Delhi, June 9: దేశ రాజధాని ఢిల్లీలో కోవిడ్-19 (COVID-19) వైరస్ విజృంభిస్తోంది. అక్కడ భారీగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. సాధారణ ప్రజలతో పాటు డాక్టర్లు, పోలీసులు, రాజకీయ నేతలు కూడా కరోనా బారినపడుతున్నారు. తాజాగా బీజేపీ యువ నేత జ్యోతిరాదిత్య సింధియాకు (Jyotiraditya Scindia) కరోనా సోకింది. ఆయన తల్లి మాధవి రాజే సింధియా (Madhavi Raje Scindia) కూడా కరోనా బారిన పడ్డారు. ఢిల్లీలోని మ్యాక్స్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి వారిద్దరినీ తరలించారు. హోం క్వారంటైన్‌లోకి ఢిల్లీ సీఎం, జ్వరం,గొంతు నొప్పితో బాధపడుతున్న అరవింద్ కేజ్రీవాల్, కోవిడ్-19 టెస్ట్ చేయించుకుంటారని ప్రకటించిన ఢిల్లీ ప్రభుత్వం
ఇద్దరూ జ్వరం, గొంతునొప్పితో బాధపడుతున్నారు. ఇద్దరికీ పరీక్షలు చేశారు. కరోనా సోకినట్లు వైద్యులు నిర్దారించారు. నాలుగు రోజులుగా సింధియాలకు చికిత్స అందుతోంది. జ్యోతిరాదిత్యలో కరోనా లక్షణాలు బయటపడగా ఆయన తల్లిలో మాత్రం ఎలాంటి లక్షణాలూ బయటపడలేదు.
ఇటీవలే బీజేపీ అధికారిక ప్రతినిధి సంబిత్ పాత్ర కూడా కరోనా లక్షణాలతో గురుగ్రామ్ మేదాంత ఆసుపత్రిలో చేరి చికిత్స పొందారు. కోలుకుని నిన్ననే డిశ్చార్జ్ అయ్యారు. గుర్‌గావ్‌లోని మేదాంత ఆస్పత్రిలో ఆయన ట్రీట్ మెంట్ తీసుకున్నారు. చికిత్స అనంతరం సోమవారం ఆయన ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. ఇక ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కూడా దగ్గు, జ్వరంతో బాధపడుతున్నారు. కరోనా లక్షణాలు ఉండడంతో సెల్ఫ్ ఐసోలేషన్‌లో ఉన్నారు. ఇవాళ ఆయనకు కరోనా పరీక్షలు నిర్వహించారు. రిపోర్టులు రావాల్సి ఉంది. ఐతే రిపోర్టుల్లో ఏం తేలుతుందన్న దానిపై ఉత్కంఠ నెలకొంది.
ఢిల్లీలో కరోనా పరిస్థితిపై లెఫ్టెనెంట్ గవర్నర్ అనిల్ బైజాల్ సమీక్షా సమావేశం నిర్వహించారు. సమావేశానికి ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా, ఢిల్లీ ఆరోగ్య మంత్రి సత్యేంత్ర జైన్ హాజరయ్యారు. సమావేశానంతరం సిసోడియా మాట్లాడుతూ జులై 31 నాటికి ఢిల్లీలో ఐదున్నర లక్షల కేసులు నమోదవుతాయని చెప్పారు. జులై 31 నాటికి కేవలం ఢిల్లీకి 80 వేల బెడ్లు అవసరమని చెప్పారు. జూన్ 30 నాటికి కనీసం 15 వేల బెడ్లు అవసరమౌతాయని చెప్పారు. అయితే ఢిల్లీలో కరోనా సామాజిక వ్యాప్తి లేదని సిసోడియా తెలిపారు.
అంతకు ముందు మీడియా సమావేశంలో మాట్లాడిన సత్యేంత్ర జైన్ మాత్రం ఢిల్లీలోకరోనా సామాజిక వ్యాప్తి ఉందన్నారు. కరోనా ఎవరి నుంచి ఎలా ఎప్పుడు సోకిందో తెలియని కేసులు సగానికి పైగా నమోదౌతున్నాయని చెప్పారు.
మరోవైపు ఢిల్లీ లెఫ్టెనెంట్ గవర్నర్ అనిల్ బైజాల్ ఢిల్లీలో కరోనా పరిస్థితిపై అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేయనున్నారు. ఢిల్లీలో ప్రస్తుతం 27, 654 కేసులు నమోదయ్యాయి. 10, 664 మంది కోలుకున్నారు. 761 మంది చనిపోయారు.