిపిస్తుంది. దీంతో కరోనా తగ్గినా మూడు నెలల పాటు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.
ఇక కరోనా నుంచి కోలుకున్న వారిలో ఎంతకాలం పాటు యాంటీబాడీలు ఉంటాయనే ప్రశ్నకు కెనడాలోని మాంట్రియాల్ వర్సిటీ అధ్యయనంలో సమాధానం లభించింది. ఇన్ఫెక్షన్ నుంచి కోలుకున్న కరోనా రోగుల రక్తంలో ఆరు నుంచి పదివారాల (42 - 70 రోజుల) తర్వాత యాంటీబాడీల సంఖ్య తగ్గిపోతోందని వారు గుర్తించారు. ఆ నిర్దిష్ట వ్యవధి గడవగానే.. కరోనా వైర్‌సకు ఆయువుపట్టయిన స్పైక్ ప్రొటీన్‌కు అడ్డుగోడలా నిలబడే ‘ఇమ్యునో గ్లోబులిన్- జీ, ‘ఏ’, ‘ఎం’ రకం యాంటీబాడీల సంఖ్య క్షీణిస్తోందని స్పష్టంచేశారు.
ప్లాస్మా థెరపీ కోసం కోలుకున్న కరోనా రోగుల నుంచి ప్లాస్మాను సేకరించే క్రమంలో ఈ అంశాన్ని పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు. ఇన్ఫెక్షన్ సోకిన 3 నుంచి ఆరువారాల తర్వాత రోగికి ప్లాస్మాను అందిస్తే.. అది వైర్‌సను ప్రభావవంతంగా నిర్వీర్యం చేయలేకపోతోందని వెల్లడించారు.