Mumbai, July 1: కరోనావైరస్ విజృంభణ దేశంలో (Coronavirus in India) నానాటికీ పెరుగుతోంది. రోజురోజుకు రికార్డు స్థాయిలో కేసులు (India Coronavirus) నమోదవుతుండగా మరణాల సంఖ్య కూడా పెరగడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. తాజాగా గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 18,653 కరోనా పాజిటివ్ కేసులు నిర్ధారణ కాగా, వైరస్ బారినపడి 507 మంది మృతి (Coronavirus Deaths) చెందారు. దేశంలో కోవిడ్ వెలుగుచూసినప్పటి నుంచి ఇంతపెద్ద మొత్తంలో మరణాలు సంభంవించడం ఇదే తొలిసారి. దేశమంతా ఉచిత రేషన్, ప్రధాని గరీబ్ కల్యాణ్ అన్న యోజన పథకం నవరంబర్ వరకు పొడిగింపు, అన్‌లాక్ 2.0పై ప్రధాని మోదీ ప్రసంగం హైలెట్స్ ఇవే
తాజా గణాంకాలతో దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 5,85,493కి చేరగా.. మరణాల సంఖ్య 17,400కి పెరిగింది. ప్రస్తుతం 2,20,114 మంది బాధితులు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇప్పటి వరకు కరోనా నుంచి 3,47,979 మంది బాధితులు కోలుకున్నారు. ఇప్పటి వరకు 86 లక్షలకు పైగా కరోనా పరీక్షలు నిర్వహించారు. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ బుధవారం హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. జూన్ 30 వరకు 86,26,585 పరీక్షలు చేశామని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రిసెర్చ్ (ఐసీఎంఆర్) ప్రకటించింది. నిన్న ఒక్కరోజే 2,17,931 నమూనాలు పరీక్షించామని తెలిపింది. దేశంలో నిన్న 18522 మంది కరోనా బారినపడ్డారు.
అత్యధిక పాజిటివ్ కేసుల్లో మహారాష్ట్ర మొదటి స్థానంలోనే ఉండగా, రెండో స్థానంలోకి ఢిల్లీకి బదులు తమిళనాడు వచ్చి చేరింది. ఆరోగ్య శాఖ గణాంకాల ప్రకారం..మహారాష్ట్ర 1,69,883 పాజిటివ్ కేసులతో దేశంలో మొదటి స్థానంలో కొనసాగుతోంది. ఒక్క రోజులోనే 4 వేలకు పైగా కేసులు నమోదు కావడంతో మొత్తం 86,224 కేసులతో తమిళనాడు రెండో స్థానంలోకి వచ్చేసింది. ఆ తర్వాత ఢిల్లీ(85,161), గుజరాత్(31,938), యూపీ(22,828), బెంగాల్(17,907) తదితర రాష్ట్రాలున్నాయి. కేసులు పెరగడంతో కర్ణాటక హరియాణాను మించింది.