Mumbai, Dec 7: మహారాష్ట్ర, కర్ణాటక మధ్య సరిహద్దు వివాదం ( Karnataka-Maharashtra Border Row) తీవ్ర రూపం దాలుస్తోంది.రెండు రాష్ట్రాల అనుకూలవాదులు సరిహద్దుల వద్ద నిరసన ప్రదర్శనలు చేపట్టడం, వాహనాలపై పరస్పరం దాడులకు దిగడంతో బార్డర్లో ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో, శాంతి భద్రతలను కాపాడేందుకు చర్యలు తీసుకోవాలని రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఏక్‌నాథ్ షిండే, బసవరాజ బొమ్మై నిర్ణయించుకున్నారు.
ఇదిలా ఉంటే మహారాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకు చెందిన బస్సులపై కర్నాటకలో నిరసనకారులు దాడులు చేస్తున్న కారణంగా మహారాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. మహారాష్ట్ర నుంచి కర్నాటకకు బస్సు సర్వీసులను నిలిపేస్తున్నట్టు (MSRTC Suspends Bus Services to Karnataka) మహారాష్ట్ర రోడ్ ట్రాన్స్‌పోర్ట్ డిపార్టుమెంట్ బుధవారం ఓ ప్రకటనలో తెలిపింది.దాడుల నేపథ్యంలో మహారాష్ట్ర పోలీసులు హెచ్చరించిన (Police Flag Security Alert) కారణంగానే తాము బస్సు సర్వీసులను నిలిపివేశామని అధికారులు తెలిపారు. మళ్లీ పోలీసులు క్లియరెన్స్ ఇచ్చిన తర్వాతనే బస్సు సర్వీసులను పునఃప్రారంభిస్తామని అధికారులు స్పష్టం చేశారు.
రెండు రాష్ట్రాల నడుమ సరిహద్దు వివాదం (Border Row) 1957 నుంచి కొనసాగుతోంది. ప్రస్తుతం కర్ణాటకలో ఉన్న బెళగావితోపాటు మరాఠా భాష మాట్లాడే ప్రజలు అధికంగా ఉన్న 814 గ్రామాలు స్వాతంత్య్రం కంటే ముందు అప్పటి బాంబే ప్రెసిడెన్సీలో భాగంగా ఉండేవి. బెళగావి నగరాన్ని, 814 గ్రామాలను కర్ణాటకలో 1957లో విలీనం చేశారు. కానీ, అవి తమవేనని మహారాష్ట్ర వాదిస్తోంది.
ఈ వివాదం సుప్రీంకోర్టుకు చేరింది. దీనికి ప్రతిగా బెళగావి తమ రాష్ట్రంలో అంతర్భాగమని కర్ణాటక వాదిస్తోంది.ఈ నేపథ్యంలోనే అక్కడ బెంగళూరులోని విధాన సౌధను పోలిన సువర్ణ విధాన సౌధను నిర్మించింది. ఏడాదికోసారి అక్కడ అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తోంది. ప్రస్తుతం దీనిపైనే వివాదం నడుస్తోంది.