Ranchi, December 24: జార్ఖండ్ ఎన్నికల ఫలితాల్లో (Jharkhand Election Results)బీజేపీకి అనుకోని ఎదురుదెబ్బ తగిలింది. ఇంకా తేరుకోని షాక్ ఏంటంటే ఆ రాష్ట్ర సీఎం రఘుబర్ దాస్ (Raghubar Das ) స్వతంత్ర అభ్యర్థి చేతిలో ఓటమి పాలవ్వడం.. అధికారంలో ఉన్న పార్టీకి చెందిన.. అది కూడా ముఖ్యమంత్రి హోదాలో ఉన్న రఘుంబర్ దాస్ ఓ స్వతంత్ర అభ్యర్థి చేతిలో ఓడిపోవడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
జంషెడ్‌పూర్ ఈస్ట్ (Jamshedpur East)స్థానం నుంచి ఇండిపెండెంట్‌గా పోటీ చేసిన సరయూ రాయ్ (Saryu Rai) 8550 ఓట్ల తేడాతో రఘుబర్ దాస్‌ను ఓడించారు. ఈ నేపథ్యంలో అసలు సరయూ రాయ్ ఎవరు, ఆయన బ్యాక్ గ్రౌండ్ ఏంటీ లాంటి విషయాలు అందరికీ ఆసక్తి కలిగిస్తున్నాయి. జార్ఖండ్ మాజీ మంత్రి, బీజేపీ బహిష్కృత నేత సరయూ రాయ్ ప్రస్థానాన్ని ఓ సారి పరిశీలిస్తే..
2005లో ఆయన తొలిసారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2009 ఎన్నికల్లో 3 వేల ఓట్ల తేడాతో కాంగ్రెస్ అభ్యర్థి బన్నా గుప్తా చేతిలో ఓడారు. విభజనకు ముందు బీహార్‌లో ఎమ్మెల్సీగా ఆయన పని చేశారు ఇక 2014లో రాయ్ జంషెడ్‌పూర్ వెస్ట్ నుంచి బీజేపీ తరపున పోటీ చేసి గెలుపొందారు. దాదాపు 10 వేల ఓట్ల తేడాతో బన్నా గుప్తాపై గెలుపొందారు. అయితే 2019 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ పార్టీ ఆయనకు టికెట్ నిరాకరించడంతో రఘుబర్ దాస్ కాబినెట్ నుంచి వైదొగిలిన రాయ్ బీజేపీకి (BJP) రాజీనామా చేశారు. జంషెడ్‌పూర్ ఈస్ట్ నుంచి ఇండిపెండెంట్‌గా పోటీ చేశారు. ఏకంగా సీఎం రఘుబర్ దాస్ నియోజకవర్గంలో పోటీకి దిగి బీజేపీ గుండెల్లో రైళ్లు పరుగెత్తించారు.
సరయూ రాయ్ ఆరెస్సెస్ అనుబంధ సంస్థ నుంచి రాజకీయాల్లోకి ప్రవేశించారు. 1974లో భారతీయ జనతా యువ మోర్చాలో చేరారు. అక్కడినుంచి బీజేపీలో చేరి అంచెలంచెలుగా ఎదిగారు. బీజేపీ ప్రభుత్వంలో మంత్రిగా కూడా పనిచేశారు.1951 జులై 16న జన్మించిన సరయూ రాయ్.. 1970-72లో పట్నా యూనివర్సిటీ నుంచి మాస్టర్స్ పూర్తి చేశారు. గతంలో ఇద్దరు సీఎంలను ఇంటి దారి పట్టించిన సరయూ ఈసారి బీజేపీకి కూడా ఝలక్ ఇచ్చారు. కాగా సరయూ రాయ్‌కి గెయింట్ కిల్లర్‌గా గుర్తింపు ఉన్నది.
బీహర్ సీఎంగా ఉన్న సమయంలో ఆర్జేడీ చీప్ లాలు ప్రసాద్ యాదవ్ చేసిన రూ.950 కోట్ల గడ్డి దాణా కుంభకోణం వెలుగులోకి వచ్చేందుకు కారకుల్లో సరయూ రాయ్ ఒకరు. దాణా కుంభకోణంలో జరిగిన అవకతవకలను బయటకు తీసుకొచ్చారు. 1996లో సరయూ రాసిన లేఖ వల్ల అప్పటి బీహార్ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్‌పై అవినీతి విచారణ జరిగింది.
