Coornavirus in India: ఆక్సిజన్ సంక్షోభంలో 270 మంది ప్రాణాలను కాపాడిన డాక్టర్, చిన్నారులపై పంజా విసురుతున్న కోవిడ్ సెకండ్ వేవ్, దేశంలో తాజాగా 2,81,386 మందికి కరోనా నిర్ధారణ, 3,78,741 మంది కోలుకుని డిశ్చార్జ్
Coronavirus in India (Photo Credits: PTI)

New Delhi, May 17: భార‌త్‌లో నిన్న‌ కొత్త‌గా 2,81,386 మందికి కరోనా నిర్ధారణ ( Coronavirus in India) అయింది. వీటికి సంబంధించిన వివరాలను కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ రోజు ఉదయం విడుదల చేసింది. వాటి ప్రకారం... నిన్న 3,78,741 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,49,65,463కు (Covid in India) చేరింది. గడచిన 24 గంట‌ల సమయంలో 4,106 మంది కరోనా కారణంగా మృతి (Covid Deaths) చెందారు.

దీంతో మృతుల సంఖ్య 2,74,390కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 2,11,74,076 మంది కోలుకున్నారు. 35,16,997 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. దేశ వ్యాప్తంగా 18,29,26,460 మందికి వ్యాక్సిన్లు వేశారు.

కరోనా సెకండ్ వేవ్ స్రధానంగా పిల్లలపై పంజా విసురుతోంది. ఉత్తరాఖండ్‌లో పది రోజుల్లో ఏకంగా వెయ్యిమందికిపైగా చిన్నారులు కరోనా బారినపడడం ఆందోళన రేకెత్తిస్తోంది. బాధిత చిన్నారులందరూ 9 ఏళ్ల లోపు వారే కావడం గమనార్హం. చిన్నారుల్లో కొందరు హోం ఐసోలేషన్‌లో ఉండగా, మరికొందరు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఏప్రిల్ 1-15 మధ్య 264 మంది చిన్నారులకు కరోనా సంక్రమించింది.

తీర రాష్ట్రాలను వణికిస్తోన్న తౌక్టే తుఫాను, గుజరాత్‌ తీర ప్రాంతంలో ఆరెంజ్‌ అలర్ట్‌, తీరం దాటే సమయంలో గంటకు 145 నుంచి 175 కిమీల వేగంతో ఈదురుగాలులు

ఆ తర్వాత వ్యాప్తి క్రమంగా పెరిగింది. ఏప్రిల్ 16-30 మధ్య 1,053 మందికి వైరస్ సోకింది. ఈ నెల 1వ తేదీ నుంచి 14వ తేదీ మధ్య మరో 1,618 మంది చిన్నారులు ఈ మహమ్మారి బారినపడినట్టు ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. కాగా, ప్రభుత్వం మాత్రం గత ఏడాది కాలంలో 2,131 మంది చిన్నారులు కరోనా బారినపడ్డారని చెబుతోంది.

దేశవ్యాప్తంగానూ చిన్నారుల్లో కరోనా కేసులు పెద్ద ఎత్తున వెలుగుచూస్తున్నాయి. కాగా, ఇప్పటి వరకు 18 ఏళ్లు దాటిన వారికి మాత్రమే మన దేశంలో టీకా అందుబాటులో ఉంది. ప్రస్తుతం పలు సంస్థలు చిన్నారులపై వ్యాక్సిన్ ట్రయల్స్ నిర్వహిస్తున్నాయి. అవి విజయవంతమైతే 18 ఏళ్ల లోపు వారికీ వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుంది.

పుట్టిన రోజు వేడుకలు జరుపుకోవడం కంటే విధి నిర్వహణకే అధిక ప్రాధాన్యం ఇచ్చిన ఓ వైద్యుడు సమయస్ఫూర్తిగా వ్యవహరించి 270 మంది కొవిడ్ రోగుల ప్రాణాలు కాపాడాడు. మహారాష్ట్రలోని జలగావ్‌లోని ఆసుపత్రిలో గురువారం జరిగిన ఈ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది.

హర్యానా సీఎంకు రైతుల నుంచి నిరసన సెగ, రైతులపై టియర్ గ్యాస్, పోలీసుల లాఠీ చార్జ్, తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన రైతు సంఘాలు, ఈ నెల 24 వరకు హ‌ర్యానాలో లాక్‌డౌన్ పొడిగింపు

ఇక్కడి ప్రభుత్వ వైద్య కళాశాలలో ఈ నెల 13న ఏడున్నర గంటల సమయంలో 20 కిలో లీటర్ల ఆక్సిజన్ ట్యాంకు ఖాళీకావచ్చింది. అప్పటికి ఆసుపత్రిలో దాదాపు 270 మంది రోగులు ఆక్సిజన్‌పై చికిత్స పొందుతున్నారు. మరోవైపు, ఆక్సిజన్ ట్యాంకర్లు సకాలంలో ఆసుపత్రికి చేరుకోలేకపోయాయి.

ప్రమాదాన్ని గుర్తించిన డాక్టర్ సందీప్ బృందం ట్యాంకర్ ఖాళీ అవడానికి సరిగ్గా పది నిమిషాల ముందు 100 ఆక్సిజన్ సిలిండర్లను అమర్చి రోగుల ప్రాణాలను కాపాడింది. ఇందుకోసం వారు దాదాపు 8 గంటలుగా శ్రమించారు. నిజానికి ఆ రోజు సందీప్ బర్త్ డే. ఇంటి నుంచి ఫోన్లు వస్తున్నా విధి నిర్వహణకే ప్రాధాన్యం ఇచ్చిన సందీప్ వందలాదిమంది ప్రాణాలను కాపాడాడు. దీంతో సందీప్‌పై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.