Coronavirus Cases in India (Photo Credits: IANS)

New Delhi, July 26:  భారతదేశంలో ప్రతిరోజు రికార్డు స్థాయిలో కొవిడ్19 కేసులు నమోదవుతున్నాయి.  గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా మరో 48,661 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అయితే ఇందులో ఇంకా తెలంగాణ రాష్ట్రానికి చెందిన కొవిడ్19 కేసులు జోడించలేదు. ఈ రాష్ట్రానికి సంబంధించి శనివారం విడుదల చేయాల్సిన హెల్త్ బులెటిన్ ను తెలంగాణ ఆరోగ్యశాఖ ఆదివారానికి వాయిదా వేసింది. దీంతో తెలంగాణ కేసులు లేకుండా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈరోజు హెల్త్ బులెటిన్ విడుదల చేసింది.  తాజా కేసులతో దేశంలో  మొత్తం COVID-19 పాజిటివ్ కేసుల సంఖ్య ఆదివారం ఉదయం నాటికి 13,85,522 కు చేరింది. నిన్న ఒక్కరోజే 705 కోవిడ్ మరణాలు నమోదయ్యాయి, దీంతో ఈ వైరస్ కారణంగా దేశంలో ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 32,063 కు పెరిగింది.

మరోవైపు గత 24 గంటల్లో  దేశవ్యాప్తంగా రికార్డు స్థాయిలో 36,145  కరోనా బాధితులు కోలుకొని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటివరకు 885,576 మంది బాధితులు కోలుకొని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ కాగా, ప్రస్తుతం దేశంలో 467,882 ఆక్టివ్ కేసులు ఉన్నాయని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది.

India's COVID19 Update:

గత 24 గంటల్లో రికార్డ్ స్థాయిలో 4,20,898 శాంపుల్స్ కు వైరస్ నిర్ధారణ పరీక్షలు  నిర్వహించినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది.  టెస్ట్ పర్ మిలియన్ (టిపిఎం) 11,485 కు పెరిగిందని, నేటి వరకు  సుమారు 1 కోటి 60 లక్షలు (1,58,49,068) టెస్టులు నిర్వహించినట్లు వెల్లడించింది.

దేశవ్యాప్తంగా 9 రాష్ట్రాల్లో కొవిడ్ తీవ్రత అధికంగా ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ పేర్కొంది. ఇక దక్షిణ భారతదేశం నుంచి కొత్తగా వచ్చే పాజిటివ్ కేసుల సంఖ్యలో గణనీయమైన పెరుగుదల కనిపిస్తుంది. తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాలు శనివారం వేల సంఖ్యలో కొవిడ్19 కేసులను నివేదించాయి. ఆంధ్రప్రదేశ్‌లో టెస్టుల సంఖ్య పెంచినా కొద్దీ అదే స్థాయిలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఇటీవల కాలంగా ఏపీ నుంచి కనీసం 7 వేలకు పైగానే పాజిటివ్ కేసులు నమోదవుతూ వస్తున్నాయి.