India Coronavirus: కరోనా గాలిలో నాలుగు గంటల పాటు బతుకుతుంది, దేశంలో తాజాగా 72,049 మందికి కరోనా, 1,04,555 మంది మృతి, ఇప్పటి వరకు 8,22,71,654 కరోనా నిర్థారణ పరీక్షలు
Medical workers (Photo Credits: IANS)

New Delhi, October 7: దేశంలో గడిచిన 24 గంటల్లో అత్యధికంగా రికార్డు స్థాయిలో 72,049 పాజిటివ్ కేసులు (India Coronavirus), 986 మరణాలు నమోదయ్యాయి. మొత్తం 82,203 మంది ఆస్పత్రుల నుంచి కోలుకుని డిశ్చార్జ్‌ అయ్యారు. ఈ మేరకు బుధవారం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ హెల్త్‌ బుటిటెన్‌ విడుదల చేసింది.

దేశంలో ఇప్పటివరకు 67,57,132 పాజిటివ్‌ కేసులు నమోదవగా యాక్టివ్‌ కేసులు 9,07,883. డిశ్చార్జ్‌ అయిన వారి సంఖ్య 57,44,693. ఇప్పటివరకు దేశంలో కరోనా బారినపడి మొత్తం 1,04,555 మంది మృతి ( Death Toll Mounts to 1,04,555) చెందారు. దేశంలో కరోనా బాధితుల రికవరీ రేటు 85.02 శాతంగా ఉంది. ఇప్పటి వరకు నమోదైన మొత్తం కేసుల్లో యాక్టివ్‌ కేసుల శాతం 13.44. దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు 8,22,71,654 కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించారు.

పంజాబ్ ఆరోగ్య శాఖ మంత్రి బల్బీర్ సింగ్ సిద్ధుకు కరోనా పాజిటివ్‌గా (Punjab Health Minister Balbir Singh Sidhu covid 19) తేలింది. ఇటీవల సంగ్రూర్‌లో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీతో వేదికను పంచుకున్నారు. బల్బీర్ సింగ్ సిద్ధుకు తేలికపాటి జ్వరం, గొంతు నొప్పి ఉండటంతో పరీక్షలు చేశామని మొహాలి సివిల్ సర్జన్ మంజిత్ సింగ్ తెలిపారు. ‘బల్బీర్‌ సింగ్‌ తన ఇంట్లో ఐసోలేషన్‌లో ఉన్నారు. ఆయనతో ఉన్న వ్యక్తులకు కూడా కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు’ అని డాక్టర్‌ తెలిపారు. కాగా సంగ్రూర్‌లో సోమవారం నిర్వహించిన ఖేతి బచావోలో బల్బీర్ సింగ్ సిద్ధు కాంగ్రెస్‌ నాయకుడు రాహుల్‌ గాంధీతో కలిసి పాల్గొన్నారు.

మోడీ ప్రభుత్వం అకౌంట్లో రూ. 3 వేలు వేస్తోందా? ఈ వార్త అంతా అబద్దమని తెలిపిన పీఐబీ, తప్పుడు వార్తలు నమ్మవద్దని హితవు

హరియాణా ఉపముఖ్యమంత్రి దుష్యంత్ చౌతాలా కూడా కోవిడ్‌ (Haryana Deputy Chief Minister Dushyanth Chautala Covid 19) బారిన పడ్డారు. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే సోషల్‌ మీడియా వేదికగా తెలియజేశారు. ‘స్నేహితులకు, శ్రేయోభిలాషులకు ఓ విషయం చెప్పాలనుకుంటున్నాను. ఇంతకు ముందే కోవిడ్‌ నిర్ధారణ రిపోర్ట్స్‌ వచ్చాయి. దాంట్లో నాకు పాజిటివ్‌ అని తేలింది. ప్రస్తుతం నేను ఆరోగ్యంగా ఉన్నాను. ఇటీవల నన్ను కలిసిన వారందరూ స్వీయ నిర్భంధంలో ఉండండి. లక్షణాలు కనిపిస్తే వెంటనే ఆస్పత్రికి వెళ్లండి’ అని దుష్యంత్‌ ట్వీట్‌ చేశారు.

ఇదిలా ఉంటే కరోనా వైరస్ గాలిలో చేరిన నాలుగు గంటల తర్వాత కూడా వ్యాప్తి చెందే అవకాశం ఉందని అమెరికాలోని సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) పేర్కొంది. కరోనా వ్యాధిగ్రస్తుల నుంచి వెలువడే తుంపర్లు, రేణువులు పొగలా గాలిలో కలిసిపోయి నేలమీద పడతాయని, అందుకే ఆరడుగుల దూరం నిబంధన పెట్టినట్టు తెలిపింది. అయితే, తుంపర్లలోని వైరస్ కొన్ని సెకన్ల నుంచి గంటల వరకు గాలిలో ఉంటుందని, ఇది రెండుమీటర్ల దూరం వరకు ప్రయాణించగలదని వివరించింది. వెలుతురు తక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఆరడుగుల దూరం పాటించినప్పటికీ వైరస్ ఇతరులకు సోకినట్టు ఆధారాలు ఉన్నట్టు సీడీసీ తెలిపింది. కాబట్టి తక్కువ వెలుతురు ఉన్న ప్రదేశాల్లో అప్రమత్తంగా ఉండాలని సూచించింది.