New Delhi, May 11: దేశంలో నిన్నతాజాగా 3,29,942 మందికి కరోనా నిర్ధారణ ( 3,29,942 New Coronavirus Cases) అయింది. నిన్న ఒక్కరోజే 3,56,082 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,29,92,517కు చేరింది. గడచిన 24 గంటల సమయంలో 3,876 మంది కరోనా కారణంగా మృతి (3,876 Deaths in Past 24 Hours) చెందారు.
దీంతో మృతుల సంఖ్య 2,49,992కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 1,90,27,304 మంది కోలుకున్నారు. 37,15,221 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. దేశ వ్యాప్తంగా 17,27,10,066 మందికి వ్యాక్సిన్లు వేశారు.
దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 30,56,00,187 కోవిడ్ పరీక్షలను ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ నిర్వహించింది. గడిచిన 24 గంటల్లో 18,50,110 కోవిడ్ టెస్టులను ఐసీఎంఆర్ నిర్వహించింది. కాగా.. ఇప్పటి వరకూ కొవిడ్ టీకాను 17,27,10,066 మందికి ఇచ్చినట్టు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.
ఆసుపత్రులలో చేరిన 80 శాతం కరోనా బాధితులు తగిన ఔషధాలు, సౌకర్యాలతో కోలుకుంటున్నారని గుజరాత్‌కు చెందిన వైద్య నిపుణులు అంటున్నారు. బాధితులంతా బెడ్‌ల కోసం ఎదురు చూడాల్సిన అవసరం లేదని, 20 శాతం మంది బాధితులకు మాత్రమే ఐసీయూ బెడ్‌లు అవసరమవుతాయంటున్నారు. అలాగే రెమిడెసివిర్ ఇంజిక్షన్ అవసరమైన మేరకే వినియోగించాలన్నారు.
రెమిడెసివిర్ ఇంజిక్షన్ అనేది యాంటీ-వైరల్ డ్రగ్. ఇది కరోనా చికిత్సలో విస్తృతంగా ఉపయోగిస్తున్నారు. కోవిడ్ సెకెండ్ వేవ్‌లో దీనికి మరింత డిమాండ్ పెరిగింది. 80 శాతం మంది బాధితులు సరైన ఔషధాలు, తగిన విశ్రాంతితో కోలుకుంటున్నారన్నారు. 20 శాతం మంది బాధితులకు మాత్రమే ఆసుపత్రిలో చేరాల్సిన అవసరం ఉంటుందన్నారు.
కేరళ రాష్ట్రంలో గత పది రోజుల్లో వెయ్యిమందికి పైగా ఆరోగ్యకార్యకర్తలకు కొవిడ్-19 సోకిందని కేరళ రాష్ట్ర వైద్యాధికారుల సంఘం వెల్లడించింది. ‘‘కేరళ రాష్ట్రంలో రోజురోజుకు కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది. 4.5 లక్షలమంది కరోనా రోగులు ప్రస్థుతం చికిత్స పొందుతున్నారు, దీనివల్ల ఆరోగ్య కార్యకర్తలు కరోనా బారిన పడి రోగులవుతున్నారు.
గడచిన 10 రోజుల్లో వెయ్యిమందికి పైగా ఆరోగ్య కార్యకర్తలు కరోనా బారిన పడ్డారు’’ అని కేరళ ప్రభుత్వ వైద్యాధికారుల సంఘం ప్రధాన కార్యదర్శి డాక్టర్ టీఎన్ సురేష్ చెప్పారు. రాష్ట్రంలో వైద్యసౌకర్యాలు మెరుగుపర్చాలని తాము ప్రభుత్వానికి విన్నవించామని డాక్టర్ సురేష్ పేర్కొన్నారు. కేరళలో గత 24 గంటల్లో 27,487 కరోనా పాజిటివ్ కేసులు వెలుగుచూశాయని ఆరోగ్యశాఖ తెలిపింది. గడచిన 24 గంటల్లో 65 మంది కరోనాతో మరణించగా, మొత్తం మరణాల సంఖ్య 5,978కి పెరిగింది.