COVID-19 lockdown in Bengaluru. (Photo Credit: PTI)

New Delhi, August 30: కరోనావైరస్ లాక్‌డౌన్‌లో భాగంగా సడలింపులు ఇచ్చుకుంటూ వస్తున్న కేంద్ర హోంశాఖ తాజాగా అన్‌లాక్‌–4 మార్గదర్శకాలను (Unlock 4 Guidelines) ప్రకటించింది. కంటైన్‌మెంట్‌ జోన్ల వెలుపల మరిన్ని కార్య కలాపాల పునరుద్ధరణకు వీలుగా కేంద్ర హోం శాఖ (MHA) అన్‌లాక్‌–4 మార్గదర్శకాలను ప్రకటించింది. పలు నగరాలకు ప్రాణాధారంగా మారిన మెట్రో రైళ్లు ఎట్టకేలకు ప్రారంభం (Metro Rail open) కానున్నాయి. సెప్టెంబరు 7వ తేదీ నుంచి రాష్ట్రాలు మెట్రోరైళ్లను నడపవచ్చని పేర్కొంది. అయితే.. కేంద్ర హోంశాఖను సంప్రదించాకే.. పరిమితంగా సేవలను అందించాలని స్పష్టం చేసింది.

దీనిపై కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ ప్రత్యేకంగా మార్గదర్శకాలను విడుదల చేయనుందని వివరించింది. శనివారం విడుదల చేసిన అన్‌లాక్‌ 4.0 (Unlock) మార్గదర్శకాల్లో.. మరిన్ని వెసులుబాట్లు కల్పించింది. ఈ మార్గదర్శకాలు సెప్టెంబరు 1 నుంచి 30 వరకు అమల్లో ఉంటాయి. కట్టడి ప్రాంతాల్లో లాక్‌డౌన్‌ను సెప్టెంబరు 30 వరకు పొడిగించింది. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకూ పలు సూచనలు చేసింది. సెప్టెంబర్‌ 30 వరకు విద్యాసంస్థలు, పాఠశాలలు. స్విమ్మింగ్‌ పూల్స్‌, కోచింగ్‌ సెంటర్లు బంద్‌ కొనసాగుతుందని చెప్పింది. దేశంలో 26 లక్షలు దాటిన డిశ్చార్జ్ కేసులు, యాక్టివ్ ఉన్న కేసులు 7,52,424 మాత్రమే, దేశంలో తాజాగా 76,472 కేసులు నమోదు, 62,550కు పెరిగిన మరణాల సంఖ్య

కాగా విద్యా సంస్థలపై ప్రస్తుతం అమలులో ఉన్న ఆంక్షలను స్వల్పంగా సడలించింది. సెప్టెంబర్‌ 21 నుంచి 50 శాతం మించకుండా ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది హాజరుకావొచ్చని, 9 నుంచి 12 తరగతుల మధ్య విద్యార్థులు స్వచ్ఛందంగా గైడెన్స్‌ కోసం హాజరుకావొచ్చని పేర్కొంది. తల్లిదండ్రులు రాతపూర్వక అనుమతి ఇవ్వాలి. ఉన్నత విద్య శాఖ (డీహెచ్‌ఈ), కేంద్ర హోంశాఖలను సంప్రదించి, విశ్వవిద్యాలయాల్లో పరిశోధన విద్యార్థులు, సాంకేతిక, ప్రొఫెషనల్‌ కోర్సులు చేసే పీజీ విద్యార్థులను ప్రాక్టికల్స్‌ కోసం అనుమతించవచ్చు.

సెప్టెంబరు 21 నుంచి సామాజిక, విద్య, క్రీడలు, వినోదం, సాంస్కృతిక, మతపరమైన, రాజకీయ కార్యక్రమాలు, వివాహ వేడుకలు నిర్వహించుకోవచ్చు. 100 కంటే ఎక్కువ మందిని అనుమతించకూడదు. నిర్వాహకులు థర్మల్‌ స్కానింగ్‌, హ్యాండ్‌ శానిటైజర్లను అందుబాటులో పెట్టాలి. ఓపెన్‌ ఎయిర్‌ థియేటర్లను (Open Air Theatres, Religious Congregations Allowed) 21వ తేదీ నుంచి అనుమతిస్తారు. బార్లను కూడా నిషేధిత జాబితా నుంచి కేంద్రం తొలగించింది. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు.. కంటైన్‌మెంట్‌ వెలుపల ఉన్న ప్రాంతాల్లో లాక్‌డౌన్‌ విధించకూడదు. అంతర్‌ రాష్ట్ర ప్రయాణాలపై నిషేధం ఉండకూడదు. కొవిడ్‌-19 నియంత్రణకు కేంద్రం మార్గదర్శకాలను పాటించాలని ఆదేశాలు జారీ చేసింది. జూలై 29న జారీచేసిన అన్‌లాక్‌ 3 మార్గదర్శకాల్లో యోగా కేంద్రాలు, వ్యాయామ శాలలకు మినహాయింపు ఇచ్చిన విషయం విదితమే. బరువుంటే కరోనాతో ప్రమాదం, 26 అడుగుల దూరం వరకు కోవిడ్ వైరస్ ప్రయాణం, మహిళల కంటే పురుషులకే వైరస్‌ ముప్పు, రెండోసారి కరోనా సోకుతుందనే దానిపై ఇంకా వీడని సస్పెన్స్

అన్‌లాక్‌ 4 మార్గదర్శకాలు

మెట్రో రైలు సర్వీసులను సెప్టెంబర్‌ 7 నుంచి దశలవారీగా పునరుద్ధరించేందుకు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, రైల్వే మంత్రిత్వ శాఖకు అనుమతించింది. దీనికి సంబంధించి, ప్రామాణిక నియమావళిని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ జారీచేస్తుంది.

