GSLV- F10: జీఎస్ఎల్‌వీ- ఎఫ్10 రాకెట్ ప్రయోగం విఫలం, క్రయోజనిక్ దశలో మరో మార్గంలో ప్రయాణించిన రాకెట్, మిషన్ పూర్తికాలేదని అధికారికంగా ప్రకటించిన ఇస్రో
Image of GSLV F10 before launch | Photo: ISRO

Sriharikota, August 12: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) గురువారం ఉదయం చేపట్టిన జీఎస్ఎల్‌వీ- ఎఫ్10 రాకెట్ ప్రయోగం విఫలమైంది. మొదటి రెండు, దశల్లో ప్రయోగం విజయవంతంగానే జరిగినప్పటికీ క్రయోజనిక్ దశలో సాంకేతిక సమస్య తలెత్తడం ద్వారా ఇగ్నిషన్ జరగలేదు, దీంతో రాకెట్ గమనం నిర్ధేషిత దిశలో కాకుండా మరో మార్గంలోకి వెళ్లిపోయింది. ఈ క్రమంలో రాకెట్ ప్రయోగం విఫలమైనట్లు ఇస్రో అధికారికంగా ప్రకటించింది.

భూఉపరితల పరిశీలన కోసం EOS-03 ఉపగ్రహాన్ని భూమికి 36 వేల కిలోమీటర్ల ఎత్తులో జీఎస్ఎల్‌వీ- ఎఫ్10 రాకెట్ ద్వారా ఇస్రో భూసుస్థిర కక్ష్యలో ప్రవేశపెట్టాలని భావించింది. దేశభద్రత అవసరాలు, సరిహద్దుల్లో రక్షణ వ్యవస్థ, పంటలు, అడవులు, నీటివనరులు, భవిష్యత్ ప్రకృతి వైపరీత్యాలను ముందుగానే పసిగట్టే వ్యవస్థలు తదితర సమాచారాన్ని తెలుసుకోవటానికి ఇస్రో ఈ ప్రయోగం చేపట్టింది.

గతేడాదిలోనే నిర్వహించాల్సి ఉన్న ఈ ప్రయోగం కరోనా వ్యాప్తి మరియు ఇతర సాంకేతిక కారణాలతో వాయిదాపడుతూ వచ్చింది. ఎట్టకేలకు ఈరోజు ప్రయోగం చేపట్టినా అది విఫలం కావడంతో ఇస్రో వర్గాలు నిరాశలో మునిగిపోయాయి.

Here's the update: 

గురువారం షెడ్యూల్ చేసినట్లుగానే ఉదయం 5.43 గంటలకు శ్రీహరికోటలోని సతీష్‌ ధావన్‌ స్పేస్‌ సెంటర్‌ నుంచి #GSLVF10 రాకెట్‌ను ఇస్రో ప్రయోగించింది. దీని కోసం బుధవారం తెల్లవారుజామున 3.43 గంటలకు కౌంట్‌డౌన్‌ ప్రారంభించారు. మంగళవారం ఉదయం ఇస్రో చైర్మన్‌ శివన్‌ నేతృత్వంలో షార్‌లో మిషన్‌ సంసిద్ధత సమావేశం జరిగింది. అనంతరం ప్రయోగ పనులను లాంచ్‌ ఆథరైజేషన్‌ బోర్డు(ల్యాబ్‌)కు అప్పగించారు. ల్యాబ్‌ చైర్మన్‌ ఆర్ముగం రాజరాజన్‌ ఆధ్వర్యంలో శాస్త్రవేత్తలు మధ్యాహ్నం మరోసారి సమావేశమై కౌంట్‌డౌన్, ప్రయోగంపై చర్చించారు. రాకెట్‌లోని రెండో దశలో భాగంగా ద్రవ ఇంధనాన్ని నింపే ప్రక్రియను బుధవారం తెల్లవారుజామున కౌంట్‌డౌన్‌ ప్రారంభమైన వెంటనే చేపట్టారు. 26 గంటల కౌంట్‌డౌన్‌ అనంతరం గురువారం ఉదయం 5.43కు ఎర్త్‌ అబ్జర్వేషన్‌ శాటిలైట్‌(ఈవోఎస్‌)-03తో జీఎస్‌ఎల్‌వీ రాకెట్‌ నింగిలోకి దూసుకెళ్లింది. రెండో దశ విజవంతంగా పూర్తి చేసుకుంది, మూడో దశలో మాత్రం సాంకేతిక లోపం తలెత్తడంతో మిషన్ అసంపూర్ణంగా ముగిసింది.