New Delhi, May 3: భారతదేశంలో కరోనా పాజిటివ్ కేసులు అంతకంతకూ పెరుగుతూ పోతున్నాయి. దాదాపు 40 వేల మార్క్ ను చేరుకున్నాయి. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా మరో 2,644 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు ఒక్కరోజులో నమోదైన కేసుల్లో ఇదే అత్యధికం. దీంతో భారతదేశంలో మొత్తం COVID-19 బాధితుల సంఖ్య ఆదివారం ఉదయం నాటికి 39,980 దాటింది. నిన్న ఒక్కరోజే 83 కోవిడ్ మరణాలు నమోదయ్యాయి, దీంతో ఈ వ్యాధి కారణంగా ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 1301కి పెరిగిందని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో పేర్కొంది. ఇక ఇప్పటివరకు 10,633 మంది బాధితులు కోలుకొని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ కాగా, ప్రస్తుతం దేశంలో 28,046 యాక్టివ్ కేసులు ఉన్నాయని ఆరోగ్య శాఖ అధికారులు పేర్కొన్నారు.
ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ప్రకారం, భారతదేశంలో COVID-19 నిర్ధారణ కోసం ఒక మిలియన్ RT-PCR పరీక్షలను నిర్వహించింది. దేశవ్యాప్తంగా 292 ప్రభుత్వ మరియు 97 ప్రైవేట్ ల్యాబ్ లలో RT-PCR పరీక్షలు నిర్వహించే సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి.
ఇక రాష్ట్రాల వారీగా చూస్తే, మహారాష్ట్రలో పరిస్థితి రోజురోజుకి చేయిదాటి పోతుంది. దేశంలో ఒక రోజులో నమోదయ్యే కేసుల్లో దాదాపు సగభాగం మహారాష్ట్ర నుంచే ఉంటున్నాయి. ఈరోజు ఉదయం నాటికి మహారాష్ట్రలో కోవిడ్-19 కేసుల సంఖ్య 12,296 కు చేరుకుంది. అలాగే మరణాల సంఖ్య 521 కు పెరిగింది. మహారాష్ట్రలో నమోదైన మొత్తం పాజిటివ్ కేసుల్లో సుమారు 8000కు పైగా కేసులు, 300కు పైగా మరణాలు ఒక్క ముంబై నగరంలోనే నమోదయ్యాయి.
మహరాష్ట్ర తర్వాత గుజరాత్ రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య ఈరోజు వరకు 5,054 కు చేరగా 262 కరోనా మరణాలు నమోదయ్యాయి. దిల్లీలో 4122, మధ్యప్రదేశ్ 2846, రాజస్థాన్ 2770, తమిళనాడు 2757, ఉత్తర ప్రదేశ్ 2487 మరియు పశ్చిమ బెంగాల్ లో 922 కేసులు.
అలాగే పంజాబ్ 772, కర్ణాటక 601, కేరళ 499, బీహార్ 481, హరియాణ 360, ఒడిశా 157, జార్ఖండ్ 115, చండీఘర్ 88, ఉత్తరాఖండ్ 59, అస్సాం 43, ఛత్తీస్‌ఘర్ 43, హిమాచల్ ప్రదేశ్ 40, మేఘాలయ 12, గోవా 7, త్రిపుర 4, మిజోరం 1, అరుణాచల్ ప్రదేశ్ 1 కేసులు నమోదయ్యాయి. యూటీలైన జమ్మూ కాశ్మీర్ 666, లడఖ్ 22, అండమాన్ మరియు నికోబార్ దీవులు 33, పుదుచ్చేరిలలో 8 చొప్పున పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
ఇక తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కోవిడ్-19 పాజిటివ్ కేసులు 1525కు చేరగా, తెలంగాణలో 1061కు పెరిగాయి.