ఈ కుంభకోణంలోనే బిహార్ మాజీ సీఎం లాలు ప్రసాద్ యాదవ్ సహా పలువురు సీనియర్ రాజకీయ నాయకులు జైలుపాలయ్యారు.దీంతోపాటు మధుకోడా జార్ఖండ్ సీఎంగా ఉన్న సమయంలో జరిగిన రూ. 4 వేల కోట్ల మైనింగ్ స్కాంను వెలుగులోకి తీసుకురావడంలో కూడా సరయూ రాయ్ పాత్ర ఉంది. మధు కోడా హయాంలో రూ.8 వేల కోట్ల ఐరన్ ఓర్ గనుల కేటాయింపు కుంభకోణాన్ని కూడా ఆయన బయటపెట్టారు.
పారా టీచర్ల నియామకం, అంగన్‌వాడీ కార్మికుల సమస్యలను రఘుబర్ హ్యాండిల్ చేసిన తీరు పట్ల ప్రజలు అసహనంతో ఉన్నట్లు సరయూ ఆరోపించారు. జార్ఖండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎటువంటి నియామకాలు చేయకపోవడం కూడా సీఎం రఘుబర్‌పై వ్యతిరేకతకు దారి తీసింది.
జార్ఖండ్‌లో రెండు ప్రధాన నదులైన దామోదర్, సుబర్నరేఖ బచావో పేరుతో ఉద్యమం కూడా చేపట్టారు. ఈ నదుల వల్లే జార్ఖండ్ ప్రజల జీవనం ఆధారపడి ఉందని ఎలుగెత్తిచాటారు. దీనిపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ.. ఉద్యమించారు. ఆసియా ఖండంలో అతిపెద్ద అటవీ సరండాలో జీవవైవిధ్యం, పర్యావరణ వ్యవస్థను కాపాడేందుకు ఉద్యమించారు. అక్రమ మైనింగ్ జరగడం వల్లే పర్యావణం దెబ్బతింటుందని ప్రజలకు అవగాహన కల్పిస్తూ నేటికీ ముందుకుసాగుతున్నారు.
గత అయిదేళ్ల పాలనలో సీఎం రఘుబర్ తీవ్ర అవినీతికి పాల్పడినట్లు సరయూ ఆరోపించారు. అయితే ఎప్పుడైతే సరయూ ఇండిపెండెంట్ అభ్యర్థిగా పేరు ప్రకటించారో, అప్పుడే హేమంత్ సోరెన్ ఆయనకు మద్దతు పలికారు. గతంలో జెంషెడ్‌పూర్ వెస్ట్ నుంచి పోటీ చేసిన సరయూ.. ఈసారి జెంషెడ్‌పూర్ ఈస్ట్ నుంచి రంగంలోకి దిగారు. ఇప్పుడు ఈ ఓటమిని బీజేపీ జీర్ణించుకోలేకపోతోంది. ఎందుకంటే సీఎంతో పాటు ఆరుగురు మంత్రులు, స్పీకర్ కూడా ఓడిపోయారు. ఏకంగా సీఎం రఘుబర్ దాస్ ఘోర పరాజయం పాలవడంతో బీజేపీ శ్రేణులు తట్టుకోలేకపోతున్నారు.
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ మరో రాష్ట్రాన్ని కోల్పోయింది. జేఎంఎం, కాంగ్రెస్, ఆర్జేడీ కూటమి హవాలో బీజేపీ నిలవలేకపోయింది. అధికారాన్ని కోల్పోయి ప్రతిపక్షంలో కూర్చోబోతోంది. జేఎంఎం పార్టీ నేత హేమంత్ సోరెన్ సీఎంగా పగ్గాలు చేపట్టబోతున్నారు. 81 సీట్లున్న ఝార్ఖండ్ అసెంబ్లీ జేఎంఎం (ఝార్ఖండ్ ముక్తి మోర్చా) కూటమి 47, బీజేపీ 25, ఝార్ఖండ్ వికాస్ మోర్చా (జీవీఎస్) 3, ఆల్ ఝార్ఖండ్ స్టూడెంట్ యూనియన్ (AJSU) 2 సీట్లలో గెలిచారు. ఇక జేఎంఎం కూటమిలో జేఎంఎంకు 30, కాంగ్రెస్ 16, ఆర్జేడీ 5 సీట్లలో విజయం సాధించారు.