
New Delhi, December 17: దేశ వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 24,010 కరోనా వైరస్ కేసులు (Coronavirus in India) బయటపడగా.. మొత్తం కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య 99,56,558కు చేరింది. అదే విధంగా గడిచిన 24 గంటల్లో దేశంలో కరోనా వైరస్‌తో 355 మంది మృతి (Covid Deaths) చెందారు. ఈ మేరకు గురువారం కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. ఇప్పటి వరకు దేశంలో కరోనా నుంచి వివిధ ఆస్పత్రుల ద్వారా కోలుకొని డిశ్చార్జ్ అయిన వారి మొత్తం సంఖ్య 94,89,740గా ఉంది. ఇప్పటివరకు మొత్తం కోవిడ్ మృతుల సంఖ్య 1,44,451కు చేరింది. ప్రస్తుతం దేశంలో దేశంలో 3,22,366 కరోనా కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి.
కరోనావైరస్ సెకండ్ వేవ్ (Covid Second Wave)నేపధ్యంలో రాబోయే ఐదారు నెలలు అప్రమత్తంగా ఉండాలని మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ (Bill Gates) హెచ్చరించారు. అమెరికా సహా వివిధ దేశాల్లో కరోనా కేసులు ఇటీవలి కాలంలో భారీగా పెరగడంతో పాటు, మరణాలు కూడా ఎక్కువవుతోన్న నేపధ్యంలో బిల్‌గేట్స్ ఈ సూచనలు చేశారు. వచ్చే నాలుగు నెలల నుండి ఆరు నెలల వరకు కరోనా ప్రభావం తీవ్రంగా ఉండొచ్చు. ఐహెచ్‌ఎంఈ(ఇనిస్టిట్యూట్ ఫర్ హెల్త్ మెట్రిక్స్ అండ్ ఎవాక్యులేషన్) అంచనాల మేరకు రెండు లక్షల అదనపు మరణాలు నమోదు కావొచ్చని బిల్ గేట్స్ పేర్కొన్నారు.
మాస్కులు ధరించడం వంటి జాగ్రత్తలను పాటిస్తే మరణాలను ఎక్కువ శాతం నివారించవచ్చునని బిల్ గేట్స్ అన్నారు. కరోనా కారణంగా అమెరికాలో ఇప్పటి వరకు 2.90 లక్షల మంది మృతి చెందారని తెలిపారు. పలు దేశాల్లో అనారోగ్య సమస్యలు సృష్ఠిస్తున్న కరోనాను ఎదుర్కొనేందుకు ప్రజలు మాస్కులు ధరించడం, సామాజిక దూరం, పరిశుభ్రతను పాటించడం తప్పనిసరి అన్నారు. లేదంటే వైరస్ మరింత విజృంభించే ప్రమాదముందని, దీంతో మరణాల సంఖ్య సైతం పెరిగే అవకాశముందని హెచ్చరించారు.
2015 లోనే అంచనా... కరోనా వ్యాక్సీన్ పరిశోధనల కోసం తమ ఫౌండేషన్ భారీగా నిధులు సమకూరుస్తోందని బిల్‌గేట్స్ తెలిపారు. వైరస్‌ల కారణంగా అత్యధిక సంఖ్యలో మరణాలు చోటుచేసుకోవచ్చునని 2015 లోనే తాను అంచనా వేశానని, కాగా... కరోనా నేపధ్యంలో తన అంచనాలకు మించి ఇప్పుడు మరణాలు చోటు చేసుకుంటున్నాయంటూ గేట్స్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ వైరస్ కారణంగా అమెరికాతో పాటు ప్రపంచంపై పడిన ఆర్థిక ప్రభావం ఆందోళన కలిగిస్తోందని పేర్కొన్నారు.
ఇక కరోనా వల్ల మరిన్ని మరణాలు సంభవించవచ్చునంటూ ఐహెచ్‌ఎంఈ అంచనా వేసిన నేపధ్యంలో మరింత ఆందోళన రేకెత్తుతోందన్నారు. మాస్కులు, సామాజిక దూరం వంటి జాగ్రత్తలతో ఈ పరిస్థితులను సమర్ధవంతంగా ఎదుర్కోగలమని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. పేద దేశాలకు అమెరికా సహకారం ఉండాల్సి ఉంటుందని అభిప్రాయపడ్డారు. వ్యాక్సీన్ల సామర్థ్యాన్ని అమెరికా పెంచుకోవాలని అభిప్రాయపడ్డారు.