New Delhi, August 30: కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ (Ministry of Health and Family Welfare) ఆదివారం విడుదల చేసిన గణాంకాల ప్రకారం దేశంలో కరోనా కేసుల సంఖ్య (Coronavirus Outbreak in India) 35 లక్షలు దాటింది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 78,761 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 35,42,734కు చేరింది. కరోనాతో తాజాగా 948 మంది మృతి (Covid Deaths) చెందారు. దీంతో మొత్త మరణాల సంఖ్య 63,498కు చేరింది. వైరస్ బారిన పడ్డవారిలో ఇప్పటి వరకు 27,13,934 మంది కోలుకున్నారు. భారత్‌లో ప్రస్తుతం 7,65,302 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటి వరకు 4,14,61,636 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు.
లాక్‌డౌన్ నిబంధనలను సడలిస్తున్న కొద్దీ దేశంలో కరోనా కేసులు (New Coronavirus Cases) అధికమవుతున్నాయి. వచ్చే నెల నుంచి అన్‌లాక్-4 అమల్లోకి రానుండగా, వరసుగా గత నాలుగు రోజులుగా 75 వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఈరోజు రికార్డు స్థాయిలో 79 వేలకు దగ్గరగా నమోదయ్యాయి. దీంతో ఒకేరోజు అత్యధిక కేసులు నమోదైన దేశంగా భారత్ నిలిచింది. వారం రోజులుగా ప్రతిరోజుకు సగటున 70,867 కేసులు నమోదవుతున్నాయి. దీంతో ఏడు రోజుల్లోనే 4,96,070 కేసులు నమోదయ్యాయి. ఇది ప్రపంచవ్యాప్తంగా ఏడు రోజుల వ్యవధిలో ఒక దేశంలో అత్యధికంగా నమోదైన పాజటివ్ కేసుల సంఖ్య. దీంతో అమెరికాలో జూలై చివరివారంలో నమోదైన కేసుల సంఖ్యను అధిగమించినట్లయ్యింది. బార్లకు గ్రీన్ సిగ్నల్, సెప్టెంబర్ 30 వరకు కట్టడి ప్రాంతాల్లో పూర్తి స్థాయి లాక్‌డౌన్, విద్యాసంస్థలు బంద్, అన్‌లాక్–4 మార్గదర్శకాలను విడుదల చేసిన హోంశాఖ
ఆగస్టు 29 వరకు 4,14,61,636 నమూనాలను పరీక్షించామని, నిన్న ఒక్కరోజే 10,55,027 మందికి కరోనా పరీక్షలు నిర్వహించామని భారతీ వైద్య పరిశోధనా మండలి (ఐసీఎమ్మార్) ప్రకటించింది. దీంతో ఒకేరోజు ఇంతపెద్ద సంఖ్యలో పరీక్షలు నిర్వహించడం ఇదే మొదటిసారని, తాము నిర్దేశించుకున్న లక్ష్యాన్ని చేరామని వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా గత 24 గంటల్లో కరోనా కేసులు 2,51,55,452కు చేరాయి. ఇప్పటి వరకు కరోనాతో 8,45,956 మంది మృతి చెందగా.. చికిత్స నుంచి కోలుకుని 1,74,99,519 మంది డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 68,09,977 యాక్టివ్ కేసులు ఉన్నాయి. బరువుంటే కరోనాతో ప్రమాదం, 26 అడుగుల దూరం వరకు కోవిడ్ వైరస్ ప్రయాణం, మహిళల కంటే పురుషులకే వైరస్ ముప్పు, రెండోసారి కరోనా సోకుతుందనే దానిపై ఇంకా వీడని సస్పెన్స్
భారత దేశంలో పలు రాష్ట్రాల్లో కరోనా కేసుల వివరాలు..
- మహారాష్ట్ర : ఇప్పటి వరకు 7,64,281 కరోనా కేసులు నమోదు కాగా.. 24,103 మంది మృతి చెందారు.
