India Coronavirus Update: ఒక్కరోజే 1,761 మంది మృతి, దేశంలో తాజాగా 2,59,170 మందికి కరోనా, భారత్ ఎవరూ వెళ్లవద్దు, పౌరులకు అమెరికా కీలక సూచనలు, తమిళనాడులో పూర్తి స్థాయి కర్ఫ్యూ అమల్లోకి
coronavirus ward in hospital

New Delhi, April 20: దేశంలో కొత్త‌గా 2,59,170 మందికి కరోనా నిర్ధారణ అయింది. వీటికి సంబంధించిన వివరాలను కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ రోజు ఉదయం విడుదల చేసింది. వాటి ప్రకారం... నిన్న‌ 1,54,761 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,53,21,089కు (India Coronavirus) చేరింది. గడచిన 24 గంట‌ల సమయంలో 1,761 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,80,530కు (Covid Deaths) పెరిగింది.

దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 1,31,08,582 మంది కోలుకున్నారు. 20,31,977 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. దేశ వ్యాప్తంగా 12,71,29,113 మందికి వ్యాక్సిన్లు వేశారు. కాగా, దేశంలో నిన్నటి వరకు మొత్తం 26,94,14,035 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న 15,19,486 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది.

భారత్‌లో కరోనా వైరస్ ఉద్ధృతి కొనసాగుతున్న నేపథ్యంలో అమెరికా తన పౌరులకు కీలక సూచనలు చేసింది. వైరస్ వ్యాప్తి నెమ్మదించే వరకు భారత పర్యటనకు దూరంగా ఉండాలని సూచించింది. వ్యాక్సిన్ తీసుకున్న వారు కూడా కరోనా బారినపడే అవకాశం ఉందని, కాబట్టి భారత పర్యటనను రద్దు చేసుకోవాలని కోరింది. తప్పనిసరి పరిస్థితుల్లో వెళ్లాల్సి వస్తే మాత్రం ముందస్తుగా పూర్తిస్థాయిలో వ్యాక్సిన్ తీసుకోవాలని అమెరికా సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ (సీడీసీ) కోరింది. మరోవైపు, బ్రిటన్ కూడా భారత్‌ను తన ట్రావెల్ ‘రెడ్ లిస్ట్’లో చేర్చింది. ఈ నెల 25న భారత పర్యటనకు రావాల్సిన ఆ దేశ ప్రధాని బోరిస్ జాన్సన్ తన పర్యటనను రద్దు చేసుకున్నారు.

దుకాణాలు, మార్కెట్లు సాయంత్రం 5 గంటలకే మూసివేయాలి, మే 3 వరకూ కర్ఫ్యూ పొడిగింపు, నూతన గైడ్‌లైన్స్‌ను జారీ చేసిన రాజస్థాన్ సర్కారు, రాష్ట్రంలో తాజాగా 10,000 కు పైగా కేసులు నమోదు

కరోనా కట్టడిపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వంపై (UP Govt) అలహాబాదు హైకోర్టు మొట్టికాయలు వేసింది. మహమ్మారి తీవ్రత ఎక్కువగా ఉన్న లక్నో, ప్రయాగ్‌రాజ్‌, వారణాసి, కాన్పూర్‌, గోరఖ్‌పూర్‌ నగరాల్లో ఈరోజు రాత్రి నుంచి ఏప్రిల్‌ 26 వరకు పూర్తిస్థాయి లాక్‌డౌన్ విధించాలని సోమవారం ఆదేశించింది. కానీ, అందుకు యోగి ఆదిత్యనాథ్‌ సర్కార్‌ నిరాకరించింది. ప్రస్తుత పరిస్థితుల్లో అది సాధ్యం కాదని తేల్చి చెప్పింది. అయితే, కరోనా నియంత్రణకు కఠిన ఆంక్షలు అమలు చేస్తామని స్పష్టం చేసింది.

భారత వైద్య పరిశోధన మండలి (ICMR) కరోనా సెకండ్ వేవ్ పై ఆసక్తికర అంశాలు వెల్లడించింది. కొత్తగా వెల్లడవుతున్న కేసుల్లో 70 శాతం 40 ఏళ్లకు పైబడినవారే ఉంటున్నారని తెలిపింది. గతేడాదితో పోల్చితే అత్యధికంగా కరోనా బారినపడుతున్న వారి వయసుల్లో పెద్దగా వ్యత్యాసం లేదని ఐసీఎంఆర్ డైరెక్టర్ బలరామ్ భార్గవ అన్నారు. అయితే కరోనా 2.0లో ఆసుపత్రుల్లో ఆక్సిజన్ వినియోగం బాగా పెరిగిందని తెలిపారు. అదే సమయంలో, మొదటి విడతతో పోల్చితే ఈ దఫా వెంటిలేటర్ల వాడకం తగ్గిందని వివరించారు. కరోనా మొదటి తాకిడి సందర్భంగా 41.5 శాతం మందికి ఆక్సిజన్ అవసరం కాగా, రెండో తాకిడిలో 54.5 శాతం ఆక్సిజన్ అవసరం ఏర్పడుతోందని పేర్కొన్నారు. గతంలో లక్షణాలు లేని రోగుల సంఖ్య తక్కువగా ఉంటే, ఇప్పుడు అలాంటి వారి సంఖ్య ఎక్కువగా ఉందని అన్నారు.

