New Delhi, October 25: భారత్‌లో గడిచిన 24 గంటల్లో 50,129 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 78,64,811కి చేరింది. నిన్న ఒక్క రోజే 578 మంది మరణించగా ఇప్పటివరకు మొత్తం 1,18,534 మంది కరోనాతో (Covid Deaths) మృత్యువాతపడ్డారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆదివారం కరోనాపై ( 2020 Coronavirus Pandemic in India) హెల్త్ బులెటిన్ విడుదల చేసింది.
గత 24 గంటల్లో 62,077 మంది కోలుకుని ఆసుపత్రులనుంచి డిశ్చార్జ్ అవ్వగా ఇప్పటి వరకు మొత్తం 70,78,123 మంది కోలుకున్నారు. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 78,64,811గా ఉండగా.. ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 6,68,154గా ఉంది. అయితే గత 22 రోజులుగా నమోదవుతున్న కేసుల కంటే కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ అవుతున్న వారిసంఖ్య అధికంగా ఉండటం విశేషం.
దేశ ఆర్థిక రాజధాని నగరంగా పేరొందిన ముంబైలో కరోనా మహమ్మారి వల్ల 10వేల మందికి పైగా రోగులు మరణించారు. గడచిన 24 గంటల్లో ఒక్క ముంబై నగరంలోనే 1257 కరోనా కేసులు నమోదు కాగా, వీరిలో 50 మంది మరణించారు. దీంతో ముంబైలో కరోనా మృతుల సంఖ్య 10.016కు పెరిగింది. ముంబై నగరంలోనే 2,50,061 మందికి కరోనా సోకగా, రోగుల రికవరీ శాతం 88 శాతంగా ఉంది. ప్రస్థుతం ముంబైలో 19,500 కరోనా క్రియాశీల కేసులున్నాయి.
50 ఏళ్లు పైబడిన వారిలో 85 శాతం మరణాలు నమోదైనాయి. నగరంలో 633 యాక్టివ్ కరోనా కంటైన్ మెంట్ జోన్లతోపాటు 8,585 భవనాలకు సీలు వేశారు.మహారాష్ట్రలో రోగుల రికవరీ రేటు 88.78 శాతంగా ఉందని రాష్ట్ర ఆరోగ్య మంత్రి రాజేష్ తోపే ట్వీట్‌లో పేర్కొన్నారు.మహారాష్ట్రలో ఇప్పటి వరకు మొత్తం 16,38,961 కరోనావైరస్ కేసులు నమోదయ్యాయి. ఇన్ఫెక్షన్ నుంచి 14,55,107 మంది రోగులు కోలుకున్నారు. రాష్ట్రంలో 43,152 మంది మరణించారు.
మహారాష్ట్రలో మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నేత దేవేంద్ర ఫడ్నవీస్‌కు కరోనాగా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని స్సోషల్ మీడియా ద్వారా ఆయన వెల్లడించారు. తనతో సన్నిహితంగా మెలిగిన వారు పరీక్షలు చేసుకోవాల్సిందిగా సూచించారు. ‘లాక్‌డౌన్ నుంచి నిరంతరం పనిలో ఉన్నాను. ఇపుడిక కొంతకాలం విశ్రాంతి తీసుకోవాలని ఆ దేవుడు కోరుకున్నట్టున్నాడు’ అంటూ ఆయన ట్వీట్ చేశారు. వైద్యుల సలహామేరకు చికిత్స తీసుకుంటున్నట్టు తెలిపారు.దేవేంద్ర ఫడ్నవీస్ కోవిడ్ నుంచి కోలుకోవాలని బీజేపీ అగ్ర నేతలు, కార్యకర్తలు, అభిమానులు కోరుకుంటున్నారు.
తాజాగా ఎన్‌సీపీ నేత, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ కోవిడ్-19 బారినపడ్డారు. స్వల్ప లక్షణాలతో ఆయన గృహ నిర్బంధంలో ఉన్నట్టు సమాచారం. అటు పార్టీ కార్యాలయంలో జరగాల్సిన సమావేశానికి అజిత్ పవార్ హాజరు కావడంలేదని ఎన్‌సీపీ ప్రధాన కార్యదర్శి శివాజీరావ్ గార్జే బుధవారం ట్వీట్ చేశారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా కరోనా బారిన పడి కోలుకున్న సంగతి తెలిసిందే. కర్ణాటక నుంచి రాజ్యసభకు ఎన్నికైన అశోక్ గస్తీ కరోనాతో ప్రాణాలు కోల్పోయారు.