- తమిళనాడు: మొత్తం 4,15,590 పాజిటీవ్ కేసులు నమోదు కాగా 7,137 మరణాలు సంభవించాయి.
- కర్ణాటక: ఇప్పటి వరకు 3,27,076 కరోనా కేసులు నమోదవ్వగా.. 5,483 మంది మృతి చెందారు.
- ఉత్తరప్రదేశ్: 2,19,457 పాజిటీవ్ కేసులు నమోదుకాగా.. 3,356 మంది మరణించారు.
- ఢిల్లీ: మొత్తం 1,71,366 కరోనా కేసులు నమోదుకాగా.. 4,404 మరణాలు సంభవించాయి.
- పశ్చిమబెంగాల్: 1,56,766 కరోనా కేసులు నమోదు కాగా.. 3,126 మంది మృతి చెందారు.
- బీహార్: ఇప్పటి వరకు 1,32,935 కేసులు నమోదుకాగా 679 మరణాలు సంభవించాయి.
కరోనా వైరస్ సోకి నెగిటివ్ వచ్చిన వ్యక్తులకు కొన్ని రోజుల తర్వాత మళ్లీ పాజిటివ్ సోకే విషయంపై శాస్త్రవేత్తలు క్లారిటీ ఇచ్చారు. కరోనా బారినుంచి కోలుకున్న వ్యక్తులకు మరో సారి పాజిటివ్ రావటానికి కారణం వారి శరీరంలోని మృత వైరస్‌లేనని స్పష్టం చేశారు.రెండవ సారి పాజిటివ్ వచ్చినప్పటికి వారిలో ఎలాంటి రోగ లక్షణాలు కనిపించవని, వారినుంచి వైరస్ ఇతరులకు సోకే ప్రమాదం లేదని తేల్చి చెప్పారు. ‘‘క్లినికల్ ఇన్‌ఫెక్షస్ డీసీజెస్’’ జర్నల్‌లో ప్రచురించిన నివేదికలో ఈ వివరాలను వెల్లడించారు.
కరోనా సోకిన వ్యక్తి శరీరం వేగంగా న్యూట్రలైజింగ్ యాంటీ బాడీస్‌ను విడుదల చేస్తుందని, ఇన్‌ఫెక్షన్ తగ్గిన ఒకటి లేదా రెండు నెలల తర్వాత యాంటీ బాడీస్ సంఖ్య తగ్గిపోతుందని తెలిపారు. శరీరంనుంచి వైరస్‌లను బయటకు పంపేసే ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో ‘రివర్స్ ట్రాన్స్క్రిప్షన్ పాలిమరేస్ చైన్ రియాక్షన్’ టెస్టుల్లో కోలుకున్న వ్యక్తులకు కూడా కొన్ని వారాల తర్వాత పాజిటివ్ వస్తుందని పేర్కొన్నారు.
దీనిపై కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్- ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ జెనోమిక్స్ అండ్ ఇంటిగ్రేటివ్ బయాలజీ డైరెక్టర్ డాక్టర్ అనురాగ్ అగర్వాల్ మాట్లాడుతూ.. రెండవ సారి కరోనా వైరస్ సోకిన కేసుల్ని ఇప్పుడిప్పుడే చూస్తున్నాము. అయితే రెండవ సారి పాజిటివ్ వచ్చినపుడు మొదటిసారి లాగే రెండవ సారి కూడా లక్షణాలు కలిగి ఉన్నట్లు మేము గుర్తించలేదు. మొదటి సారి మాత్రమే లక్షణాలు కనిపించాయి.. రెండవ సారి వైరస్ సోకినపుడు లక్షణాలు లేవు. రెండవ సారి కూడా లక్షణాలతో కరోనా సోకిన కేసులు ఇప్పటి వరకు నమోదు కాలేదని స్పష్టం చేశారు.