శ్రీలంక పర్యటనలో టీమిండియా మరో మ్యాచ్ మిగిలుండగానే మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో 2-0 ఆధిక్యంలో నిలిచింది. ఆదివారం పల్లెకెలె వేదికగా వర్షం అంతరాయం కలిగించిన రెండో టీ20ని టీమ్‌ఇండియా 7 వికెట్ల తేడాతో గెలుచుకుంది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన లంకేయులు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 161 పరుగులు చేశారు. కుశాల్ పెరీరా (34 బంతుల్లో 53, 6 ఫోర్లు, 2 సిక్సర్లు), పతుమ్ నిస్సంక (24 బంతుల్లో 32, 5 ఫోర్లు) రాణించారు. ఒకదశలో 15 ఓవర్లకు 130/3గా ఉన్న ఆ జట్టు ఆ తర్వాత క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోవడంతో చివరి ఐదు ఓవర్లలో 31 పరుగులు మాత్రమే జోడించి 6 వికెట్లు నష్టపోయింది. టీమిండియా-శ్రీలంక తొలి టీ20 మ్యాచ్... 43 పరుగుల తేడాతో శ్రీలంకపై టీమిండియా అద్భుత విజయం
భారత బౌలర్లలో రవి బిష్ణోయ్ (3/26) రాణించగా అర్ష్‌దీప్, అక్షర్, హార్దిక్ తలా రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం ఛేదనలో వర్షం రావడంతో అంపైర్లు భారత లక్ష్యాన్ని డక్‌వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం 8 ఓవర్లలో 78 పరుగులుగా నిర్దారించారు. 6.3 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి భారత్ 81 పరుగులు చేసింది. ఓపెనర్ యశస్వీ జైస్వాల్ (15 బంతుల్లో 30, 3 ఫోర్లు, 2 సిక్సర్లు), కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (12 బంతుల్లో 26, 4 ఫోర్లు, 1 సిక్స్), హార్దిక్ పాండ్యా (9 బంతుల్లో 22 నాటౌట్, 3 ఫోర్లు, 1 సిక్స్) ధాటిగా ఆడి మరో 9 బంతులుండగానే విజయాన్ని పూర్తి చేశారు. బిష్ణోయ్‌కు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు లభించింది. ఈ సిరీస్‌లో ఆఖరి మ్యాచ్ మంగళవారం జరుగనుంది.