India Rejects China's Allegations: చైనావి అన్నీ తప్పుడు ప్రకటనలు, మేము ఎల్ఏసీ నియ‌మావ‌ళిని ఉల్లంఘించ‌లేద‌ు, స్పష్టం చేసిన భారత ఆర్మీ, పాన్‌గాంగ్ స‌ర‌స్సు రెచిన్ లా వ‌ద్ద కాల్పుల కలకలం
Ladakh sector of LAC | (Photo Credits: AFP)

New Delhi, September 8: సరిహద్దుల్లో ముందుగా భారత ఆర్మీనే కాల్పులు జరిపిందంటూ సంచలన ఆరోపణలు చేసిన చైనాకు ఇండియన్ ఆర్మీ ధీటుగా బదులిచ్చింది. ఇండియ‌న్ పొజిష‌న్స్‌కు స‌మీపంగా పీఎల్ఏ ద‌ళాలు ముందుకు వ‌చ్చి గాలిలోకి కాల్పులు జ‌రిపిన‌ట్లు ఇవాళ భార‌త ర‌క్ష‌ణ‌శాఖ పేర్కొన్న‌ది. పాన్‌గాంగ్ స‌రస్సు వ‌ద్ద తమ ద‌ళాలు ఎల్ఏసీ నియ‌మావ‌ళిని ఉల్లంఘించ‌లేద‌ని ఆర్మీ పేర్కొన్న‌ది.

చైనా సైన్యమే రెచ్చగొట్టే చర్యలకు పాల్పడుతోందని, తాము సంయమనం పాటిస్తున్నామని స్పష్టం చేసింది. చైనాకు చెందిన పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పీఎల్ఏ) అంతకుముందు భారత సైన్యంపై తీవ్ర ఆరోపణలు చేసింది. గాడ్ పావో పర్వత ప్రాంతంలో భారత సైన్యం చట్ట విరుద్ధంగా సరిహద్దులను దాటిందని, హెచ్చరిస్తూ కాల్పులు జరిపిందని ఆరోపించింది.

దేశీయ‌, అంతర్జాతీయ ప్ర‌జ‌ల‌ను త‌ప్పుదోవ ప‌ట్టిచేందుకు చైనా త‌ప్పుడు ప్ర‌క‌ట‌న‌లు చేస్తున్న‌ట్లు (India Rejects China's Allegations) ఆర్మీ ఓ ప్ర‌క‌ట‌న‌లో వెల్ల‌డించింది. ఏ ద‌శ‌లోనూ భార‌తీయ బ‌ల‌గాలు వాస్త‌వాధీన రేఖ‌ను దాట‌లేద‌ని చెప్పింది. ఎటువంటి క‌వ్వింపు చ‌ర్య‌ల‌కు కూడా పాల్ప‌డ‌లేద‌ని వెల్ల‌డించింది. పాన్‌గాంగ్ స‌ర‌స్సు వ‌ద్ద ద‌క్షిణం వైపున ఉన్న రెచిన్ లా ( Pangong Tso) వ‌ద్ద చైనా ద‌ళాలు అనేక మార్లు దూకుడుగా వ్య‌వ‌హ‌రించినా తాము మాత్రం ఎటువంటి క‌వ్వింపుకు పాల్ప‌డ‌లేద‌ని (No Shots Fired by India at LAC in Ladakh) భార‌తీయ ఆర్మీ వెల్ల‌డించింది.

సరిహద్దుల్లో మానవత్వాన్ని చాటుకున్న భారత సైన్యం, 13 జడల బర్రెలు, 4 దూడలను చైనా సైన్యానికి అప్పగించిన భారత జవాన్లు, కృతజ్ఞతలు తెలిపిన చైనా అధికారులు

రెచిన్ లా వ‌ద్ద సుమారు 7 వేల మంది భార‌తీయ సైనికులు ఉన్నారు. గ‌త రాత్రి జ‌రిగిన ఘ‌ట‌న నేప‌థ్యంలో ఆ ప్రాంతంలో ట్యాంకుల‌ను కూడా మోహ‌రించారు. భార‌త ద‌ళాలు కాల్పులు జ‌రిపిన‌ట్లు ఇవాళ ఉద‌యం చైనా వెస్ట్ర‌న్ క‌మాండ‌ర్ త‌మ మిలిట‌రీ వెబ్‌సైట్‌లో ప్ర‌క‌ట‌న చేశారు. ఆ ఆరోప‌ణ‌ల‌ను భార‌త ర‌క్ష‌ణ‌శాఖ ఖండించింది.