దేశ రాజధానిలో 6 రోజుల పాటు పూర్తి స్థాయి లాక్‌డౌన్, రాత్రి కర్ఫ్యూని లాక్‌డౌన్‌గా మార్చిన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, ఢిల్లీలో కొనసాగుతున్న నాలుగో వేవ్

కరోనా వ్యాప్తికి అడ్డుకట్ట వేసే దిశగా కేంద్రం పలు చర్యలు చేపట్టింది. ఇప్పటికే మే 1 నుంచి 18 ఏళ్లు నిండిన వారందరికీ టీకా ఇవ్వాలని నిర్ణయించిన కేంద్రం.. ఇకపై రాష్ట్ర ప్రభుత్వాలు నేరుగా తయారీ సంస్థల వద్దే టీకాలు కొనుగోలు చేసేందుకు అనుమతి ఇచ్చింది. ముందుగా నిర్ధారించిన ధరల మేరకు సంస్థలు రాష్ట్రాలకు టీకాలు విక్రయించవచ్చని కేంద్రం స్పష్టం చేసింది. రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు ప్రైవేట్‌ ఆస్పత్రులు ఇతర పరిశ్రమలు సొంతంగా టీకాలు కొనుగోలు చేసుకునే అవకాశం కల్పించింది. అయితే, వ్యాక్సిన్‌ తయారీ సంస్థలు వారు తయారు చేసిన టీకాల్లో 50 శాతం కచ్చితంగా కేంద్రానికి అందించాలి. మిగిలిన 50 శాతం టీకాల్ని మాత్రమే బహిరంగ మార్కెట్‌లో విక్రయించాలని షరతు విధించింది.

చాలాకాలం తరువాత తమిళనాడు రాష్ట్రంలో మళ్లీ ‘కరోనా కర్ఫ్యూ’ అమలులోకి రానుంది. మంగళ వారం రాత్రి 10 నుంచి వేకువజామున 4గంటల వరకు బయట ఎలాంటి జనసంచారం వుండకూడదంటూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశా లు జారీ చేసిన విషయం తెలిసిందే. కరోనా రెండోదశ వ్యాప్తి నియంత్రణలో భాగంగా పోలీసులు కర్ఫ్యూను కఠినంగా అమలు చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ మేరకు వారికి ఇప్పటికే ఆదేశాలు జారీ అయ్యాయి. కర్ఫ్యూ అమలు సమయంలో ప్రభుత్వ రవాణా సంస్థ, ప్రైవేటు రవాణా సంస్థ బస్సుసర్వీసులను రద్దు చేస్తున్నారు. రహదారులపై. టాక్సీలు, ఆటోలు, ఓలా, ఊబర్‌ వాహనాలు తిరుగ కుండా కట్టుదిట్టం చేస్తున్నారు.

ఇంగ్లీష్ మందులు ఎందుకమ్మా..ఒక్క పెగ్ వేస్తే అన్నీ మాయం, ఇంజెక్ష‌న్‌ల‌తో ఉప‌యోగం ఉండ‌ద‌ని, ఆల్క‌హాల్ మాత్ర‌మే ఉప‌యోగక‌రంగా ఉంటుంద‌ని తెలిపిన మహిళ, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో

అదేవిధంగా పొరుగు రాష్ట్రాల నుంచి ప్రభుత్వ, ప్రైవేటు రవాణా సంస్థల బస్సులు, వాహనాలను కర్ఫ్యూ సమయంలో రాష్ట్రంలో ప్రవేశించడంపై నిషేధం విధిం చారు. కర్ఫ్యూ కారణంగా సినిమా థియేటర్లలో ఈవెనింగ్‌ షోలు రాత్రి 9 గంటలలోపున పూర్తి చేయాలని, సెకెండ్‌ షోలు ప్రదర్శిం చేందుకు అనుమతి లేదని ప్రభుత్వం ప్రకటించింది. కర్ఫ్యూ అమ లుకు వీలుగా రాష్ట్రంలోని అన్ని దుకాణాలను రాత్రి తొమ్మిది గంట లకల్లా మూసివేయాలని కూడా ఆదేశించారు. కర్ఫ్యూ సమయంలో అనవసరంగా సంచరించే వ్యక్తులను అరెస్టు చేయాలని పోలీసుశాఖ అధికారులు ఆదేశాలు కూడా జారీ చేశారు.

కర్ణాటక రాజధాని బెంగళూరులో కరోనా కేసులు తీవ్రంగా పెరుగుతుండగా ప్రభుత్వం పలు కఠిన చర్యలకు నాంది పలికింది. తక్షణం అమల్లోకి వచ్చేలా రాత్రి కర్ఫ్యూను ప్రకటించింది. బెంగళూరులో రోజూ 10 వేలకు పైగా కోవిడ్‌ కేసులు నమోదవుతున్నాయి. విధానసౌధలో రెవెన్యూ మంత్రి ఆర్‌.అశోక్‌ అధ్యక్షతన పలువురు సీనియర్‌ మంత్రులతో సమావేశం జరిగింది.

కోవిడ్‌కు గురై ఆస్పత్రిలో ఉన్న సీఎం యడియూరప్ప వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా పాల్గొన్నారు. రాత్రి 8 గంటల నుంచి ఉదయం 6 వరకు రాత్రి కర్ఫ్యూను విధిస్తున్నట్లు నిర్ణయించారు. ప్రతి శని, ఆదివారాల్లో బెంగళూరులో లాక్‌డౌన్‌ విధించాలని మంత్రులు సూచించగా సీఎం అంగీకరించలేదు. లాక్‌డౌన్‌తో ఆర్థికంగా నష్టపోతామన్నారు. స్కూళ్లు, మాల్స్, కళ్యాణ మండపాలు తదితరాలను కొంతకాలం మూసేయాలని చర్చించినా ఏకాభిప్రాయం కుదరలేదు.