Bengaluru, Mar 05: కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప (Karnataka CM BS Yediyurappa) 2020-21 ఆర్థిక సంవత్సరానికిగాను అసెంబ్లీలో గురువారం రాష్ట్ర బడ్జెట్ (Karnataka Budget 2020) ప్రవేశపెట్టారు. యడియూరప్ప అసెంబ్లీలో (Karnataka Assembly) రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టడం ఇది ఏడవసారి. కాగా ముఖ్యమంత్రిగా ఆయనకు ఇది అయిదవ సారి. ఈ బడ్జెట్లో వ్యవసాయం, నీటిపారుదల, వరద ప్రభావిత ప్రాంతాల అభివృద్ధి కోసం ఈ బడ్జెట్‌లో పెద్ద పీట వేశారు. బీజేపీ ఎన్నికల మేనిఫెస్టో వాగ్దానాలు కొన్నింటికి ఈ బడ్జెట్‌లో చోటు కల్పించారు.
ఈ బడ్జెట్లో నీటిపారుదల శాఖకు రూ. 5520 కోట్ల కేటాయింపులు ఇచ్చారు. గోవా, కర్ణాటక, మహారాష్ట్రాల మీదుగా ప్రవహించే మహదాయి నది జలాలను వినియోగం కోసం 500 కోట్లను కేటాయించారు. అలాగే తుంగభద్ర రిజర్వాయర్ మరమ్మతులకు రూ. 20 కోట్లు కేటాయించారు. వివిధ ఎత్తిపోతల ప్రాజెక్టుల కోసం 5000 కోట్ల రూపాయలు కేటాయించారు.
నీతి ఆయోగ్ ప్రతిపాదన ప్రకారం జిల్లా ఆస్పత్రులను ప్రైవేటు పరం చేసేందుకు, అలాగే అన్నీ ప్రభుత్వాస్పుతులలో ఐసియు విభాగాలను మెరుగుపరిచేందుకు ప్రైవేటు ఆస్పత్రుల సహకారంతో పనిచేయాలని బడ్జెట్‌లో ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదనలని పైలట్ ప్రాజెక్ట్‌గా రెండు జిల్లాలో అమలు చేస్తారు. అలాగే దారిద్ర్య రేఖ దిగువనున్న వారికి కడుపు, కాలేయం సమస్యల వైద్యం అయిదు జిల్లాలలో ఉచితం. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో ఆరు సంవత్సరాలలోపు చెవిటి పిల్లలకు ఉచితంగా మందులు పంపిణీ చేస్తారు. హావేరీ జిల్లాలో ఓ 20 పడకల ఆయుష్ ఆస్పత్రి ఏర్పాటుకు ప్రతిపాదించారు.
డాక్టర్, నర్సు, ఫార్మసీ కోర్సులు చేసిన విద్యార్థులకు ఉద్యోగ కల్పన కోసం రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్‌లో ఒక ప్లేస్‌మెంట్ సెల్ ఏర్పాటు చేస్తారు. అలాగే ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ప్రతి కళాశాలలో మూడు కోట్లతో స్టిమూలేషన్, మాలికులార్ బయాలజీ లాబ్‌లను ఏర్పాటు చేయనున్నారు.
వచ్చే విద్యా సంవత్సరం నుంచి 400 ఉర్దూ స్కూళ్లలో ఇంగ్లీషు మీడియం బోధనలు ప్రారంభించనున్నారు. నియోజకవర్గాలలో ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి కోసం ప్రతి ఎమ్మెల్యే మూడు ప్రభుత్వ పాఠశాలలను దత్తత తీసుకొని వాటి అభివృద్ధి కోసం కృషి చేయాలి. ప్రతి నెలలో రెండు శనివారాలు పిల్లలకు బ్యాగులు, పుస్తుకాలు లేకుండా పాఠశాలలో కార్యక్రమాలు జరపాలని ప్రతిపాదించారు.
బెంగుళూరులో ట్రాఫిక్ సమస్య, సరస్సుల అభివృద్ధికి 14600 కోట్లను కేటాయించారు. బెంగుళూరు నగరంలో రోజురోజుకీ పెరుగిపోతున్న ట్రాఫిక్ సమస్య పరిష్కరించేందుకు రింగు రోడ్డులు, ఫ్లై ఓవర్ల నిర్మాణాల కోసం 14500 కోట్ల రూపాయలను కేటాయించారు. నగరంలో సరస్సుల అభివృద్ధి కోసం వంద కోట్లు కేటాయించారు.
కళ్యాణ కర్ణాటక రీజియన్ డెవలప్ మెంట్ కోసం రూ.1500 కోట్లను కేటాయించారు. SSLC ఫస్ట్ ర్యాంకు సాధించిన వారికి లక్ష రూపాయలు బహుమానం ఇవ్వనున్నారు. 90 ఎలక్ట్రిక్ బస్సులను కొనుగోలు చేయనున్నారు. ఇన్నోవేసన్ సెంటర్ కోసం రూ. 20 కోట్లను కేటాయించారు. 2450 కొత్త బస్సులను కొనుగోలు చేయనున్నారు.