New Delhi, March 6: జస్టిస్ మురళీధర్ (Justice S Muralidhar)...ఈ పేరు వినే ఉంటారు. ఢిల్లీ అల్లర్లకు (Delhi Violence) కారణమైన విద్వేష ప్రసంగాలు చేసిన బీజేపీ నేతలపై కేసు నమోదు చేయడంలో విఫలమయ్యారంటూ ఢిల్లీ పోలీసులపై మండిపడ్డారు. ఆ తర్వాత ఆయన పంజాబ్ అండ్ హర్యానా హైకోర్టుకు బదిలీ చేస్తున్నట్లు కొలీజియం సిఫారసు చేసింది. ఈ వ్యవహారంపై ఆయన తాజాగా వివరణ ఇచ్చారు.
ఢిల్లీ అల్లర్లు..అర్థరాత్రి విచారణ చేసిన న్యాయమూర్తి బదిలీ
తనను ఢిల్లీ హైకోర్టు (Delhi High Court) నుంచి పంజాబ్ అండ్ హర్యానా హైకోర్టుకు బదిలీ చేయడానికి కొలీజియం చేసిన సిఫారసుపై తనకు ముందుగానే సమాచారం అందిందని జస్టిస్ మురళీధర్ చెప్పారు. బదిలీ విషయంలో తనకు ఎటువంటి సమస్య లేదని ఆయన అన్నారు.
గురువారం ఢిల్లీ హైకోర్టులో జస్టిస్ మురళీధర్ వీడ్కోలు (Justice S Muralidhar farewell) సభ జరిగింది. ఢిల్లీ హైకోర్టు బార్ అసోసియేషన్ నిర్వహించిన ఈ సభలో న్యాయమూర్తులు, న్యాయవాదులు పాల్గొన్నారు. వీరిని ఉద్దేశించి జస్టిస్ మురళీధర్ మాట్లాడుతూ.. పంజాబ్ అండ్ హర్యానా హైకోర్టుకు తనను బదిలీ చేసేందుకు కొలీజియం చేసిన సిఫారసుపై భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ బాబ్డే నుంచి తనకు ఫిబ్రవరి 17న సమాచారం అందిందని జస్టిస్ మురళీధర్ చెప్పారు.
సీఏఏ హింసపై మండిపడిన ఢిల్లీ హైకోర్టు
తనను ఢిల్లీ హైకోర్టు నుంచి బదిలీ చేయాలనుకుంటే, పంజాబ్ అండ్ హర్యానా హైకోర్టుకు (Punjab & Haryana High Court) వెళ్ళటానికి తనకు ఎటువంటి ఇబ్బంది లేదని వివరించారు.
ఈశాన్య ఢిల్లీలో జరిగిన హింసాకాండపై జోక్యం చేసుకోవాలని కోరుతూ హర్ష్ మందర్ దాఖలు చేసిన పిటిషన్‌పై ఫిబ్రవరి 26న జస్టిస్ మురళీధర్ నేతృత్వంలోని ఢిల్లీ హైకోర్టు ధర్మాసనం విచారణ జరిపింది. ఈ సందర్భంగా ముగ్గురు బీజేపీ నేతలపై ప్రాథమిక సమాచార నివేదిక (ఎఫ్ఐఆర్) నమోదు చేయనందుకు ధర్మాసనం ఢిల్లీ పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేసింది. అదే రోజు రాత్రి జస్టిస్ మురళీధర్‌ను పంజాబ్ అండ్ హర్యానా హైకోర్టుకు బదిలీ చే్స్తూ కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది.
ఢిల్లీ అల్లర్లపై స్పందించిన ప్రధాని మోదీ
కాంగ్రెస్ సీనియర్ నేత ప్రియాంక గాంధీ ‘అర్ధరాత్రి జస్టిస్ మురళీధర్ బదిలీ ప్రస్తుత ప్రభుత్వం ఇచ్చిన షాక్ ఏమీ కాదు, కానీ ఇది కచ్చితంగా విచారకరం, సిగ్గు చేటు’ అని ఫిబ్రవరి 27న ట్విట్టర్ ద్వారా విమర్శించారు.
దీనిపై న్యాయ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ ఘాటుగా స్పందించారు. సుస్థిరమైన ప్రక్రియ ప్రకారం న్యాయమూర్తుల బదిలీలు జరుగుతాయని, న్యాయమూర్తుల సమ్మతి కూడా ఈ ప్రక్రియలో భాగమేనని తెలిపారు. క్రమబద్ధంగా జరిగే బదిలీని రాజకీయం చేయడం ద్వారా కాంగ్రెస్ పార్టీ న్యాయ వ్యవస్థ పట్ల తనకు గల చులకన భావాన్ని మరోసారి వ్యక్తం చేసిందని దుయ్యబట్టారు.