– సామాజిక, విద్యా, క్రీడలు, వినోదం, సాంస్కతిక, మతపరమైన, రాజకీయపరమైన వేడుకలు, సమావేశాలు, ఇతర సమ్మేళనాలకు అనుమతించింది. అయితే వీటికి 100 మందికి మించి హాజరుకాకూడదన్న ఆంక్ష విధించింది. సెప్టెంబర్‌ 21 నుంచి ఇది అమల్లోకి వస్తుంది. ఈ సమావేశాలకు హాజరయ్యేవారు ఫేస్‌ మాస్క్‌లు ధరించడం, సామాజిక దూరం పాటించడం తప్పనిసరి. థర్మల్‌ స్కానింగ్‌ అందుబాటులో ఉంచడం, హ్యాండ్‌ వాష్‌ లేదా శానిటైజర్‌ ఏర్పాటు చేయడం తప్పనిసరి.

– సెప్టెంబరు 21 నుంచి ఓపెన్‌ ఎయిర్‌ థియేటర్లు తెరిచేందుకు కేంద్రం అనుమతించింది.

– పాఠశాలలు, కళాశాలలు, విద్యా సంస్థలు, కోచింగ్‌ సంస్థలు సాధారణ తరగతి కార్యకలాపాల కోసం 2020 సెప్టెంబర్‌ 30 వరకు మూసి ఉంటాయి. ఆన్‌లైన్‌ తరగతులు, దూరవిద్య తరగతులు కొనసాగుతాయి.

– రాష్ట్రాలు కేంద్రాన్ని సంప్రదించకుండా ఎలాంటి లాక్‌డౌన్‌ (కంటైన్‌మెంట్‌ ప్రాంతాల వెలుపల) విధించకూడదు.

సెప్టెంబరు 21 నుంచి అనుమతించేవి

– ఆన్‌లైన్‌ బోధన, టెలీ–కౌన్సెలింగ్, సంబంధిత పనుల కోసం 50 శాతానికి మించకుండా బోధన, బోధనేతర సిబ్బందిని పాఠశాలలకు పిలవడానికి రాష్ట్రాలు అనుమతించవచ్చు.

– కంటైన్‌మెంట్‌ జోన్ల వెలుపల ఉన్న ప్రాంతాల్లో 9 నుంచి 12 తరగతుల విద్యార్థులు తమ పాఠశాలలను స్వచ్ఛంద ప్రాతిపదికన సందర్శించవచ్చు. వారి ఉపాధ్యాయుల నుంచి మార్గదర్శకత్వం తీసుకోవడానికి మాత్రమే అనుమతిస్తారు. ఇది వారి తల్లిదండ్రులు, సంరక్షకుల రాతపూర్వక సమ్మతికి లోబడి ఉంటుంది.

– నేషనల్‌ స్కిల్‌ ట్రైనింగ్‌ ఇన్స్టి‌ట్యూట్, ఇండస్ట్రియల్‌ ట్రైనింగ్‌ ఇన్స్టి‌ట్యూట్స్‌ (ఐటిఐ), నేషనల్‌ స్కిల్‌ డెవలప్మెంట్‌ కార్పొరేషన్‌ లేదా స్టేట్‌ స్కిల్‌ డెవలప్మెంట్‌ మిషన్స్‌ లేదా భారత ప్రభుత్వ లేదా రాష్ట్ర ప్రభుత్వాల వద్ద నమోదు చేసుకున్న స్వల్పకాలిక శిక్షణా కేంద్రాలలో నైపుణ్యం లేదా వ్యవస్థాపకత శిక్షణకు అనుమతి ఉంటుంది.

– నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఫర్‌ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌ అండ్‌ స్మాల్‌ బిజినెస్‌ డెవలప్‌మెంట్‌ (ఎన్‌ఐఈఎస్‌బీయూడీ), ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌ (ఐఐఇ)లకు అనుమతి ఉంటుంది.

– ప్రయోగశాల, ప్రయోగాత్మక పనులు అవసరమయ్యే సాంకేతిక, వృత్తిపరమైన కోర్సుల పీహెచ్‌డీ, పీజీ విద్యార్థులను అనుమతిస్తారు.

అనుమతించనవి, ఆంక్షలతో అనుమతించేవి

– సినిమా హాళ్ళు, స్విమ్మింగ్‌ పూల్స్, ఎంటర్టైన్మెంట్‌ పార్కులు, థియేటర్లు (ఓపెన్‌ ఎయిర్‌ థియేటర్‌ మినహా), ఇలాంటి ప్రదేశాలకు అనుమతి లేదు.

– హోం శాఖ అనుమతి ఇచ్చినవి మినహా అంతర్జాతీయ విమాన ప్రయాణాలకు అనుమతి లేదు.

– వివాహ వేడుకలకు సెప్టెంబరు 20 వరకు 50 మందికి మించి అనుమతించరాదు. సెప్టెంబరు 21 నుంచి 100 మంది వరకు అనుమతి ఉంటుంది.

– అంత్యక్రియలకు సెప్టెంబరు 20 వరకు 20 మందికి మించరాదు. సెప్టెంబరు 21 నుంచి వంద మంది వరకు అనుమతిస్తారు.

– కంటైన్‌మెంట్‌ జోన్లలో సెప్టెంబరు 30 వరకు లాక్‌డౌన్‌ నిబంధనలు అమల్లో ఉంటాయి.