KCR, Palani Swamy, Pinarayi Vijayan, Yeddyurappa, Yogi Adityanath (Photo-ANI/FB)

New Delhi, April 20: దేశంలో కరోనావైరస్ కల్లోలం రేపుతోంది. ఎవరినీ వదిలిపెట్టడం లేదు. ఇప్పటికే పలు రాష్ట్రాల సీఎంలు కరోనా బారీన పడి చికిత్స పొందుతున్నారు. అలాగే కోవిడ్ బారీన పడి చాలామంది ముఖ్యమంత్రులు కోలుకున్నారు. కొందరు ఎంపీలు, ఎమ్మెల్యేలు, అలాగే మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా కరోనా కోరల్లో చిక్కుకున్నారు. కొంతమంది కరోనాకి తోడుగా ఇతర అనారోగ్య సమస్యలు తలెత్తడంతో తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు.

తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు (TS CM KCR) కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. సీఎంకు కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయినట్లు రాష్ట్ర ముఖ్యకార్యదర్శి సోమేష్ కుమార్ ధృవీకరించారు. ఈ మేరకు ఆయన సోమవారం సాయంత్రం ప్రెస్ నోట్ విడుదల చేశారు. ముఖ్యమంత్రికి తేలికపాటి లక్షణాలు ఉన్నాయని, ప్రస్తుతం సీఎం కేసీఆర్ ఎర్రవల్లిలోని తన ఫామ్‌హౌస్‌లో ఐసోలేషన్ లో ఉన్నారని సోమేష్ కుమార్ తెలిపారు. ప్రత్యేక వైద్యుల బృందం సీఎం కేసీఆర్ ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తోందని ఆయన వెల్లడించారు.

ఒక్కరోజే 1,761 మంది మృతి, దేశంలో తాజాగా 2,59,170 మందికి కరోనా, భారత్ ఎవరూ వెళ్లవద్దు, పౌరులకు అమెరికా కీలక సూచనలు, తమిళనాడులో పూర్తి స్థాయి కర్ఫ్యూ అమల్లోకి

మనదేశంలో ముఖ్యమంత్రులకు కరోనా సోకి చికిత్స తీసుకుంటుండగా మరి కొందరు సీఎంలు (chief ministers) కరోనా నుంచి కోలుకున్నారు. తమిళనాడు సీఎం పళని స్వామి (Tamil Nadu CM Palani Swamy), కేరళ సీఎం పినరయి విజయన్ (Kerala CM Pinarayi Vijayan)‌‌, కర్ణాటక సీఎం యడ్యూరప్ప (Karnataka CM Yeddyurappa), యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ (UP CM Yogi Adityanath)లకు కరోనా బారిన పడి స్వీయ నిర్భంధంలోకి వెళ్లారు. తాజాగా తెలంగాణ సీఎం కేసీఆర్‌ కూడా ఈ జాబితాలో చేరారు.

ఇక భారత మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కి కూడా కరోనా సోకిన విషయం తెలిసిందే. మరో మాజీ ప్రధాని హెచ్‌డీ దేవెగౌడ, ఆయన భార్యకి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఆయన కుమారుడు కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామికి కరోనా పాజిటివ్‌గా తేలింది. వీరంతా ఐసోలేషన్‌లో ఉన్నారు. ఇక ఉత్తరాఖండ్ సీఎం తిరథ్ సింగ్, త్రిపుర సీఎం బిప్లబ్ కుమార్ దేవ్‌‌లకు కరోనా సోకడంతో చికిత్స పొంది కోలుకున్నారు. అలాగే మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ థాకరే భార్య రష్మీ థాకరే కరోనా వైరస్ నుంచి నుంచి కోలుకున్నారు.

దుకాణాలు, మార్కెట్లు సాయంత్రం 5 గంటలకే మూసివేయాలి, మే 3 వరకూ కర్ఫ్యూ పొడిగింపు, నూతన గైడ్‌లైన్స్‌ను జారీ చేసిన రాజస్థాన్ సర్కారు, రాష్ట్రంలో తాజాగా 10,000 కు పైగా కేసులు నమోదు

హర్యానా మాజీ ముఖ్యమంత్రి భూపిందర్ సింగ్ హుడా మరియు అతని భార్య ఆశా హూడా లకు కూడా రెండు రోజుల క్రితం కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. వీరు గురుగ్రామ్‌లోని మెదంతలో చికిత్స తీసుకుంటున్నారు. వీరితో పాటుగా గుజరాత్ సీఎం విజయ్ రూపానికి కూడా కరోనా వైరస్ పాజిటవ్ గా నిర్థారణ అయింది. ఆయన ఓ ర్యాలీలో కళ్లుతిరిగి పడిపోగా పరీక్షల్లో కరోనాగా నిర్థారణ అయింది.

మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కోవిడ్ -19 బారీన పడి కోలుకున్నారు. అలాగే హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టార్ కూడా కరోనా బారీన పడి చికిత్స అనంతరం కోలుకున్నారు. అలాగే గోవా సీఎం ప్రమోద్ సావంత్ కూడా కరోనా కోరల్లో చిక్కుకున్నారు. చికిత్స అనంతరం కోలుకున్నారు.