New Delhi, October 27: భారత్‌లో కరోనా కేసుల సంఖ్య 79,46,000 దాటాయి. ఇదిలా వుండగా గడచిన 24 గంటలలో దేశంలో 36,470 కరోనా పాజిటివ్ కేసులు (Coronavirus in India) నమోదు కాగా 488 మంది మృతి చెందారు. అదేవిధంగా గడచిన 24 గంటలలో దేశ వ్యాప్తంగా63, 842 మంది డిశ్ఛార్జ్ అయ్యారు. దేశవ్యాప్తంగా 6,25,857 యాక్టివ్ కేసులు (Coronavirus Outbreak) ఉన్నాయి. భారత్‌లో కరోనా నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య ఎక్కువగా ఉంది. చికిత్స పొంది 72,01,070 మంది దేశ వ్యాప్తంగా డిశార్జ్ అయ్యారు.
ఇప్పటివరకు ఈ వైరస్ కారణంగా దేశవ్యాప్తంగా 1,19,502 మంది మృతి చెందారు. దేశంలో రికవరీ రేటు 90.62 శాతంగా ఉంది. దేశంలో నమోదయిన మొత్తం కేసులలో యాక్టివ్ కేసుల శాతం కేవలం 7.88 శాతం మాత్రమే. దేశంలో మొత్తం నమోదయిన కేసులలో మరణాల సంఖ్య 1.50 శాతానికి తగ్గింది. గడచిన 24 గంటలలో దేశవ్యాప్తంగా 9,58,116 కరోనా పరీక్షలు నిర్వహించగా, ఇప్పటి వరకు మొత్తం 10,44,20,894 కరోనా టెస్ట్‌లు చేశారు.
దేశంలో ‘సెకండ్‌వేవ్’మొదలయ్యే అవకాశాలున్నాయని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. వచ్చే నెల మూడు, నాలుగు వారాల్లో లేదా డిసెంబర్ మొదటి వారంలో కోవిడ్ ఉధృతి మళ్లీ పెరగొచ్చని అంచనా వేస్తున్నారు. ఏ మహమ్మారి అయినా సెకెండ్‌వేవ్‌లో వ్యాధి తీవ్రత హెచ్చుగా ఉంటుందంటున్నారు. ఇప్పటికే ఫ్రాన్స్, అమెరికా, తదితర పశ్చిమదేశాల్లో కోవిడ్ సెకెండ్‌వేవ్ కేసులు, ప్రభావం క్రమంగా పెరుగుతున్నట్టుగా వార్తలొస్తున్నాయి.
మనదేశంలో తొలిదశ కరోనా వ్యాప్తి (ఫస్ట్‌వేవ్) ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పట్టడం మొదలైందని, త్వరలోనే సెకెండ్‌వేవ్‌ను ఎదుర్కొనేందుకు సిద్ధం కావాల్సి ఉంటుందనే అభిప్రాయం వైద్యవర్గాల్లో వ్యక్తమవుతోంది. పండుగల సీజన్‌లో వైరస్ వ్యాప్తిచెందకుండా ప్రజలు ఏమేరకు ముందు జాగ్రత్తలు తీసుకున్నారనే దానిపై సెకెండ్‌వేవ్ తీవ్రత ఆధారపడి ఉండొచ్చునని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో కేసుల సంఖ్య తగ్గుతున్నా, మరికొన్ని రాష్ట్రాల్లో 2 వారాలుగా అధిక కేసులు నమోదవుతున్నాయి.