New Delhi, April 6: భారత సుప్రీంకోర్టు 48వ ప్రధాన న్యాయమూర్తిగా తెలుగువాడు జస్టిస్ ఎన్వీ రమణ (Justice NV Ramana) నియమితులయ్యారు. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆయనను నూతన సీజేఐగా నియమించారు. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. ఈ నెల 24వ తేదీన ఎన్వీ రమణ సీజేఐగా బాధ్యతలు (48th Chief Justice of India) స్వీకరించనున్నారు. ప్రస్తుత సీజేఐ ఎస్ఏ బోబ్డే ఈ నెల 23న పదవీ విరమణ చేయనుండటంతో ఆయన స్థానంలో నూతన సీజేఐగా ఎన్వీ రమణను నియమించారు. వచ్చే ఏడాది ఆగస్టు 26 వరకు ఆయన ఈ పదవిలో కొనసాగనున్నారు.
కాగా, తదుపరి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా ఎన్వీ రమణ పేరును ప్రస్తుత సీజేఐ ఎస్ఏ బోబ్డే ఇటీవల సిఫారసు చేశారు. బోబ్డే తర్వాత ఎన్వీ రమణనే సుప్రీంకోర్టులో అత్యంత సీనియర్ న్యాయమూర్తిగా ఉండటంతో ఆయన తదుపరి సీజేఐగా అవకాశం దక్కింది.
జస్టిస్ ఎన్వీ రమణ 1957, ఆగస్ట్ 27న కృష్ణా జిల్లా పొన్నవరంలో ఓ వ్యవసాయ కుటుంబంలో జన్మించారు. 2017, ఫిబ్రవరి 14 నుంచి సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పనిచేస్తున్నారు. అంతకుముందు ఆరు నెలలపాటు ఆయన ఢిల్లీ హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా పనిచేశారు.
2000, జూన్ 27 నుంచి 2013, సెప్టెంబర్ 1 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో న్యాయమూర్తిగా పని చేశారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అదనపు అడ్వకేట్ జనరల్ గా పనిచేశారు. ఏపీ నుంచి సీజేఐగా బాధ్యతలు స్వీకరించనున్న రెండో వ్యక్తిగా ఘనత సాధించారు. జస్టిస్ రమణ కన్నా ముందు జస్టిస్ కె. సుబ్బారావు సీజేఐగా పనిచేశారు. దాంతో పాటు 1966–67 నుంచి ఇప్పటిదాకా తొమ్మిదో సీజేఐగానూ జస్టిస్ రమణ నిలవనున్నారు.
గతేడాది అక్టోబర్‌లో ఏపీ సీఎం జగన్మోహన్‌రెడ్డి.. ఎన్వీ రమణపై అవినీతి ఆరోపణలు చేస్తూ సీజేఐకి లేఖ రాశారు. అమరావతిలో ఆయనతోపాటు ఆయన బంధువులు భూ సేకరణ విషయంలో అక్రమాలకు పాల్పడినట్లు జగన్ ఆరోపించారు. అంతేకాకుండా ఏపీ హైకోర్టులో జరుగుతున్న విచారణలను ప్రభావితం చేసి తన ప్రభుత్వాన్ని అస్థిర పరిచే కుట్ర కూడా చేస్తున్నట్లు జగన్ ఆ లేఖలో చెప్పారు. దీనిపై విచారణ జరపాలని ఆయన కోరారు.