పీఎల్ఏ ఆరోపణలు వచ్చిన కొద్ది గంటల్లోనే భారత దేశ రక్షణ మంత్రిత్వ శాఖ మంగళవారం ఓ ప్రకటనను విడుదల చేసింది. వాస్తవాధీన రేఖ (ఎల్ఏసీ) వెంబడి భారత సైన్యం కాల్పులు జరిపినట్లు వచ్చిన ఆరోపణలను తోసిపుచ్చింది. భారత దేశ స్థావరాలకు సమీపంలోకి రావడానికి చైనా సైన్యంప్రయత్నించిందని, గాలిలోకి కాల్పులు జరిపిందని పేర్కొంది. రెండు రోజుల క్రితమే భారత్, చైనా రక్షణ మంత్రులు మాస్కోలో సమావేశమై, చర్చలు జరిపిన సంగతి తెలిసిందే. మరో రెండు రోజుల్లో ఇరు దేశాల విదేశాంగ మంత్రులు సమావేశం కాబోతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో చైనా ఇష్టానుసారం భారత దేశంపై అక్కసు వెళ్లగక్కుతోంది.

సరిహద్దుల్లో అర్థరాత్రి కాల్పులు, భారత సైన్యమే కాల్పులు జరిపిందంటూ చైనా ఆరోపణలు, 5 మంది సంగతి మాకు తెలియదంటూ దాటవేత, చైనాతో యుద్ధంలో ఇండియా ఓడిపోతుందంటూ డ్రాగన్ మీడియా రాతలు

మంగళవారం ఉదయం చైనా మిలిటరీ అధికారిక వెబ్‌‌సైట్‌లో పీఎల్ఏ వెస్టర్న్ థియేటర్ కమాండ్ అధికార ప్రతినిథి కల్నల్ ఝాంగ్ షుయిలి భారత దేశంపై చేసిన ఆరోపణలు ప్రచురితమయ్యాయి. ‘‘ఇవి చాలా తీవ్రమైన, హేయమైన స్వభావంగల రెచ్చగొట్టే సైనిక చర్యలు’’ అంటూ భారత సైన్యంపై ఆరోపణలు చేశారు. ఈ పరిస్థితిని చక్కదిద్దేందుకు చైనీస్ బోర్డర్ గార్డ్స్ ప్రతిచర్యలు చేపట్టారని పేర్కొన్నారు. అయితే ఆ ప్రతిచర్యలు ఏమిటో ఆయన వివరించలేదు. చైనా దళాలు కూడా హెచ్చరిక కాల్పులు జరిపాయా? లేదా? అనే విషయాన్ని వెల్లడించలేదు.

చైనా సైన్యం ఈ ఏడాది మే నెల నుంచి వాస్తవాధీన రేఖ వెంబడి తూర్పు లడఖ్‌లో ఘర్షణలకు తెగబడింది. పీఎల్ఏ దళాలను మోహరిస్తోంది. జూన్‌ 15న రాత్రి సమయంలో భారత సైన్యంపై దొంగ దెబ్బతీసింది. దీంతో 20 మంది భారత జవాన్లు అమరులయ్యారు. పీఎల్ఏ దళాలకు కూడా నష్టం జరిగినప్పటికీ, బయటపెట్టడం లేదు. మిలిటరీ కమాండర్ల స్థాయి చర్చలు, ఇరు దేశాల ప్రత్యేక ప్రతినిథులు, రక్షణ మంత్రుల సమావేశాలు జరుగుతున్నప్పటికీ, పరిస్థితిని చక్కదిద్దేందుకు చైనా సహకరించడం లేదు. మరోవైపు ఆగస్టు 29 రాత్రి మరోసారి ఘర్షణకు దిగింది. ఈ నేపథ్యంలో భారత సైన్యం అప్రమత్తమై కొన్ని ప్రాంతాలపై పట్టు బిగించింది. ఇది చైనా పీఎల్ఏకు కంటగింపుగా మారింది.